ETV Bharat / state

రైల్వేకోడూరు ఎమ్మెల్యే కేసు - హర్షవీణకు ముందస్తు బెయిలు

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసుపై హైకోర్టు కీలక నిర్ణయం - హర్షవీణకు ముందస్తు బెయిలు జారీ చేస్తూ ఉత్తర్వులు - అనుమతి లేకుండా జిల్లా దాటి వెళ్లకూడదని ఆదేశం

MLA Arava Sridhar Case Updates
MLA Arava Sridhar Case Updates (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 4, 2026 at 1:34 PM IST

3 Min Read
Choose ETV Bharat

High Court on Janasena MLA Arava Sridhar Case : రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసిన కేసులో హర్షవీణకు హైకోర్టు షరతులతో ముందస్తు బెయిలు మంజూరు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి దీన్ని అనుసరించి ఉత్తర్వులిచ్చారు.

అందుకు అనుగుణంగా వారంలో సంబంధిత కోర్టు ముందు హాజరై రూ. 20,000 బాండ్‌తో రెండు పూచీకత్తులను సమర్పించాలని హైకోర్టు ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. అభియోగపత్రం దాఖలు చేసేంత వరకు ఎస్‌హెచ్‌వో ముందు ప్రతి శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలలోపు ఏదో ఒక సమయంలో హాజరుకావాలని, అదే విధంగా దర్యాప్తునకు సహకరించాల్సిందిగా వెల్లడించింది. దీంతో పాటు విచారణకు అందుబాటులో ఉండాలని హర్షవీణకు తెలియజేసింది.

షరతులను ఉల్లంఘిస్తే చర్యలే: ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా సాక్షులను బెదిరించడం లేదా ప్రభావితం చేయడానికి ఏ మాత్రం వీల్లేదని ఈ సందర్భంగా హైకోర్టు తేల్చి చెప్పింది. న్యాయస్థానం అనుమతి లేకుండా జిల్లాను దాటి వెళ్లకూడదని తెలియజేసింది. పాస్‌పోర్టును కోర్టులో అప్పగించాలని, ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏ విధమైన మీడియాతోనూ పంచుకోకూడదని తెలిపింది. ఈ షరతులను ఉల్లంఘించినట్లయితే బెయిలు రద్దుకు పోలీసులు చర్యలు తీసుకోవచ్చునని న్యాయమూర్తి కొన్ని షరతులను విధించారు.

గతంలో హర్షవీణ నేరపూర్వక బెదిరింపులు, కుట్ర, బలవంతపు డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారంటూ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రైల్వే కోడూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం హర్షవీణ హైకోర్టును ఆశ్రయించారు.

అదే విధంగా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్​పై వచ్చిన ఆరోపణలపై విచారణకు కమిటీ నియమిస్తూ రాష్ట్ర జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ప్రసార మాధ్యమాలలో వచ్చిన వార్తలు, ఒక మహిళ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది.

ముగ్గురు సభ్యులతో కమిటీ : ఎమ్మెల్యే అరవ శ్రీధర్​పై వచ్చిన ఫిర్యాదుపై ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది. టి. శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టి.సి. వరుణ్​లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. దీని ప్రకారం అరవ శ్రీధర్ ఏడు రోజుల్లోగా కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని పేర్కొంది. కమిటీ సదరు ఆరోపణలపై నిజానిజాలు విచారణ చేసి పార్టీకి నివేదిక అందిస్తుంది. నివేదిక పరిశీలన చేసి, తుది నిర్ణయం వెలువడే వరకూ అరవ శ్రీధర్​ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేస్తూ జనసేన రాజకీయాల పార్టీ కార్యదర్శి హరిప్రసాద్ పేరుతో ప్రకటన విడుదలైంది.

ఆరోపణలను ఖండించిన ఎమ్మెల్యే: తనపై కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఖండించారు. ఎమ్మెల్యే పదవి కంటే ముందు గ్రామ సర్పంచ్​గా సేవలందించానని గుర్తు చేశారు. నియోజక వర్గాన్ని అభివృద్ధి వైపు నడిపించాలనే సంకల్పంతో మా అధినేత ఉపముఖ్యమంత్రి పవన్​ కల్యాణ్ అడుగుజాడల్లో పని చేస్తున్నానని శ్రీధర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అదే విధంగా తనను గత ఆరు నెలల నుంచి వేధింపులకు గురి చేస్తున్నారనీ, దీనిపై తన తల్లి పోలీసు స్టేషన్​లో సైతం ఫిర్యాదు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. చట్టంపై తనకు నమ్మకం ఉందనీ, నిజం తేలే వరకు న్యాయపోరాటాన్ని కొనసాగిస్తాననే అభిప్రాయాన్ని ఎమ్మెల్యే వ్యక్తం చేశారు.

రైల్వేకోడూరు ఎమ్మెల్యేపై ఆరోపణలు - ముగ్గురు సభ్యులతో జనసేన కమిటీ

రైల్వేకోడూరు ఎమ్మెల్యేపై ఆరోపణలు - సుదీర్ఘంగా విచారించిన జనసేన త్రిసభ్య కమిటీ