గుంటూరులో జనవరి 3 నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు
3వ ప్రపంచ తెలుగు మహాసభలకు వేదికైన గుంటూరు - 52 దేశాలకు చెందిన ప్రతినిధులు, తెలుగు సంఘాలకు ఆహ్వానం - జనవరి 4న విచ్చేయనున్న మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోకుల్

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 29, 2025 at 2:42 PM IST
World Telugu Conference Will Be Held in Guntur: మాతృభాషకు పెద్దపీట వేయడం ప్రభుత్వం, ప్రజల బాధ్యత. దీని దృష్టిలో పెట్టుకుని తెలుగువారి ఆత్మీయ పండుగకు గుంటూరు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. జనవరి 3, 4, 5 తేదీల్లో మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 16వ నంబరు జాతీయ రహదారి పక్కనే ఉన్న సాయి బొమ్మిడాలనగర్‌లోని శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక నగరం ఇందుకు వేదికవుతోంది.
'అనురాగ సంగమం'గా నామకరణం: ఈ సభలకు తెలుగువారి 'అనురాగ సంగమం'గా నామకరణం చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ మహాసభల ముఖ్య సమన్వయకర్తగా పి. రామచంద్రరాజు వేదికల నిర్మాణం, రోడ్ల ఏర్పాటు వంటి తదితర పనులను పర్యవేక్షిస్తున్నారు.
10 ఎకరాల్లో 5 వేదికలు: మొత్తం 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ సభలు జరగనున్నాయి. అయితే ప్రధానంగా 10 ఎకరాల్లో పార్కింగ్, మరో 10 ఎకరాల్లో వేదికలు ఏర్పాటవుతున్నాయి. దాదాపు 5,000 మంది కూర్చునేలా నందమూరి తారకరామారావు ప్రధాన వేదికను నిర్మిస్తున్నారు. కవి సమ్మేళనాలకు జాషువా, కరుణశ్రీ వేదిక, అవధానాల ప్రదర్శనల కోసం కొప్పరపు కవుల వేదిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తూము నరసింహదాసు వేదిక, పాడనా తెలుగు పాట కోసం ఘంటసాల, ఎస్.పి.బాలు వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 52 దేశాలతో పాటు మన దేశంలోని వివిధ తెలుగు సంఘాలకు ఆహ్వానాలు పంపారు.
రామోజీరావు ప్రదర్శనల ప్రాంగణం: ఈనాడు సంస్థల వ్యవస్థాపక ఛైర్మన్ రామోజీరావు పేరుతో ‘రామోజీరావు ప్రదర్శనల ప్రాంగణం’ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పుస్తకాలు, హస్తకళలు, ప్రాచీన తెలుగు వైభవానికి సంబంధించిన అంశాలు ఉంచుతారు. ప్రధానవేదిక ప్రాంగణం ముందు భాగంలో రామోజీరావు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
వేదిక ద్వారాలకు కళాకారుల పేర్లు: అందుబాటులో ఉన్న మొత్తం ఐదు సభా వేదికల ద్వారాలకు సినారె, దాశరథి, దాసరి నారాయణరావు తదితర తెలుగు కవులు, కళాకారులు, సినీ దిగ్గజాల పేర్లను పెడుతున్నారు. భోజన శాలలకు డొక్కా సీతమ్మ, పింగళి వెంకయ్య, డాక్టర్ పి.వి.జె.రాజు వంటి ఎందరో మహనీయుల పేరిట ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు.
మారిషస్ అధ్యక్షుడి రాక: జనవరి 4వ తేదీన మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోకుల్ ఈ కార్యక్రమానికి హాజరై మంచి సందేశం ఇస్తారని గజల్ శ్రీనివాస్ తెలిపారు. మారిషస్‌లో ఎక్కువమంది తెలుగువారు ఉండడంతో ఆహ్వానించామని గజల్ శ్రీనివాస్ చెప్పారు. అంతేకాకుండా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పూర్వపు సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి నలుగురు గవర్నర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ రాష్ట్రాల ఎంపీలు సైతం హాజరవుతారని గజల్ వివరించారు.
ప్రతిభావంతులకు విశిష్ట పురస్కారాలు: తెలుగుభాష అభ్యున్నతి, పరిరక్షణకు విశేష కృషి చేసిన సంస్థలు, ప్రతిభావంతులకు 80 పూర్ణకుంభ పురస్కారాలు, 40 విశిష్ట పురస్కారాలతో పాటు జీవన సాఫల్య పురస్కారాలనూ ప్రదానం చేయనున్నారు. వెయ్యిమంది కవులతో అమరావతికి సహస్ర కవితా నీరాజనం సమర్పించనున్నారు. దీనికితోడు పండితులతో సైతం అవధానం సాగనుండటం విశేషం.
మొత్తం 25,000 మందితో కార్యక్రమాలు: వీవీఐపీల కోసం ప్రత్యేకంగా సభావేదికల వద్ద మూడు క్యాప్సూల్ హోమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఇంటిని తలపించేలా షవర్లు, బెడ్‌రూమ్, బాల్కనీ వంటి వసతులన్నీ ఉన్నాయి. అతిథుల కోసం గుంటూరు పరిసరాల్లో 3,000 గదులను నిర్వాహకులు ఇప్పటికే సిద్ధం చేశారు. మొత్తం మూడు రోజుల పాటు దాదాపు 25,000 మంది యువతీ యువకులతో తెలుగు భాషపై వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు.
మాతృభాషకు పెద్దపీట వేయడం ప్రభుత్వం, ప్రజల బాధ్యత: స్పీకర్ అయ్యన్నపాత్రుడు

