నిమిషానికి 45 కార్లు - రోడ్లన్నీ సంక్రాంతి ప్రయాణాలకే
సంక్రాంతికి వెళ్లే వాహనాలతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా రద్దీ - టోల్గేట్ల వద్ద నిమిషానికి 45 వాహనాల చొప్పున ప్రయాణం- శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు ప్రయాణించిన 70 వేల వాహనాలు

Published : January 11, 2026 at 9:43 AM IST
Hyderabad vijayawada highway Rush : హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపునకు వెళ్లే రహదారులన్నీ సంక్రాంతికే అన్నట్లుగా మారాయి. నగరం నుంచి పల్లెలకు పయనమవుతున్న వాహనాలతో రోడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి 65, సూర్యాపేట - ఖమ్మం 365 బీబీ, నార్కట్‌పల్లి వయా నల్గొండ, మిర్యాలగూడ మీదుగా అద్దంకి, గుంటూరు వైపునకు ప్రయాణించే వారితో రద్దీగా దర్శనమిస్తున్నాయి.
దారులన్నీ హారన్ శబ్దాలతో : జీవనోపాధి కోసం హైదరాబాద్‌లో ఉంటున్న వారంతా స్వగ్రామాల్లో సంబురంగా సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు కుటుంబ సమేతంగా బయలుదేరారు. బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాల హారన్ శబ్దాలతో దారులు మారుమోగుతున్నాయి. ప్రయాణిస్తున్న వాహనాలతో టోల్ గేట్లు, హోటళ్లు, పెట్రోల్ బంకులు కళకళలాడుతున్నాయి. అక్కడక్కడ రోడ్డు పనులు చేస్తున్న ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.
దాదాపు 1.29 లక్షల మంది ప్రయాణం : పంతంగి టోల్ ప్లాజా సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారంగా హైదరాబాద్ - విజయవాడ వైపు శుక్రవారం రాత్రి 12 గంటల నుంచి శనివారం సాయంత్రం 4 గంటల వరకు సుమారు 43 వేల వాహనాలు ప్రయాణించాయి. నిమిషానికి 45 వాహనాల చొప్పున టోల్‌గేట్‌ను దాటినట్లు గణాంకాలు పేర్కొన్నాయి. ఈ మార్గంలో అత్యధికంగా కార్లు వరుస కట్టాయి. ఒక్కో కారులో సుమారు ముగ్గురు చొప్పున లెక్కేసినా దాదాపు 1.29 లక్షల మంది తమ స్వస్థలాలకు చేరుతున్నట్లు అంచనా వేస్తున్నారు.
అనవసరంగా రావొద్దు : పండుగ సంతోషంతో స్వస్థలాలకు వెళ్తున్న వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గమ్య స్థానాలకు చేరుకోవాలని అధికారులు అంటున్నారు. దీనికోసం జాతీయ రహదారి-65కు ఆనుకుని ఉన్న, దీనికి సమీపంలోని గ్రామాల్లోని వ్యక్తులు అనవసరంగా, కారణం లేకుండా రోడ్డుపైకి వచ్చి ఆపదలో చిక్కుకోవద్దని సూచిస్తున్నారు. దీనికి బదులుగా ప్రత్యామ్నాయ దారుల్లో ప్రయాణించి పనులు పూర్తి చేసుకోవాలని కోరుతున్నారు. దీంతో పండగకు ప్రయాణిస్తున్న వారికి దారిచ్చిన వారవుతారని అంటున్నారు.
"ఈ ఏడాది గత సంవత్సరం కంటే అధికంగా వాహనాలు ప్రయాణిస్తాయని అంచనా. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూస్తున్నాం. రోడ్డు పక్కన ఉన్న హోటళ్ల వద్ద రహదారి పక్కనే పార్కింగ్ చేయకూడదు." - శివరాంరెడ్డి, నల్గొండ డీఎస్పీ
నేడు మరింత రద్దీ ఉంటుందని అంచనా : సంక్రాంతికి వెళ్లే వాహనాలతో హైదరాబాద్ - విజయవాడ హైవేపై భారీగా రద్దీ కొనసాగుతోంది. పంతంగి టోల్‌ప్లాజా దగ్గర ఆదివారం వేకువజాము నుంచి రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఏపీ వైపుగా ప్రయాణించే వాహనాలు పెద్ద ఎ్తతున తరలి వస్తుండటంతో ఎక్కువ టోల్ బూత్‌లను ఓపెన్ చేశారు. కార్లు, ఇతర వాహనాలు నిదానంగా వెళుతున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 70 వేల వాహనాలు ఏపీ వైపు పయనమయ్యాయని టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు. నేడు రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు.
నిర్మాణ పనుల కారణంగా : టోల్‌ప్లాజా వద్ద వాహనాలు ఫాస్టాగ్ స్కాన్ వేగంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్‌ప్లాజాల వద్ద పెట్రోలింగ్ వాహనాలు, అంబులెన్స్, క్రేన్లను అందుబాటులో ఉంచారు. ఇంకోవైపు హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలతో ఏపీలోని నందిగామ వద్ద ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండటంతో వై జంక్షన్ వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.
"మాది శ్రీకాకుళం జిల్లా పలాస. 17 సంవత్సరాలుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. గతంలో మూడు నెలల ముందే రైల్ టికెట్ బుక్ చేసుకుని మా ప్రాంతానికి వెళ్లేవాళ్లం. ఇటీవల కొత్తగా కారు కొనుగోలు చేసి అందులో ప్రయాణిస్తున్నాం. మేము 850 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి." - కె.దిల్లేశ్వర రావు, శ్రీకాకుళం
డ్రోన్లతో నిఘా, 20కిలోమీటర్లకో అంబులెన్స్ - యాక్సిడెంట్ స్పాట్ల వద్ద జాగ్రత్తలు
సంక్రాంతికి ఇంటికి వెళ్లేవారికి షాక్ - జేబులు ఖాళీ చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్

