ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి బాలికలకు ఉచిత హెచ్‌పీవీ టీకాలు - తల్లిదండ్రుల్లో ఒకరి సమ్మతి తప్పనిసరి

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల నివారణ కోసం హెచ్‌పీవీ టీకాలు - 3.45 లక్షలమంది బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకాలు - బాలికలకు వ్యాక్సిన్ వేసేందుకు తల్లిదండ్రుల్లో ఒకరి సమ్మతి తప్పనిసరి

Free HPV Vaccine Distribution in AP
Free HPV Vaccine Distribution in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 27, 2026 at 9:59 PM IST

3 Min Read
Choose ETV Bharat

Free HPV Vaccine Distribution in AP : మహిళల్లో గర్భశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్) నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో 14 ఏళ్లు కలిగిన సుమారు 3.45 లక్షల మంది బాలికలకు రేపటి(శనివారం) నుంచి ఉచితంగా హెచ్‌పీవీ(HPV) టీకాలు పంపిణీ చేయనున్నారు. ఈ ఉచిత హెచ్​పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఈ సందర్బంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1645 ఆరోగ్య కేంద్రాల ద్వారా 3 లక్షల 45వేల మంది బాలికలకు ఉచితంగా HPV టీకాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తొలి విడత కేంద్రం నుంచి లక్షా 90 వేల 800 డోసులు వచ్చాయన్నారు. 14 ఏళ్ల బాలికలకు వ్యాక్సిన్‌ వేసి సర్టిఫికేట్‌ అందచేస్తామని వెల్లడించారు.

కేంద్రం నుంచి 1,90,800 డోసులు : రాష్ట్రంలో నిల్వ సదుపాయం కలిగిన 1,645 ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే బాలికలకు వ్యాక్సిన్ అందిస్తారని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడించారు. తొలివిడత కింద ఇప్పటికే కేంద్రం నుంచి 1,90,800 డోసులు వచ్చాయన్నారు. బాలికలకు వాక్సిన్​ను డిస్ట్రిక్ట్​లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించే తేదీల్లో ఇస్తారని తెలిపారు. రాష్ట్రంలో 14 సంవత్సరాలున్న బాలికలకు వ్యాక్సిన్​తో పాటు సర్టిఫికెట్ కూడా అందచేస్తారని వెల్లడించారు. విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ, ఇతర శాఖల సమన్వయంతో సుమారు 3 నెలలపాటు ఈ వాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని వివరించారు.

నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ కార్యక్రమం కింద నమోదైన వివరాల ప్రకారం రాష్ట్రంలో 2021-25 మధ్య 75,000 క్యాన్సర్ కేసులు కొత్తగా నమోదయ్యాయనని, ఏడాదికి సగటున 30వేల వరకు మరణాలు సంభవించాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా మహిళల ఆరోగ్యానికి మరింత భరోసా పెరుగుతుందని చెప్పారు. దేశంలో అత్యధికంగా వెలుగుచూస్తున్న క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ రెండోస్థానంలో ఉందని, హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల వచ్చే ఈ క్యాన్సర్ 15 నుంచి 14 ఏళ్ల మహిళల్లో అధికంగా కనిపిస్తోందన్నారు.

వ్యాక్సిన్ పూర్తిగా సుర‌క్షిత‌ం : టీకా ద్వారా హెచ్​పీవి వైరస్ ద్వారా వచ్చే టైప్-6, 11, 16, 18 రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ లభిస్తుందని మంత్రి సత్యకుమార్ చెప్పారు. వ్యాక్సిన్ బాలికలకు ఇచ్చేముందు అధికారులు వారి తల్లిదండ్రుల్లో ఒకరి సమ్మతిని తీసుకుంటారని తెలిపారు. వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. ప్రాథ‌మిక‌, ప‌ట్టణ, సామాజిక‌ ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ‌, జిల్లా, స‌ర్వజ‌న‌ ప్రభుత్వాసుప‌త్రుల్లో హెచ్‌పీవీ టీకాలు వేసేందుకు వైద్యారోగ్య శాఖ అన్ని ఏర్పాట్లూ చేసిందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1.71 కోట్ల మందికి ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఎన్సీడి-04 ద్వారా జరుగుతోందని మంత్రి సత్యకుమార్ వివరించారు. హెచ్‌పీవీ టీకా వేసుకోవ‌డం వ‌ల్ల గర్భాశయ క్యాన్సర్​ను నివారించ‌డంతో పాటు హెచ్‌పీవీ సంక్రమణను తగ్గించి దీర్ఘకాల రోగనిరోధక శక్తి క‌లిగేలా దోహ‌ద‌ప‌డుతుందన్నారు. ఈ వ్యాక్సిన్ పూర్తిగా సుర‌క్షిత‌మైందని, వ్యాక్సిన్ వేసిన చోట‌ కాస్త నొప్పితో పాటు స్వల్పంగా జ్వరం వ‌స్తుందన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారిని 30 నిమిషాల పాటు అక్కడే అబ్జ‌ర్వేష‌న్​లో ఉంచి ఇంటికి పంపిస్తారన్నారు. వ్యాక్సినేష‌న్ కార్యక్రమం మొత్తాన్ని రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూం నుంచి ప‌ర్యవేక్షిస్తారని వెల్లడించారు.

కరోనాలా HMPV ప్రమాదకరంగా మారుతుందా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?

దేశవ్యాప్తంగా బాలికలకు ఉచితంగా HPV వ్యాక్సినేషన్‌- క్యాన్సర్​కు చెక్​ పెట్టేలా కేంద్రం కీలక నిర్ణయం