ETV Bharat / state

మెట్రోలో ఆ ఒక్క రోజు మాత్రం ఫుల్​ రష్ ఉంటుందట​​ - సోమవారం మాత్రం కాదండోయ్

బుధవారం రోజు మెట్రోలో అత్యధిక మంది ప్రయాణాలు - అందులో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులే - సాఫ్ట్​వేర్ కంపెనీలు హైబ్రిడ్‌ మోడల్‌ను అమలు చేస్తుండటంతో బుధవారానికే మొగ్గు చూపుతున్న ఉద్యోగులు

Hyderabad Metro Rush
హైదరాబాద్ మెట్రో (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : September 2, 2026 at 11:01 AM IST

2 Min Read
Choose ETV Bharat

Heavy Rush in Metro with IT Employees : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికుల అలవాట్లలో ఇటీవల చాలా రకాల మార్పులు వచ్చాయి. ఇది వరకు సోమవారం రోజు ఉదయం, సాయంత్రం మెట్రో రైళ్లు అత్యంత రద్దీగా ఉండేవి. ఇప్పుడు కూడా రద్దీగానే ఉంటున్నా, అంతకంటే ఎక్కువ మంది ప్రయాణికులు బుధవారం రోజు మెట్రోలో ప్రయాణాలు చేస్తున్నారు.

వారంలో రెండు రోజులు ఆఫీస్​కు : మెట్రో రైలు ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులే ఉంటున్నారు. ఎల్బీనగర్, ఉప్పల్, మియాపూర్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తూ మెట్రోలో ఐటీ కారిడార్‌కు వెళ్లి వస్తుంటారు. ప్రస్తుతం ఐటీ కంపెనీలు హైబ్రిడ్‌ మోడల్‌ను అమలు చేస్తున్నాయి. వారంలో 3 రోజులు ఇంటి నుంచి పని చేసే వెసులుబాటు ఇచ్చినా రెండు రోజులు ఆఫీస్​కు వచ్చి హాజరు వేయాలని చెబుతున్నారు. ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు వారం మధ్యలో బుధవారం రోజు కంపెనీకి వెళ్లేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఆ రోజు మెట్రో ప్రయాణికుల సంఖ్య అత్యధికంగా ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

తోపులాట - జరభద్రం : మెట్రో రైలు స్టేషన్లలో ప్రత్యేకంగా ప్రారంభ స్టేషన్లు అయిన నాగోల్, ఎల్బీనగర్, మియాపూర్‌ వంటి చోట్ల ఉదయం పూట రద్దీగా ఉంటుంది. ఇంటర్‌ ఛేంజ్‌ స్టేషన్‌ అయిన అమీర్‌పేటలో రద్దీగా ఉండటంతో తోపులాటలు చోటు చేసుకుంటున్నాయి. వీటితో ప్రయాణికులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. పొరపాటున కూడా ప్రయాణికులు ట్రాక్‌పై పడకుండా ఫ్లాట్‌ఫాంపై భద్రతా గ్రిల్‌ను ఏర్పాటు చేశారు. రద్దీగా ఉన్న మిగతా స్టేషన్లలోనూ వీటిని ఏర్పాటు చేయాలని ప్రయాణికులు మెట్రో యాజమాన్యాన్ని కోరుతున్నారు.

ట్రాఫిక్‌ ఆంక్షలతో : కేబీఆర్‌ పార్కు వద్ద ఫ్లైఓవర్‌ పనులు జరుగుతుండటంతో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సెంట్రల్‌ హైదరాబాద్‌ వాసులు ఐటీ కారిడార్‌ వెళ్లాలంటే కేబీఆర్‌ చుట్టూ తిరగాల్సి వస్తోంది. అక్కడ ట్రాఫిక్‌ను తప్పించుకునేందుకు కొందరు ప్రయాణికులు రిస్క్ తీసుకోవడమెందుకని మెట్రోను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ సంఖ్య చాలా స్వల్పంగానే ఉందని మెట్రో అధికారులు స్పష్టం చేస్తున్నారు.

రోజురోజుకు మెట్రోలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని గతంలో ఏర్పాటు చేసిన సమావేశంలోనే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రయాణికుల రద్దీకి తగినట్టుగా మెట్రో రైల్​కు అదనపు బోగీలను జత చేయాలని చెప్పారు. మెట్రో రైల్ కోచ్‌లను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సైతం గుర్తు చేశారు. హైదరాబాద్ మెట్రో రెండో ఫేజ్​లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఏడున్నర కిలోమీటర్ల కారిడార్‌ కోసం ప్రస్తుత టెక్నాలజీపై దిల్లీ మెట్రోను సంప్రదించి సలహాలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.

పూర్తిగా కానీ స్వాధీన ప్రక్రియ : హైదరాబాద్ మెట్రో స్వాధీన ప్రక్రియ ప్రస్తుతం సర్కారుకు కొంత తలనొప్పిగా మారింది. ఎల్​ అండ్​ టీ కంపెనీ నుంచి మెట్రోను కొనుగోలు చేయాలని భావించినా అదీ మాత్రం ఇంకా పూర్తికాలేదు. ఒప్పందాలు మాత్రమే అయ్యాయి. ఎల్​ అండ్​ టీ కంపెనీకి ఇవ్వాల్సిన నగదు ఇస్తే ఈ ప్రక్రియ ముగుస్తుంది. కానీ లోన్​ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ప్రస్తుతానికి ఈ సమస్య కేంద్రం వద్దే ఉంది.

ఓచోట 'డబుల్ డెక్', మరోచోట భూగర్భ మార్గం - మెట్రో రెండో దశలో సరికొత్త హంగులు

మెట్రో లైన్ల వద్ద ఫ్లైఓవర్​, అండర్​ పాస్​ల నిర్మాణాలు - అధికారులు వద్దంటున్నా కార్పొరేషన్ల ఆసక్తి!