కాకినాడ అందాలను వీక్షించేలా హెలికాప్టర్ జాయ్ రైడ్ - ఒక్కొక్కరికి ఎంతంటే?
వాకలపూడి బీచ్‌లో హెలికాప్టర్ జాయ్ రైడ్ - హెలి జాయ్ రైడ్‌లో ప్రయాణించిన ఎమ్మెల్యే పంతం నానాజీ - ఇందులో 6 నిమిషాల పాటు ప్రయాణం చేసే అవకాశం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 22, 2026 at 4:07 PM IST
|Updated : February 22, 2026 at 6:43 PM IST
Helicopter Joy Ride Began At Kakinada: పాఠశాల విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ఆదివారం అంటే ఇష్టపడని వారెవరైనా ఉంటారా అంటే అతిశయోక్తి కాదు. వారమంతా గజిబిజిగా గడిపినా ఆ ఒక్కరోజు మాత్రం సంతోషం కోసం ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. అందుకోసం ఎంత ఖర్చైనా చేసేందుకు అసలు వెనకాడరు. అందుకే కాబోలు ఆదివారం దుకాణాల నుంచి హోటళ్లు, సినిమాహాళ్లు, పార్క్‌లు, పర్యాటక ప్రాంతాలన్నీ రద్దీగా కనిపిస్తుంటాయి. దాంతో కుటుంబమంతా ఆనందంగా కార్యక్రమాలను పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. ఇలాంటి వారి కోసమే ఇప్పుడు కొత్తగా అడ్వెంచర్ పార్క్‌లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సరికొత్త థీమ్‌లతో హోటళ్లు ముస్తాబవుతున్నాయి.
కాకినాడ అందాలను వీక్షించేందుకు వాకలపూడి బీచ్ వేదికైంది. సాగర తీరంలో ఏ స్క్వేర్ గోకార్టింగ్ ప్రాంగణంలో పర్యాటకులకోసం హెలికాప్టర్ రైడ్‌ను ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. కాకినాడ నగరం, బీచ్, హోప్ ఐల్యాండ్, కోరింగ అభయారణ్యం ఆకాశం నుంచి చూసే అవకాశం కల్పించారు. ముందుగా ఈ హెలి జాయ్ రైడ్‌లో ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రయాణించి నగర అందాలను తిలకించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తీరంలో పర్యాటకులను ఆకర్షించేలా అన్నిరకాల సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. దాదాపు 6 నిమిషాల పాటు హెలి రైడ్ ప్రయాణం చేయవచ్చని తెలిపారు. ఈ నెల 27 వరకు కాకినాడలో, 28 నుంచి మార్చి 6వ తేదీ వరకు రాజమహేంద్రవరంలో, తిరిగి మళ్లీ మార్చి 7 నుంచి 14 వరకు కాకినాడలో, ఆపై మార్చి 15 నుంచి 22వ తేదీ వరకు రాజమహేంద్రవరంలో ఈ రైడ్ ఉంటుందని నిర్వాహకులు ఇప్పటికే తెలియజేయడం గమనార్హం. దీనికి సంబంధించి ఒక్కొక్కరికి రూ.3,999 వరకు ప్రయాణ ఛార్జీలు ఉంటుందని వీరు పేర్కొన్నారు.
సాహస క్రీడలపై అమితాసక్తి: కాకినాడ నగరవాసుల్లో సాహస క్రీడలపై అమితాసక్తి కనిపిస్తుంది. ముఖ్యంగా ట్రెక్కింగ్, బంగీ జంప్, రాక్ క్లైంబింగ్, అడ్వెంచర్ రైడ్స్‌ను బాగా ఇష్టపడుతున్నారు. అందుకే నగరవాసులను ఆకట్టుకునే విధంగా ఇటీవల అడ్వెంచర్ పార్క్ ఒకటి ఏర్పాటైంది. ఆదివారం రోజున ఇక్కడ సందడి ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా కాకినాడ, ఉప్పాడ తీరాల్లో ఆదివారం బీచ్‌కు వచ్చే సందర్శకుల సంఖ్య నానాటికీ పెరుగుతుంది. వేసవిలో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.
ఇప్పుడు మాత్రం సాగరతీరంలో అలలకు సమీపాన గుడారాలను ఏర్పాటు చేసి పర్యాటకులకు కొత్త అనుభూతిని కల్పించేలా కొన్ని ఏజెన్సీలు చురుకుగా పనిచేస్తున్నాయి. తాజాగా కాకినాడ తీరంలో ఈ తరహా ఏర్పాట్లను విస్తృతంగా చేస్తుండడంతో పర్యాటకులు మరింత ఆసక్తిని చూపిస్తున్నారు. ఇది వరకైతే మెట్రో సిటీల్లోనే మ్యూజిక్, స్టాండప్ కామెడీ షోలను అరుదుగా నిర్వహించేవారు. ఇప్పుడు మాత్రం కాకినాడ, రాజమహేంద్రవరం లాంటి నగరాల్లో సైతం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
కాకినాడలో ఇటీవల ప్రముఖ స్టాండప్ కమెడియన్లతో షోలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు యువత విశేషంగా తరలివస్తుండడంతో నెలలో 2 ఆదివారాల్లో ఈ షోలు ఉండేలా నిర్వాహకులు చూసుకుంటున్నారు. గాయకునితో కలిసి ఆలపించేలా మ్యూజిక్ షోలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పార్కులన్నీ ఆదివారం సందడిగా కొంతమంది కుటుంబసభ్యులతో కలిసి కలియతిరుగుతూ కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. సీనియర్ సిటిజన్లు కష్టసుఖాలు పంచుకుంటున్నారు.
"కాకినాడలో ఇన్ని సంవత్సరాలుగా సినిమాలు తప్ప వేరే విధమైన వినోదం అనేది లేదనే చెప్పాలి. కానీ ఇప్పుడు చాలా రోజులకు కాకినాడ అందాలను వీక్షించేందుకు వాకలపూడి బీచ్ వద్ద హెలికాప్టర్ జాయ్ రైడ్‌ను ప్రారంభించడం శుభపరిణామం. హెలి జాయ్ రైడ్‌లో ప్రయాణించి నగర అందాలను తిలకిస్తుంటే కాకినాడలో ఇన్ని అందాలు దాగున్నాయా అని అనిపిస్తుంది. నగర సుందరీకణలో భాగంగా ఈ ప్రాంతంలో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను"-పంతం నానాజీ,ఎమ్మెల్యే

