పరస్పర అంగీకార విడాకులకు ఆరు నెలల నిరీక్షణ తప్పనిసరి కాదు: హైకోర్టు
కూలింగ్ పిరియడ్‌పై కీలక స్పష్టీకరణ - అనవసర నిరీక్షణ వల్ల మానసిక వేదన తప్ప ప్రయోజనం లేదని హైకోర్టు వ్యాఖ్య - విడాకుల పిటిషన్‌ను త్వరితగతిన విచారించాలని ఒంగోలు కుటుంబ న్యాయస్థానానికి ఆదేశాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 26, 2026 at 7:32 AM IST
High Court On Divorce Cases : భార్యాభర్తలు ఇకపై కలిసి జీవించడానికి అవకాశం లేదని ఓ నిర్ణయానికి వచ్చి వారి మధ్యన ఉన్న వివాదాలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకొని, పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు చట్టంలో నిర్దేశించిన విధంగా ఆరు నెలలు (కూలింగ్ పిరియడ్) వేచి ఉండాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టంచేసింది. వివాహ బంధం పునరుద్ధరించే అవకాశం లేనప్పుడు కేవలం చట్టపరమైన వ్యవధి పేరుతో వేచి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది.
చట్ట ఉద్దేశం ఇదే : హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13బీ(2) ప్రకారం నిర్దేశించిన కూలింగ్ పిరియడ్ ఉద్దేశం భార్యాభర్తలు తమ నిర్ణయాన్ని మరోసారి పునఃసమీక్షించుకుని తిరిగి కలిసి జీవించే అవకాశాన్ని పరిశీలించడానికేనని కోర్టు వివరించింది. అయితే ఇప్పటికే భార్యభర్తలిద్దరూ వారికి ఉన్న వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుని, వారిద్దరూ స్వచ్ఛందంగా విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఆరు నెలలు గడువు విధించడం వల్ల వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదని అభిప్రాయపడింది.
మానసిక వేదన తప్ప ప్రయోజనం లేదు : పునరుద్ధరణకు అవకాశం లేని వివాహ బంధాన్ని బలవంతంగా కొనసాగించాలని చట్టం ఎక్కడా చెప్పదని హైకోర్టు పేర్కొంది. అలాంటి పరిస్థితుల్లో ఆరు నెలల వరకు వేచి ఉండాలని చెప్పడం వల్ల భార్యాభర్తలకు మానసిక వేదనతో పాటు అనవసర ఇబ్బందులు వంటివి మాత్రమే ఎదురవుతాయని హైకోర్టు వ్యాఖ్యానించింది.
సుప్రీంకోర్టు తీర్పుల ప్రస్తావన : ఈ సందర్భంగా అమర్‌దీప్ సింగ్ వర్సెస్ హర్వీన్ కుమార్, అమిత్‌కుమార్ వర్సెస్ సుమన్ బేనివాల్ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను హైకోర్టు గుర్తు చేసింది. భార్యాభర్తలిద్దరూ కలిసి జీవించే అవకాశం లేదని కోర్టు సంతృప్తి చెందినప్పుడు కూలింగ్ పిరియడ్‌ను మినహాయించే అధికారం న్యాయస్థానాలకు ఉందని ఆ రెండు తీర్పులు స్పష్టం చేశాయని కోర్టు పేర్కొంది.
ప్రస్తుత కేసులో భార్యాభర్తలు వారి మధ్యనున్న వివాదాలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకొని స్వచ్ఛందంగా, పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దిగువ కోర్టును ఆశ్రయించినట్లు హైకోర్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో విడాకుల పిటిషన్ విచారణను ముందుకు జరపాలన్న వారి ఇద్దరి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని విడాకుల పిటిషన్ విచారణను వెంటనే ముందుకు తీసుకెళ్లాలని కుటుంబ న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. చట్ట నిబంధనలను అనుసరించి సాధ్యమైనంత త్వరగా తగిన విడాకుల పిటిషన్‌పై ఉత్తర్వులివ్వాలని హైకోర్టు స్పష్టంచేసింది.
ప్రధానాంశాలు :
- భార్యాభర్తల పరస్పర అంగీకార విడాకులకు ఆరు నెలల కూలింగ్ పిరియడ్ ప్రతి సందర్భంలో తప్పనిసరి కాదు.
- కలిసి జీవించే అవకాశం లేదని కోర్టు భావిస్తే నిరీక్షణ గడువుకు మినహాయింపు ఇవ్వొచ్చు.
- కూలింగ్ పిరియడ్ ఉద్దేశం దంపతులకు పునరాలోచనకు అవకాశం కల్పించడం మాత్రమే.
- అనవసర నిరీక్షణ వల్ల భార్యాభర్తలకి మానసిక వేదన తప్ప ఇంకో ప్రయోజనం లేదని హైకోర్టు వ్యాఖ్య.
- విడాకుల పిటిషన్‌ను త్వరితగతిన విచారించాలని ఒంగోలు కుటుంబ న్యాయస్థానానికి ఆదేశాలు.
దర్గప్పకు వైద్య పరీక్షలు నిర్వహించండి - కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు హైకోర్టు ఆదేశం
చిన్నారి ఆచూకీ కనుగొనేందుకు ఏం చర్యలు తీసుకున్నారు? - పోలీసులకు హైకోర్టు ఆదేశం

