డీజీపీ శివధర్‌రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట - మధ్యంతర పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
డీజీపీ నియామకంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు - శివధర్‌రెడ్డి నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన మధ్యంతర పిటిషన్ కొట్టివేత - రెగ్యులర్ డీజీపీ నియామక ప్రక్రియ 4 వారాల్లో ముగించాలని ఆదేశం

Published : January 9, 2026 at 8:20 PM IST
HC Hearing On DGP Appointment Petition : తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) శివధర్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన నియామకాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. రెగ్యులర్ డీజీపీ నియామక ప్రక్రియను నాలుగు వారాల్లో ముగించాలని యూపీఎస్సీ(యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నియామక ప్రక్రియకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది.
డీజీపీ నియామకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ : డీజీపీగా శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త ధన్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డీజీపీ నియామక ప్రక్రియ జగలేదని శివధర్ రెడ్డిని నియమిస్తూ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. నిబంధనల ప్రకారం డీజీపీ పదవీ విరమణ పొందే సమయానికి మూడు నెలల ముందే యూపీఎస్సీకి ప్యానెల్ పంపాల్సి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
గతేడాది ఏప్రిల్ నుంచి ఐదుగురు పేర్లతో కూడిన జాబితాను పంపిస్తూ వస్తున్నామని కానీ యూపీఎస్సీ క్లారిఫికేషన్ కోసం తిప్పి పంపిందని అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి(ఏజీ) హైకోర్టుకు వివరించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు డిసెంబర్ 31వ తేదీన కూడా మరోసారి జాబితా పంపామని సుప్రీం అనుమతి తీసుకోవాలంటూ యూపీఎస్సీ ఆ జాబితాను తిప్పి పంపిందని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఆ జాబితాను పరిగణనలోకి తీసుకునే విధంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఆదేశించాలని ఏజీ కోరారు.
పూర్తిస్థాయి డీజీపీ నియామకంపై నిర్ణయం తీసుకోండి: సకాలంలో డీజీపీ ప్యానెల్ జాబితాను పంపకపోవడం వల్లే తిప్పి పంపామని యూపీఎస్సీ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని యూపీఎస్సీని ఆదేశించింది. పూర్తిస్థాయి డీజీపీ నియామకంపై నాలుగు వారాల్లో(నెల రోజుల్లో) నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలను జారీ చేస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది. డీజీపీ నియామకంపై దాఖలైన మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేయడంతో శివధర్ రెడ్డికి ఊరట లభించినట్లయింది.
డీజీపీ నియామకంపై వివరణ ఇవ్వండి : రాష్ట్ర డీజీపీగా బి.శివధర్‌రెడ్డి నియామకంలో చట్ట నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకున్నారో లేదో వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు కొద్దిరోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం తీర్పునకు విరుద్ధంగా శివధర్‌రెడ్డి నియామకం చేపట్టారంటూ నగరానికి చెందిన టి.ధన్‌గోపాలరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు. పిటిషనర్ వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు ప్రకాశ్‌సింగ్ బాదల్ కేసులో జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా నియామకం జరిగిందని గతంలో విచారణ సందర్భంగా తెలిపారు. దీని ప్రకారం తాత్కాలిక ప్రాతిపదికన డీజీపీ నియామకం ఉండదని వివరించారు.
డీజీపీ పదవీ విరమణకు 3 నెలల ముందే నియామక ప్రక్రియ చేపట్టాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ డీజీపీ నియామకం నిమిత్తం యుపీఎస్సీకి ప్యానెల్ పంపినట్లుగా కోర్టు దృష్టికి తెలిపారు. దీనిపై కమిషన్ పలు సందేహాలను వ్యక్తం చేసిన నేపథ్యంలో వాటికి స్పష్టతివ్వాల్సి ఉందన్నారు. ఈలోగా సీనియర్ స్థాయిలో ఉన్న కొంతమంది అధికారులు పదవీ విరమణ చేయడం వల్ల తాత్కాలిక ప్రాతిపదికన డీజీపీగా శివధర్‌రెడ్డి నియామకం చేపట్టినట్లుగా తెలిపారు. ఇందులో కోవారెంటో పిటిషన్ విచారణార్హం కాదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని పిటిషనర్ భావించినట్లయితే కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసుకోవాలన్నారు.
తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి - లాయర్ నుంచి ఐపీఎస్‌గా ఆయన ప్రస్థానమిదీ

