ETV Bharat / state

కోడి పందాలకు 110కి పైగా బరులు - హోటళ్లు, లాడ్జీల కంటే గదులకేే డిమాండ్​

ఒక్కో రకం పుంజు ఖరీదు దాదాపు రూ.2 లక్షల పైనే - ఈ ఏడాది డెల్టాలోని 10 చోట్ల కేసినో ఏర్పాటుకు రంగం సిద్ధం - పందేల జోలికి పోలీసులు రాకుండా ప్రభుత్వంతో మంతనాలు

ARRANGEMENTS FOR COCK FIGHT IN AP
ARRANGEMENTS FOR COCK FIGHT IN AP (EENADU)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 6, 2026 at 1:11 PM IST

3 Min Read
Choose ETV Bharat

Arrangements For Cock Fight In AP : సంక్రాంతి పండగ సమీపిస్తున్న తరుణంలో "కోడి పందేళ్ల" సందడి మొదలైంది. ఈ పందాల్లో కోట్లు చేతులు మారుతుంటాయి. బరిలో దిగిన కోడి గెలిస్తే ప్రపంచాన్ని జయించిన సంతోషం. ఓడిపోతే తట్టుకోలేని అవమానాలు సర్వసాధారణం. కోడిపుంజు మెడమీద ఈకలు రెక్కించి ఒక్క ఉదుటున గాలిలోకి లేచి ప్రత్యర్థిని పడగొట్టే దృశ్యం పందెం రాయుళ్లకు కావాల్సినంత మజానిస్తుంది.

అయితే సంక్రాంతికి ఇంకా పది రోజులు ఉండగానే కోడిపుంజులే కాదు, పందెంరాయుళ్లు కూడా కాలు దువ్వుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని హంగులతో 110కి పైగా భారీ బరులు ఏర్పాటు చేయడానికి కసరత్తులు మొదలెట్టారు. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు డెల్టాలోని ఆరింటిని రూ.50 లక్షల చొప్పున దక్కించుకున్నారు. అక్కడ కారవాన్లకు కూడా స్థలాలు కేటాయించారు. ఓ వ్యక్తి గతేడాది పశ్చిమలోని ఓ నియోజకవర్గంలో ఐదు గ్రామాల్లోని బరులను రూ.70 లక్షలకు దక్కించుకోగా ప్రస్తుతం వాటికి రూ.1.50 కోట్లు ఇవ్వాలంటున్నారని అతను తెలిపారు.

రంగును బట్టి ధర : ఏక రంగుగా పిలిచే కోడి డేగ, కాకి నెమలి, కోడి కాకి రంగులకు ధర ఎక్కువగా ఉంది. ఒక్కో రకం పుంజు ఖరీదు దాదాపు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలు పలుకుతోంది. బర్మా, పెరూ పుంజులు కంటే ఇక్కడి వాటికి పౌరుషం ఎక్కువ కావడంతో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని పెంపకందారులు చెబుతున్నారు.

సమష్టిగా పంచుకుందాం : గోదావరి తీరంలో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జూద శిబిరాల నిర్వాహకులు ఇటీవల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. గతేడాది రాజకీయంగా విడిపోయి నష్టపోయామని, ఈసారి ఒకేమాటపై ఉండాలని అందరూ తీర్మానించారు. పోటీ పడకుండా స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో జూదాలు, బరులు నిర్వహించుకుందామనే ఏకాభిప్రాయానికి వచ్చారు.

గదులకు డిమాండు : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో హోటళ్లు, లాడ్జీల్లోని గదులు ఇప్పటికే బుక్‌ అయ్యాయి. 90 శాతం గదులను గత ఏడాది వచ్చిన వారి పేరిటే బుక్‌ చేసుకోవడం విశేషం. భీమవరంలో మూడు రోజులకు ఒక్కో గది రూ.30 వేల నుంచి రూ.50 వేలు ధర పలికడం గమనార్హం. ఇదే అదనుగా ఖాళీగా ఉన్న ఇళ్లను, ఆక్వా చెరువులపై ఉన్న గదులను కూడా శుభ్రం చేస్తున్నారు.

మంతనాలు? : కోడిపందేలు జరగకుండా ఉక్కుపాదం మోపుతామని ఏటా సంక్రాంతికి ముందు పోలీసులు హెచ్చరిస్తారు. బరులను కూడా ధ్వంసం చేస్తారు. వాటి నిర్వాహకులను, కత్తి కట్టే వారిని బైండోవరు చేస్తారు. ఈ ఏడాది పందేల జోలికి పోలీసులు రాకుండా ప్రభుత్వంతో మంతనాలు జరిపేందుకు రాజకీయంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం.

శ్రీలంక కేసినో : గతంలో శ్రీలంక కేసినో ఒకటి రెండు చోట్ల మాత్రమే కనిపించింది. ఈ ఏడాది డెల్టాలోని 10 చోట్ల కేసినో ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకు, సింథటిక్‌ బరులు, ఫ్లడ్‌లైట్ల వెలుగులు, బరి దగ్గర స్టేడియం మాదిరిగా తీర్చిదిద్దే నిపుణులను రప్పిస్తున్నారు.

పెంపకానికి ప్రత్యేక శిబిరాలు: పందెం కోళ్ల కోసం ప్రత్యేకంగా శిబిరాలను ఏర్పాటు చేసి పందెం పుంజులను పెంచుతున్నారు. ఆక్వా చెరువుల వద్ద, కొబ్బరితోటల్లో జాతి పుంజుల పెంపకానికి కేంద్రాలుగా ఉన్నాయి. ఐ.పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం, అల్లవరం, ఉప్పలగుప్తం, రాజోలు, సఖినేటిపల్లి, రావులపాలెం, ఆలమూరు, రామచంద్రపురం తదితర మండలాల్లోని 200కు పైగా శిబిరాలు ఉన్నట్లు ప్రాథమిక అంచనా ఉంది. అయితే కోడి పుంజుల క్రయవిక్రయాల ద్వారా రూ.40 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని స్థానికంగా ఓ అంచనా ఉంది. మరికొందరు ఇళ్ల వద్దే పుంజులను పెంచుతున్నారు.

సంక్రాంతి బరిలో దిగేందుకు 'పందేం కోళ్లు' సిద్ధం - ప్రత్యేక శిక్షణతో రాటుదేలుతున్న పుంజులు

కోడి పందేలకు సిద్ధమవుతున్న గోదావరి జిల్లాలు - కాలు దువ్వుతున్న పుంజులు