సంక్రాంతి ఎఫెక్ట్! - హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్
విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ - రేపటి నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు - వరుస సెలవులు రావడంతో నగరవాసుల పల్లెబాట - పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్

Published : January 9, 2026 at 8:56 PM IST
|Updated : January 9, 2026 at 9:01 PM IST
Sankranti Festival Rush At Hyd Vijayawad Highway : సంక్రాంతి సెలవుల సందడి మొదలవడంతో నగరం ఖాళీ అవుతోంది. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై సందడి మొదలైంది. రేపటి నుంచి విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో సంక్రాంతి సంబురాలను స్వగ్రామాల్లో జరుపుకునేందుకు జనం క్యూ కట్టారు. ఇవాళ మధ్యాహ్నం నుంచే సొంతూళ్లకు వెళ్లే వారు పయనమయ్యారు. ఎంజీబీఎస్, కూకట్‌పల్లి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ బస్టాండ్లు రద్దీతో కిటకిటలాడుతున్నాయి. సొంతూళ్లకు వెళ్తున్న వారితో బస్సులు నిండిపోయాయి. రద్దీకి అనుగుణంగా టీజీఎస్ ఆర్టీసీ అదనపు బస్సులు నడుపుతున్నా సరిపోవడం లేదు. అయితే ఒక్కసారిగా రద్దీ పెరగడంతో సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదునుగా ప్రైవేట్ వాహన యజమానులు ధరను డబుల్ చేశారు. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సంక్రాంతి రద్దీ దృష్ట్యా 6431 స్పెషల్ బస్‌లు : సంక్రాంతి పండుగ సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ 6432 ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు 1000 బస్సులను, మిగతా వాటిని తెలంగాణలోని వివిధ జిల్లాలకు నడిపిస్తోంది. నేటి నుంచి ప్రారంభం అవుతున్న ప్రత్యేక బస్సులు ఈనెల 13 వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని రంగారెడ్డి ఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీలత తెలిపారు. తిరిగి 18, 19 తేదీల్లోనూ స్పెషల్ బస్సులు నడుస్తాయని తెలిపారు. ప్రత్యేక బస్సులకు 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయనున్నారు.
కిక్కిరిసిన కూకట్‌పల్లి బస్ డిపో : కూకట్‌పల్లి బస్ డిపోలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం డిపో నుంచి మొత్తం 306 బస్సులు నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో సాధారణంగా ప్రతిరోజూ నడిచే 180 బస్సులకు తోడు ఈరోజు ప్రత్యేకంగా మరో 125 అదనపు బస్సులు ప్రయాణికుల కోసం ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొంత మందికి టికెట్స్ రిజర్వేషన్ కాకపోవడం వలన ఇబ్బందిగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. మరి కొందరైతే నెల ముందే టికెట్స్ బుక్ చేసుకున్నామని తెలిపారు. రాత్రి 9 గంటల తరువాత ఈ రద్దీ మరింత పెరుగుతుందని అధికారులు అంచనావేస్తున్నారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
టోల్ ప్లాజాల వద్ద రద్దీ : మరోవైపు రోడ్లపై ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటోంది. రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. ఈ రద్దీ ఎఫెక్ట్ టోల్ ప్లాజాల వద్ద కనిపిస్తోంది. యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ భారీగా కనిపిస్తోంది. చౌటుప్పల్, పెద్దకాపర్తి, చిట్యాల వద్ద వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. అటు యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల పోలీసులు జాతీయ రహదారిపై ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే : సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా ఉంటుందని ఆర్టీసీ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రధాన పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు ప్రత్యేక సర్వీసులను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నడుపుతోంది. తిరుగు ప్రయాణంలో స్పెషల్ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ అంతగా ఉండదని భావించి రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఖాళీ బస్సులను త్వరతగతిన రద్దీ ఉన్న నగర ప్రాంతాలకు తీసుకువస్తుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను ఆయా రూట్లకు ఆర్టీసీ అధికారులు కేటాయిస్తారు.
సంక్రాంతికి 6,431 స్పెషల్ బస్సులు - 50 శాతం అదనపు ఛార్జీలు
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? - ఈ డైవర్షన్లు తెలిస్తే ట్రాఫిక్ నుంచి తప్పించుకున్నట్లే

