ETV Bharat / state

గ్రూప్‌-1 ప్రధాన పరీక్ష మూల్యాంకనంపై సిట్​ దర్యాప్తు పూర్తి చేసే వరకు పర్యవేక్షిస్తాం: హైకోర్టు

గ్రూప్‌-1 ప్రధాన పరీక్ష మూల్యాకనంలో అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సిట్ - ఈ వ్యవహారంపై నివేదిక ఇచ్చేంత వరకు పర్యవేక్షిస్తామని స్పష్టం చేసిన హైకోర్టు, మార్చి 16న విచారణను వాయిదా

High Court on Group-1 Papers Evaluation
High Court on Group-1 Papers Evaluation (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 28, 2026 at 9:41 AM IST

|

Updated : February 28, 2026 at 12:42 PM IST

2 Min Read
Choose ETV Bharat

High Court on Group-1 Papers Evaluation: గ్రూప్‌-1 ప్రధాన పరీక్ష మూల్యాంకనంలో అక్రమాల నిగ్గు తేల్చేందుకు తమ ఆదేశాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ పారదర్శక, చిత్తశుద్ధితో విచారణ చేస్తుందని తాము భావిస్తామని హైకోర్టు పేర్కొంది. సిట్‌ విచారణ పూర్తి చేసి కోర్టుకు నివేదిక ఇచ్చేంత వరకు ఈ వ్యవహారాన్ని తాము పర్యవేక్షిస్తామని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది.

గ్రూప్‌-1 మూల్యాంకనంలో అక్రమాల వ్యవహారంపై దాఖలైన అప్పీళ్ల విచారణకు న్యాయస్థానం ఇప్పటికే గణనీయమైన సమయం కేటాయించిన నేపథ్యంలో అప్పీళ్ల విచారణ కొలిక్కి వచ్చేంత వరకు తామే విచారణ కొనసాగిస్తామని(పార్ట్‌ హెర్డ్‌) హైకోర్టు స్పష్టం చేసింది. సిట్‌ నివేదిక దాఖలు చేసే నిమిత్తం విచారణను మార్చి 16కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్, జస్టిస్‌ హరిహరనాథ శర్మతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.

హైకోర్టును సమయం కోరిన సీఎస్: గ్రూప్‌-1 పరీక్ష ద్వారా ఉద్యోగాలు పొందిన వారిని అప్రాధాన్యత పోస్టులకు బదిలీ చేసి, సంబంధిత వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు ఈనెల 25న జరిగిన విచారణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) కె.విజయానంద్‌ హైకోర్టును సమయం కోరారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ జరిగింది. సీఎస్‌ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) ఎస్‌ ప్రణతి స్పందిస్తూ కోర్టు ఆదేశాలను అమలు చేసి వివరాలనుమెమో రూపంలో కోర్టు ముందు ఉంచామని తెలిపారు. తమ ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేశారా? అని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు ఎస్‌జీపీ బదులిస్తూ సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేశామని వివరించారు.

మార్చి 16కు విచారణ వాయిదా: ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ సిట్‌ విచారణను తాము పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది. గ్రూప్‌-1లో ఎంపికై ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న వారిని నాన్‌ ఫోకల్‌ పోస్టులకు తక్షణం బదిలీ చేయాలంటూ ఈనెల 11న ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు అమలు చేయని కారణంగా కోర్టుధిక్కరణ కింద వారిని శిక్షించాలంటూ గొర్ల సుజాత అనే అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. సీఎస్‌ విజయానంద్, ముఖ్య కార్యదర్శి శ్యామలరావుకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌ వేయాలంటూ విచారణను మార్చి 16కు వాయిదా వేసింది.

గతంలో: ఏపీపీఎస్సీ గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మూల్యాంకనంలో అక్రమాలను తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అదనపు డీజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో సిట్ బృందం ఏర్పాటు చేయాలని న్యాయస్థానం పేర్కొంది. దర్యాప్తు జరిపేటప్పుడు రాష్ట్రం వెలుపల ఉన్న ఫోరెన్సిక్ నిపుణుల సహాయం తీసుకోవాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. విజయవాడలో జరిగిన మూల్యాంకనం సమయంలో వినియోగించిన బార్ కోడ్​లు, అసలు ఓఎంఆర్ షీట్లు, వాటి వివరాలు ఒకదానితో ఒకటి సరిపోలుతున్నాయో? లేదో అనే విషయాన్ని విశ్లేషించాలని స్పష్టం చేసింది.

గ్రూప్‌-1పై హైకోర్టు కీలక తీర్పు - అక్రమాలను నిగ్గు తేల్చేందుకు సిట్‌ ఏర్పాటు

ఏపీపీఎస్సీ గ్రూపు 1 సిత్రాలు - డ్రైవరు భార్యతోనూ మూల్యాంకనం

Last Updated : February 28, 2026 at 12:42 PM IST