చలికాలంలో పళ్లు జివ్వుమంటున్నాయా! - అలా ఎందుకవుతుందో తెలుసా?
హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రత - అధిక శాతం మందిలో జలుబు, జ్వరం, దంతాల సమస్యలు - ఆస్పత్రులకు పెరుగుతున్న ఓపీ - చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

Published : December 25, 2025 at 3:50 PM IST
Health Precautions During Winter Season : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో రోజురోజుకూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో రాత్రి సమయాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో జ్వరం, జలుబుతోపాటు పలు అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ప్రధానంగా పంటి నొప్పి, దంతాల సున్నితత్వం, చిగుళ్ల వాపు, నొప్పితో ఎక్కువ మంది వైద్యులను సంప్రదిస్తున్నారు. సాధారణ రోజులతో పోల్చితే ప్రస్తుతం 5-10 శాతం ఓపీ పెరిగిందని సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు.
కారణాలు ఇవీ :
- ప్రయాణాలు చేసేటప్పుడు చలితోపాటు చల్లని గాలి ముఖానికి తగిలి నోట్లోకి వెళుతోంది. అతి చల్లదనం వల్ల దంతాలపై ఉండే ఎనామిల్ పొర దెబ్బతిని డెంటిన్ పొర బహిర్గతమవుతోంది. ఫలితంగా ఏదైనా చల్లని లేదా వేడిగా ఉండే ఆహార పదార్థాలను తిన్నప్పుడు జివ్వుమని లాగి నొప్పి పుడుతుంది.
- శీతాకాలంలో చాలామంది తక్కువ నీరు తాగుతుంటారు. ఫలితంగా శరీరం డీహైడ్రేషన్‌కు గురై నోరు తడి ఆరిపోతుంది. నోటిలో లాలాజలం కూడా తగ్గుతుంది. ఫలితంగా తడి లేక నోరు శుభ్రపడదు. పళ్లల్లో ఆహారం ఇరుక్కుపోయి పలు ఇన్‌ఫెక్షన్లకు దారి తీసే అవకాశం ఉంది. దంతాల చిగుళ్ల వాపునకు ఇలాంటివి కారణమవుతాయి.
- చాలామంది చలిలో వేడి చాక్లెట్‌లు, స్వీట్లు, బేక్ చేసిన ఆహారాన్ని తీసుకుంటుంటారు. షుగర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అవి దంతాలపై పేరుకుపోయి పిప్పి పళ్లు వచ్చేందుకు కారణమవుతాయి.
- చలి కారణంగా చాలామంది దంతాలు కొరుకుతుంటారు. దీనివల్ల దంతాల పైపొర దెబ్బతిని సున్నితంగా తయారయ్యే అవకాశం ఉంది. గాలిలో తేమ లేక పెదాలు పగిలి నోరు సక్రమంగా తెరవలేని పరిస్థితి ఉంటుంది. దంతాల శుభ్రతపై ఆ ప్రభావం పడుతుంది. దవడ బిగుతు పెరగడం కారణంగా నోరు తెరవలేరు. దంతాలను శుభ్రం చేసుకోలేరు.
"బ్రష్ చేసే విధానంలో మార్పు రావాలి. ముందు నుంచి వెనక్కి కాకుండా పై నుంచి కిందకి కింద నుంచి పైకి కనీసం 2 నిమిషాలు బ్రష్ చేసుకోవాలి. ముందు నుంచి వెనక్కి బ్రష్ చేయడం వల్ల ఎనామిల్ పొర దెబ్బతింటుంది. సెన్సిటివిటీ ఏర్పడుతుంది. చలికాలంలో ఈ తరహా కేసులు ఎక్కువగా వస్తుంటాయి. ఉదయమే కాకుండా రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకోవడం ఉత్తమం"- డాక్టర్ ప్రసాద్ మేకా, ప్రోస్టాడాంటిస్ట్, ఇంప్లాంటాలజిస్ట్, కిమ్స్
ఈ జాగ్రత్తలు కూడా :
- అల్లం టీ, మిరియాల సూప్ తులసీ టీ, లాంటివి దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
- పాదాల పగుళ్లుంటే అరటిపండు గుజ్జును అప్లై చేసి, 15 నిమిషాల తర్వాత కడగాలి.
- కాళ్ల వాపులున్నట్లయితే నువ్వుల నూనెతో మర్దనా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
- పెదాలు పొడిబారకుండా ఉండేందుకు వాటిపై కొబ్బరి నూనె లేదా తేనె లేదా పాలమీగడ రాసుకోవాలి.
- చుండ్రు పోవాలంటే జుట్టును వేపనూనెతో మర్దనా చేసుకోవాలి.
- ఇందులో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి
- రోజూ తగుమొత్తంలో నీటిని తీసుకోండి.
- బయటకు వెళ్లేటప్పుడు మాస్కులాంటివి అమర్చుకోండి
- వాకింగ్‌కు వెళ్లేవారు కాస్త సూర్యరశ్మి పడే సమయంలో వెళ్లడం ఉత్తమం
చర్మం పొడిబారుతోందా? : చలికాలంలో చాలా మందికి ఎదురయ్యే సమస్య చర్మం పొడిబారడం. దీన్ని నివారించాలంటే ప్రతిరోజూ గోరువెచ్చని నీటితో స్నానం చేయాలని నిపుణులు వివరిస్తున్నారు. ఆ తర్వాత బాడీకి నూనె లేదా మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలని సూచిస్తున్నారు. ఈ కాలంలో దాహం తక్కువగా ఉంటుందని, అయినప్పటికీ, రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తీసుకోవాలంటున్నారు. ఈ క్రమంలో సాధారణంగా మహిళలు రోజుకు సగటున 9 కప్పులు, పురుషులు సగటున 13 కప్పుల నీటిని తాగాలని National Institutes of Health (ఎన్ఐహెచ్) అధ్యయనంలో పేర్కొంది. దీంతో చర్మం ఆరోగ్యంగా, తాజాగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
చలిలో 'నడక' ఆరోగ్యానికి మంచిదేనా? - నిపుణులు ఏమంటున్నారంటే!
కూల్ వెదర్లో హాట్‌హాట్ " దాల్ సూప్" - కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు - టేస్ట్ సూపర్!

