కేబినెట్ భేటీలో మూసీపై వాడీవేడి చర్చ! - ప్రాజెక్టుపై సీఎం సమగ్ర వివరణ
కేబినెట్ భేటీలో మూసీ ప్రాజెక్టుపై వాడీవేడి చర్చ - నదిలోకి మంచినీళ్లు ఎక్కడి నుంచి వస్తాయన్న ఉత్తమ్ - ప్రతిపక్షాల్లా మాట్లాడితే ఎలాగన్న మరో సీనియర్ మంత్రి - ప్రాజెక్టుపై సమగ్రంగా వివరించిన ముఖ్యమంత్రి

Published : July 3, 2026 at 7:19 AM IST
Musi Project in Cabinet Meeting : కేబినెట్ భేటీలో మూసీ ప్రాజెక్టుపై వాడీవేడి చర్చ జరిగినట్లు సమాచారం. మూసీ నదిలోకి మంచి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతల మాదిరిగా మాట్లాడితే ఎలాగని ఉత్తమ్‌ను ఓ సీనియర్ మంత్రి అడిగినట్లు తెలిసింది. ఈ దశలో జోక్యం చేసుకున్న సీఎం, మూసీ ప్రాజెక్టు గురించి సమగ్రంగా వివరించారు. సాగునీటి ప్రాజెక్టుల సవరించిన అంచనాల ఫైళ్లు కేబినెట్ ముందుకు ఎందుకు రావడం లేదని ఉత్తమ్ ప్రశ్నించగా, వచ్చే కేబినెట్ భేటీలో ముఖ్య ఎజెండాగా చర్చిద్దామని సీఎం అన్నట్లు సమాచారం.
మూసీ పునరుజ్జీవం పనులతో పాటు సాగునీటి ప్రాజెక్టుల సవరించిన అంచనాలపై మంత్రివర్గ సమావేశంలో వాడీవేడి చర్చ జరిగినట్లు తెలిసింది. మంత్రివర్గ సమావేశంలో మూసీ ప్రాజెక్టు మొదటి దశ అంచనాల ఆమోదం ఎజెండా వచ్చిన సమయంలో మూసీకి మంచినీళ్లు ఎక్కడి నుంచి వస్తాయంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ పథకానికి నీటిని ఎక్కడి నుంచి తెస్తారు? ఎత్తిపోసే 20 టీఎంసీలలో 17.5 టీఎంసీలు తాగునీటికి పోతే, మిగిలిన రెండున్నర టీఎంసీలు మొత్తం వస్తుందా? అని అడిగినట్లు సమాచారం. మూసీపై చేసే ఖర్చు, ఆదాయం రేషియో ఏమిటని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో జోక్యం చేసుకున్న ఓ సీనియర్ మంత్రి ప్రతిపక్ష నేతల మాదిరే మనం మాట్లాడితే ఎలాగని వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
వారికి బలంగా సమాధానం చెప్పాలి : హైదరాబాద్ రూపురేఖలు మారాలంటే మూసీ ప్రక్షాళన చేసి తీరాల్సిందేనని అన్నట్లు సమాచారం. ఈ దశలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని అందరూ హర్షిస్తున్నారని తెలిపారు. విపక్షానికి చెందిన ఓ నాయకుడు మాత్రం మూసీని పునరుద్ధరణ జరగనివ్వబోమని చాలా గట్టిగా మాట్లాడుతున్నారని, అలాంటి వారికి బలంగా సమాధానం చెప్పాల్సింది పోయి, మనం కూడా వారి భాషే మాట్లాడితే ఎలా? అంటూ ఉత్తమ్ లేవనెత్తిన అంశాలకు సీఎం వివరణ ఇచ్చినట్లు తెలిసింది.
సాగునీటి ప్రాజెక్టుల సవరించిన అంచనాల ఫైళ్లు మంత్రివర్గానికే రావడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించినట్లు తెలిసింది. పొంతనలేని కొర్రీలతో అడ్డుకుంటున్నారని, ఇలా ఎందుకు జరుగుతోందని ఉత్తమ్ అడిగారని సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకొని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సమాధానం కోరారు. మంత్రివర్గ సమావేశానికి ఒకరోజు ముందు తన వద్దకు ఫైళ్లు వస్తాయని, సాంకేతిక అంశాల గురించి తెలుసుకోవడానికి సమయం లేకపోవడం వల్లే మంత్రివర్గ సమావేశానికి రాలేదని రామకృష్ణారావు పేర్కొన్నట్లు సమాచారం.
సవరించిన అంచనాలపైనే మొదట చర్చ : ఇవన్నీ చాలా సంవత్సరాలుగా జరుగుతున్న పనులని, అంచనాల సవరింపు తప్పనిసరని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఏదో ఒక అభ్యంతరంతో ఆపేస్తున్నారని ఉత్తమ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. మళ్లీ జోక్యం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, ఈ నెల 17న జరిగే మంత్రివర్గ సమావేశంలో సవరించిన అంచనాలపైనే మొదట చర్చ ఉంటుందని తెలిపారు. ఆ రోజు వరకు అన్ని ఫైళ్లు సిద్ధం చేయాలని, ఆ ఎజెండా ముగిశాకే వేరే అంశానికి వెళ్దామని స్పష్టం చేశారు. సందేహాలను తీర్చడానికి పూర్తిస్థాయిలో సిద్ధమై రావాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.
సింగరేణి సంస్థ జాయింట్ వెంచర్‌గా : రాజస్థాన్ సంప్రదాయేతర ఇంధన కార్పొరేషన్‌తో సింగరేణి సంస్థ జాయింట్ వెంచర్‌గా ఏర్పడి 1,500 మెగావాట్ల సోలార్ పవర్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ అంశంపై చర్చకు వచ్చినపుడు మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అభ్యంతరం ఎందుకని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించినట్లు సమాచారం. దీనిపై శ్రీధర్‌బాబు పలు అంశాలను లేవనెత్తగా, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. థర్మల్ ప్లాంట్ ప్రతిపాదనను మంత్రివర్గ ఉపసంఘానికి నివేదించాలని, అక్కడ చర్చించిన తర్వాతే కేబినెట్‌కు తేవాలని సీఎం సూచించినట్లు సమాచారం. విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన మంత్రి కొండా సురేఖ జెట్‌లాగ్ కారణంగా మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేదని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.
సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ - ఆ ఆస్పత్రుల్లో 6,278 పోస్టులు మంజూరు సహా కీలక నిర్ణయాలు ఇవే
బీఆర్ఎస్ నేతలు vs మినిస్టర్స్ : సవాళ్లు, ప్రతి సవాళ్లతో వేడెక్కిన రాజకీయం

