ETV Bharat / state

రాష్ట్రంలో విభిన్న వాతావరణం - ఓ వైపు భానుడి భగభగలు - మరో వైపు ఆకస్మిక వానలు

ఎల్ నినో ప్రభావం కారణంగా వాతావరణ సరళిలో మార్పులు - భారీ వర్షాలు , ఈదురు గాలుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది - సతమతమవుతున్న ప్రజలు

Climate Changes Affects People In State
Climate Changes Affects People In State (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 25, 2026 at 8:30 PM IST

2 Min Read
Choose ETV Bharat

Heavy Rain Lashes Alluri District: ఎల్ నినో ప్రభావంతో వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రమంతటా భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో పెద్ద పెద్ద చెట్లు నేలకూలాయి. ఈ కుండపోత వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

వర్షాలకు అంతా అల్లకల్లోలం: అల్లూరి జిల్లాలో భారీ వర్షాపాతం నమోదైంది. పాడేరు, హుకుంపేట, డుంబ్రిగూడ మండలాల్లో వీచిన తీవ్రమైన ఈదురుగాలులతో ఒక్కసారిగా బీభత్సం సృష్టించింది. వర్షం తీవ్రత కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయాయి. మార్కాపురం జిల్లాలోని యర్రగొండపాలెంలో, బలమైన ఈదురుగాలులతో పాటు వడగళ్ల వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్రమైన ఉక్కపోతతో సతమతమవుతున్న స్థానికులకు, ఈ వర్షంతో కొంత ఉపశమనం లభించింది. త్రిపురాంతకం మండలంలోని మేడపి వద్ద ఉన్న టోల్ ప్లాజా పైకప్పు కూలిపోయింది. అదృష్టవశాత్తు, ప్రమాదం జరిగిన సమయంలో అక్కడం ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రస్తుతం వాహనాల రాకపోకలను టోల్ ప్లాజా పక్కనే ఉన్న సర్వీసు రోడ్డు ద్వారా మళ్లిస్తున్నారు.

రాష్ట్రంలో విభిన్న వాతావరణం - ఓ వైపు భానుడి భగభగలు - మరో వైపు ఆకస్మిక వానలు (ETV Bharat)

కర్నూలు జిల్లాలోనూ ఇదే పరిస్థితి: కర్నూలులో వీచిన ఈదురు గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. కర్నూలు కలెక్టర్ కార్యాలయ ఆవరణలోనే పలు భారీ వృక్షాలు కూలిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కూలిన చెట్లు కార్లు, ద్విచక్ర వాహనాలపై పడ్డాయి. కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన తాగునీటి కేంద్రం, చల్లదనాన్నిచ్చే పందిరి కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి.

విద్యుత్​ కోతలపై స్పందించిన మంత్రి : భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన పరిస్థితిపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెంటనే స్పందించారు. ఆయన క్షేత్రస్థాయి అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాలుల తీవ్రతను తట్టుకోలేక చెట్లు, డిస్‌ప్లే హోర్డింగ్‌లు విరిగి విద్యుత్ స్తంభాలపై పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అధికారులు మంత్రికి వివరించారు. వివిధ ప్రదేశాలలో లైన్లను క్లియర్ చేస్తూ, పునరుద్ధరణ పనులను వేగవంతం చేస్తున్నట్లు వారు ఆయనకు తెలియజేశారు.

ఎండకు నిప్పుల కొలిమిలా మారిన రాష్ట్రం - వడదెబ్బకు 18 మంది మృతి

ప్రజలకు అలర్ట్ - వచ్చే 3 గంటల్లో బలమైన ఈదురుగాలులతో వర్షాలు