చిన్నారుల వీపులపై కొండంత భారం - అర్థంలేని మోత బరువుతో వణుకుతున్న బడి పిల్లల వెన్ను
పరిమితి కంటే అధిక భారాన్ని మోస్తున్న విద్యార్థులు - చిన్న వయసులోనే శరీరంపై అధిక బరువు - ముందు ముందు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 21, 2026 at 8:47 PM IST
Heavy School Bags For School Going Kids : వైఎస్సార్ కడప జిల్లాలో బడి గంట మోగడమే ఆలస్యం, చిన్నారుల వీపులపై కొండంత భారం వచ్చి పడుతోంది. ఎదిగే వయసులో ఉన్న పిల్లలు తమ శరీర బరువులో సింహభాగాన్ని బ్యాగుల రూపంలో మోస్తున్నారు. ఇది కేవలం పుస్తకాల బరువు మాత్రమే కాదు, వారి భవిష్యత్తు ఆరోగ్యాన్ని దెబ్బతీసే పెద్ద సమస్య. పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో విద్యార్థులు మళ్లీ తరగతులకు హాజరవుతున్నారు. వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన పిల్లలు, ఇప్పుడు బరువైన స్కూల్ బ్యాగులను మోస్తూ తరగతి గదులకు వెళ్తున్నారు.
కొన్ని సందర్భాల్లో, ఈ బ్యాగులను మోస్తూనే వారు రెండు లేదా మూడు అంతస్తుల మెట్లు ఎక్కాల్సి వస్తోంది. తమ శారీరక సామర్థ్యానికి మించి పుస్తకాలను మోయడం వల్ల వీపుపై ఒత్తిడి పడి, శారీరక ఇబ్బందులు తలెత్తుతాయి. ఇది మొదట నడుము కింది భాగం, మెడపై ప్రభావం చూపి, క్రమంగా శరీరంలోని ఇతర భాగాలపై కూడా దుష్ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో విద్యార్థులు తీవ్రమైన వెన్ను సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వేలు పెట్టి కొనే తరగతి పుస్తకాలు: కొన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులను అధిక సంఖ్యలో పుస్తకాలను కొనుగోలు చేయాలని నిర్బంధిస్తున్నాయి. వీటి ఖర్చు ఎల్కేజీకి రూ.3,000 నుంచి రూ.5,000 వరకు, అలాగే మొదటి తరగతికి రూ.7,000 నుంచి రూ.8,000 వరకు ఉంటుంది. సాధారణ పాఠ్యపుస్తకాలతో పాటు, డ్రాయింగ్, పర్యావరణ అధ్యయనం (EVS), ఇంగ్లీష్, కంప్యూటర్లు, వర్క్‌బుక్‌లు, హోంవర్క్ పుస్తకాలు వంటి అనేక రకాల పుస్తకాలను పిల్లలు ప్రతిరోజూ పాఠశాలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
అమలుకాని 'నో బ్యాగ్ డే': నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ (2005), స్కూల్ బ్యాగ్ పాలసీ (2020) పాఠశాల బ్యాగులకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను అందిస్తున్నాయి. ఈ విధానాలు ప్రతి నెలా మూడవ శనివారం నాడు "నో బ్యాగ్ డే" పాటించాలని నిర్దేశిస్తున్నాయి. అయినప్పటికీ, 90 శాతం పాఠశాలలు దీనిని అమలు చేయడంలో విఫలమవుతున్నాయి. సీబీఎస్ఈ విధానం ప్రకారం, 1 నుంచి 5వ తరగతి విద్యార్థుల పుస్తకాలను పాఠశాలలోనే ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. సెమిస్టర్ విధానం వల్ల సిలబస్ తగ్గడం కూడా బ్యాగుల బరువును కొంతమేర తగ్గించడానికి సహాయపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా పుస్తకాల భారాన్ని కొంతవరకు తగ్గించింది. అయితే, అనేక ప్రైవేట్ పాఠశాలలు ఇప్పటికీ విద్యార్థుల వీపులపై తీవ్రమైన భారాన్ని మోపుతూనే ఉన్నాయి.
కడప జిల్లాలో
- ప్రభుత్వ పాఠశాలలు: 2,042
- ప్రైవేట్ పాఠశాలలు: 771
- విద్యార్థుల సంఖ్య: 2,95,000
| ప్రస్తుతం విద్యార్థులు మోస్తున్న పుస్తకాల సంచి బరువు ప్రభుత్వం ప్రైవేట్‌లో ఇలా (కిలోల్లో) | |||
| S.No | తరగతి | ప్రైవేట్ | ప్రభుత్వ పాఠశాల |
| 1 | 1 | 3.5 | 1.8 |
| 2 | 5 | 8 | 5 |
| 3 | 8 | 7.2 | 5.6 |
| 4 | 10 | 8.2 | 6.5 |
మీకు మార్కులు రాకపోతే నా మార్కులు పోతాయి : లోకేశ్
ప్రభుత్వ పాఠశాలలకు పెరిగిన క్రేజ్ - నెల్లూరులో 'నో అడ్మిషన్' బోర్డులు

