ETV Bharat / state

'ఎలాంటి డిజైన్ ఖరారు కాకుండానే కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేపట్టింది'

జస్టిస్​ పీసీ ఘోష్ కమిషన్​ నివేదికను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టులో విచారణ - ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అభిషేక్ సింఘ్వి - నేడు పిటీషన్లపై విచారణ

HC ON PC GHOSE COMMISSION REPORT
HC ON PC GHOSE COMMISSION REPORT (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 2, 2026 at 3:54 PM IST

|

Updated : March 3, 2026 at 9:01 AM IST

3 Min Read
Choose ETV Bharat

HC Hearing On Pc Ghose Commission Report : ఎలాంటి డిజైన్ ఖరారు కాకుండానే రూ.వేల కోట్ల విలువైన కాళేశ్వరం ప్రాజెక్టు పనులను కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిందంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. హై పవర్ కమిటీ, నిపుణుల కమిటీ, కేబినెట్ కమిటీలు ఇచ్చిన నివేదికలను పరిగణనలోకి తీసుకోవడం గానీ, వాటి సూచనలను పాటించడం గానీ చేయలేదని, ఇంత పెద్ద ప్రాజెక్టుకు చెందిన మేడిగడ్డ రిజర్వాయర్ పియర్ కుంగిపోయిన నేపథ్యంలో దానిపై విచారణ చేపట్టవద్దంటే ఎలా అని ప్రశ్నించింది. తప్పు చేసిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందని, అయితే ఇలాంటి నివేదిక ఆధారంగా మాత్రం కాదంది. బాధ్యులెవరో గుర్తించడానికే కమిషన్ ఏర్పాటు జరిగిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ హైకోర్టులో వాదించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. కేసీఆర్, హరీశ్​రావు, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణల్లో జరిగిన అవకవకలపై విచారణ నిమిత్తం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్​ను నియమిస్తూ 2024 మార్చి 14న జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​, మాజీ మంత్రి హరీశ్​రావు, ఐఏఎస్​ స్మితా సబర్వాల్, మాజీ ఐఏఎస్​ ఎస్​కే జోషీ దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం మరోసారి విచారణ కొనసాగించింది. హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మనూ సింఘ్వీ వాదనలు వినిపించారు.

రాష్ట్ర దర్యాప్తు సంస్థకు పంపలేదని : జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ సమయంలో హరీశ్‌ రావు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు. నోటీసు ఇచ్చినప్పుడు, అడిగిన కాగితాలు ఇచ్చినప్పుడు ఏమీ చెప్పకుండా నివేదిక వచ్చాక అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్నారు. మేడిగడ్డ వంగిపోయిందని ప్రజా ప్రయోజనాల నేపథ్యంలో నిజనిర్ధారణ నిమిత్తం కమిషన్ ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. విస్తుగొలిపే అంశాలున్న నేపథ్యంలో దర్యాప్తు నిమిత్తం నివేదికను సీబీఐకి పంపిందని, అంతేగానీ రాష్ట్ర దర్యాప్తు సంస్థకు పంపలేదని సింఘ్వీ కోర్టుకు తెలిపారు. కమిషన్ విచారణ చాలా పారదర్శకంగా జరిగిందని, ఇది కక్షసాధింపు చర్య కాదని స్పష్టం చేశారు. కమిషన్ చట్టప్రకారం దర్యాప్తు జరిపి తీవ్రమైన అంశాలను వెల్లడించిందన్నారు. క్రిమినల్ కేసుల్లో ఆరోపణలను స్వతంత్రంగా నిరూపిస్తారని, అంతేగానీ నివేదికలో ఫలానా పేరాలో పేర్కొన్నారంటే సరిపోదన్నారు.

కేవలం సెక్షన్ 8B అని మాత్రం పేర్కొనలేదు : కమిషన్ ఏర్పాటుకు సంబంధించి నిబంధనల్లోనే బాధ్యులను గుర్తించాలని స్పష్టంగా ఉందని సింఘ్వీ కోర్టుకు వివరించారు. మొదట ఇచ్చిన నోటీసులోనే అన్ని వివరాలున్నాయనీ, కేవలం సెక్షన్ 8బి అని మాత్రం పేర్కొనలేదన్నారు. ఈ కారణంగా విచారణ చట్ట విరుద్ధమనడానికి వీల్లేదని తెలిపారు. 100 మంది వాంగ్మూలాలు సేకరించి, క్షేత్రస్థాయిలో కమిషన్ పర్యటించి కమిషన్ నివేదిక రూపొందించిందని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.

పిటిషన్లపై విచారణ ఇవాళ్టికి వాయిదా : నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రకటనలో, బ్యారేజీ నిర్మాణంలోని లోపాల గురించి కమిషన్‌ పేర్కొందని తెలిపారు. నిపుణుల కమిటీ పరిశీలించి మేడిగడ్డలో రిజర్వాయర్ వద్దని చెప్పినా అప్పటి ప్రభుత్వం వినలేదని సింఘ్వీ అన్నారు. దీనిపై మంత్రిమండలిలోనూ చర్చించలేదని నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా కేబినెట్‌ ఆమోదం తీసుకోలేదన్నారు. మంత్రి మండలి తీర్మానాలు లేకుండానే అన్ని పరిపాలనా అనుమతులు ఇచ్చేశారని కోర్టుకు వివరించారు. మరోవైపు ప్రాజెక్టు వ్యయం కూడా భారీగా పెరిగిందని తెలిపారు. పత్రికల్లో కథనాలు వచ్చాయన్న కారణంగా తమ ప్రతిష్ఠ దెబ్బతిందని అనడం సరికాదని స్పష్టం చేశారు. నివేదిక ఆధారంగా వారి ప్రతిష్ఠకు ఎలాంటి నష్టం జరగదని ప్రభుత్వ తరఫు న్యాయవాది వెల్లడించారు. కోర్టు సమయం ముగిసిన నేపథ్యంలో ఇతరుల పిటిషన్లపై విచారణ నేటికి వాయిదా పడింది.

'కాళేశ్వరం లోపాలకు నేను ఏ విధంగా బాధ్యుడినో చెప్పాలి' : హైకోర్టుకు నివేదించిన కేసీఆర్

'కేసీఆర్‌, కేటీఆర్‌లను అరెస్టు చేస్తారనే కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి అప్పగించాం'

Last Updated : March 3, 2026 at 9:01 AM IST