ETV Bharat / state

గండికోట రహస్యాన్ని ఛేదిద్దామా? - నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు

రూ.3 కోట్ల నిధులతో సర్వం సిద్ధం చేసిన అధికారులు - ముఖద్వారం వద్ద 4 వేల మంది కూర్చునేలా ప్రధాన వేదిక - ఆకట్టుకోనున్న హెలీరైడ్‌, పారా మోటర్, హాట్ ఎయిర్ బెలూన్

Gandikota Heritage Festival
Gandikota Heritage Festival (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 10, 2026 at 1:14 PM IST

|

Updated : January 11, 2026 at 6:55 AM IST

4 Min Read
Choose ETV Bharat

Gandikota Heritage Festival : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న గండికోట ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. కడప జిల్లాలోని చారిత్రక పర్యాటక ప్రాంతం గండికోటలో ఈ ఉత్సవాలు నేటి నుంచి 3 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు.

కడప జిల్లాలో నేటి నుంచి మూడ్రోజుల పాటు జరగనున్న గండికోట ఉత్సవాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇప్పటికే 3 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయగా జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. గండికోట ముఖద్వారం వద్ద దాదాపు 4 వేల మంది కూర్చుని వీక్షించేలా ప్రధాన వేదిక సిద్ధం చేశారు. 35 స్టాళ్లతో ఫుడ్ కోర్టు ఏర్పాటు చేశారు. పెన్నాలోయ, గండికోట ప్రాజెక్టు, మైలవరం జలాశయం అందాలను వీక్షించేలా హెలికాప్టర్ రైడ్ ఏర్పాటు చేశారు. పారా మోటర్, హాట్ ఎయిర్ బెలూన్, పారాచూట్‌ విన్యాసాలు, ట్రెక్కింగ్ వంటి సాహసకృత్యాలు కనువిందు చేయనున్నాయి.

ఉత్సవాల కోసం ప్రత్యేక బస్సులు : ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ఐదున్నర వరకు గండికోట శోభాయాత్ర జరగనుంది. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో మంత్రులు కందుల దుర్గేష్‌, సవిత ఉత్సవాలను ప్రారంభిస్తారు. ప్రముఖ రచయితలు, చరిత్రకారులు గండికోట విశిష్టతను తెలియజేస్తారు. థీమ్ సాంగ్ నృత్యం, థిల్లానా కూచిపూడి నృత్య ప్రదర్శన, రాత్రి 8 గంటలకు ముషాయిరా నిర్వహిస్తారు.

అనంతరం గండికోట విశిష్టతను తెలియజేసే లేజర్ షో, ప్రముఖ గాయని మంగ్లీ బృందం సంగీత విభావరి ఆకట్టుకోనున్నాయి. కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు, పులివెందుల ప్రాంతాల నుంచి గండికోట ఉత్సవాల కోసం RTC ప్రత్యేకంగా 39 బస్సులను నడపనుంది. మరోవైపు గండికోట ఉత్సవాల సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా కెమరాలతో పహారా కాస్తున్నారు. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Gandikota Heritage Festival
Gandikota Heritage Festival (EENADU)

నేటి నుంచి( 11వ తేదీ) నుంచి మూడు రోజుల పాటు ఇక్కడ (గండికోట వద్ద) వారసత్వ ఉత్సవాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 3 కోట్ల నిధుల్నీ కేటాయించింది. ఈ నేపథ్యంలో గండికోటలో సందర్శించాల్సిన ప్రాంతాల గురించి తెలుసుకుందాం.

పెన్నాలోయ : ‘గ్రాండ్‌ కాన్యన్‌ ఆఫ్‌ ఇండియా’గా ప్రసిద్ధి. పడమర, ఉత్తర దిక్కుల్లో పెన్నానది దాదాపు 300 అడుగుల లోతులో 250 అడుగుల వెడల్పుతో ప్రవహిస్తుంటుంది.

రంగనాథాలయం : ఆలయ ప్రస్తావన క్రీ.శ.1557 నాటి ఒక శాసనంలో కనిపిస్తుంది. ఆలయ నిర్మాణశైలి విజయనగర రాజుల కళాభిరుచికి నిదర్శనంగా నిలుస్తుంది.

బందీఖానా : నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షల అమలుకు సాక్ష్యంగా నిలుస్తుంది ఈ కట్టడం.

జుమ్మా మసీదు : మీర్‌ జుమ్లా నిర్మించారు. మూడు ప్రవేశ ద్వారాలతో ఇస్లామిక్‌ భారతీయ శిల్పకళా నైపుణ్యాల మేళవింపుతో ఒకేసారి 300 మంది ప్రార్థనలు చేసుకునేలా ఉంటుంది. లోపల 64, వెలుపల 32 గదులున్నాయి.

మాధవరాయ ఆలయం : క్రీ.శ.16వ శతాబ్దానికి చెందిన శాసనాల్లో ఈ ఆలయ ప్రస్తావన ఉంది. ఇక్కడి శిల్పకళ, నిర్మాణం విజయనగర రాజుల కాలానిదిగా చరిత్రకారులు చెబుతున్నారు.

ధాన్యాగారం : జుమ్మా మసీదు పక్కనే ఎత్తయిన ధాన్యాగారం కనిపిస్తుంది. కరవు కాటకాలు, ప్రకృతి విపత్తులు ఎదుర్కొనేందుకు ఇందులో ధాన్యాన్ని నిల్వ చేసేవారు.

కత్తుల కోనేరు : పూర్వం యుద్ధం ముగిసిన తర్వాత సైనికులు తమ కత్తులను ఇక్కడి కోనేరులో కడిగేవారని అందుకే దీనికి కత్తుల కోనేరు పేరు వచ్చిందంటారు. ఇప్పటికీ నీరు ఎరుపు రంగులోనే ఉండటం విశేషం.

కట్టి పడేస్తున్న అందాలు : ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోట ప్రాజెక్టు రెండు కొండల మధ్య నిర్మితమై ఉండడంతో ఇక్కడ అందాలు పర్యాటకుల మనసును కట్టి పడేస్తున్నాయి. చూపరులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. గండికోట సొరంగం ద్వారా కృష్ణా జలాలు ప్రాజెక్టు వైపు పరుగులిడే సమయంలో ఎన్నో అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో సూర్యోదయం, సూర్యస్తమయం అక్కడ అద్భుత సుందర దృశ్యాలుగా ఉంటాయి.

సాగునీటికి పెద్దదిక్కు : పర్యాటక కేంద్రమైన గండికోట వైఎస్సార్​ కడప జిల్లాలోనే అతిపెద్ద జలాశయం. అంతేకాదు సాగునీటికి పెద్దదిక్కు కూడా. ఈ జలాశయాన్ని 26.85 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా నిర్మించారు. ఈ ప్రాజెక్టులో మూడు నదుల నీరు చేరుతాయి. కాబట్టి ఇది ‘త్రివేణి సంగమం’గా మారింది. పెన్నా, చిత్రావతి, కృష్ణా నదీ జలాల కలయికతో గండికోట ప్రసిద్ధి పొందుతోంది. సాగునీటికి గుండెకాయగా మారింది. దానిని నమ్ముకున్న మత్స్యకారులకు కాసులు కురిపిస్తోంది. పర్యాటకంగానూ అనేక ప్రత్యేకతల సమాహారంగా గండికోట ప్రాధాన్యం సంతరించుకుంటోంది.

టూరిజం హబ్‌గా : వైఎస్సార్​ కడప జిల్లాను టూరిజం హబ్‌గా మార్చడానికి అధికారులు వివిధ రకాల ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే గండికోట పర్యాటకంగా ప్రసిద్ధి పొందగా అందుకు అనుబంధంగా ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న దిశగా అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందటంతో పాటు, ఉపాధి అవకాశాలు, ఆదాయ మార్గాలు పెంచడానికి పలు మార్పులకు శ్రీకారం చుట్టింది.

రాజుల కాలం నాటి కట్టడాలు - నేటికీ ఆకట్టుకుంటున్న శిల్ప సోయగం

మనకు దగ్గర్లోనే అద్భుత "పర్యాటక ప్రాంతాలు" - ఒక్క రోజులో వెళ్లి రావచ్చు!

Last Updated : January 11, 2026 at 6:55 AM IST