మిలియన్ ప్లస్ సిటీగా గుంటూరు - 18 గ్రామాలను విలీనం చేస్తే ప్రగతికి బాటలే
18 గ్రామాల విలీన ప్రతిపాదనకు జీఎంసీ కౌన్సిల్ తీర్మానం - కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి - ఆమోదిస్తే ప్రగతికి బాటలే! మరో 3 రోజులే గడువు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 28, 2025 at 8:44 AM IST
Guntur Municipal Corporation Expansion: జీఎంసీలో 15 ఏళ్ల క్రితం 10 గ్రామ పంచాయతీలు విలీనం అయ్యాయి. గుంటూరు గ్రామీణం పరిధిలో కొన్ని గ్రామాలను జీఎంసీలోకి విలీనం చేయాలన్న ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. వీటి పంచాయతీ కేంద్రాలు జీఎంసీలో ఉండగా అనుబంధ గ్రామాలు మాత్రం పంచాయతీశాఖల పరిధిలో ఉన్నాయి. దీంతో అభివృద్ధి సమస్యగా మారింది. మిలియన్ ప్లస్ సిటీ రాష్ట్రంలో ఇప్పటివరకు విశాఖపట్నం, విజయవాడ మాత్రమే ఈ జాబితాలో ఉన్నాయి. తాజాగా గుంటూరు ఆ సరసన చేర్చాలని జీఎంసీ కౌన్సిల్ భావిస్తున్నారు. ఇందుకుగానూ ప్రాథమిక కసరత్తు శనివారం పూర్తి అయింది.
3 రోజులే గడువు: జీఎంసీలో మొత్తం 18 గ్రామాలను విలీనం చేసేందుకు కౌన్సిల్ ఆమోదించి కలెక్టర్‌కు పంపింది. ఇందులో 11 గ్రామాల్లో ఇప్పటికే గ్రామసభలు పూర్తి అయ్యాయి. మిగిలిన వాటికి నిర్వహించాల్సి ఉంది. ఇదంతా పూర్తి అయి ప్రభుత్వానికి పంపించారు. దీనికి ఆమోద ముద్ర పడితే గుంటూరు కూడా మిలియన్ ప్లస్ సిటీగా అవతరించినట్టే. ఈ ప్రక్రియకు మరో 3 రోజులే గడువు ఉండడం గమనార్హం.
మిలియన్ ప్లస్ సిటీ అంటే: 10 లక్షల జనాభా దాటిన నగరాలను మిలియన్ ప్లస్ సిటీగా పరిగణిస్తారు. 2011 లెక్కల ప్రకారం గుంటూరు జనాభా 7.43 లక్షలు మంది ఉన్నారు. ప్రస్తుతం జనాభా 9.40 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. 18 గ్రామాల జనాభా 65 వేలు కలిపితే 10 లక్షలు దాటుతుంది.
కీలకమైన అంశాలు: గ్రామాల విలీనం వల్ల నిర్వహణపరమైన సమస్యలు ఏర్పడతాయని కొందరు సభ్యులు పేర్కొన్నారు. ఇప్పటికే అధికారులు, సిబ్బంది కొరత ఉందని వెల్లడించారు. దీని వల్ల జీఎంసీపై మరింత భారం పడుతుందని చెప్పారు. దీనికి ప్రత్యామ్నాయం ఉంటే చూడాలని తూర్పు ఎమ్మెల్యే నసీర్ సూచించారు.
చివరి క్షణాల్లో హడావుడి: ఏడాదంతా అధికారులు మిలయన్ ప్లస్ సిటీ జాబితాలో గుంటూరును చేర్చాలని పట్టించుకోలేదు. ప్రజాప్రతినిధులు చివరి క్షణాల్లో విలీన గ్రామాలపై హడావుడి చేస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రతిపాదనలు ఉంటే పంపాలని జీఎంసీ అధికారులు డీపీవోకు 3 నెలల క్రితమే లేఖ పంపించారు. డిసెంబరు 31 తుది గడువు అని పేర్కొన్నారు. ఈ నెల మొదట్లో ప్రత్యుత్తరం రావడంతో దీనిపై మళ్లీ చర్చ మొదలైంది.
18 గ్రామాల్లో ఇలా: జొన్నలగడ్డ, తోకవారిపాలెం, దాసుపాలెం, గొర్లవారిపాలెం, మల్లవరం, తురకపాలెం, చినపలకలూరు, చల్లావారిపాలెం, వెంగళాయపాలెం, ఓబులనాయుడుపాలెం, లాల్‌పురం గ్రామాల్లో గామసభలు తీర్మానాలు చేశాయి.
లామ్, కొర్నిపాడు, పుల్లడిగుంట, తక్కెళ్లపాడు, అగతవరప్పాడు వెనిగండ్లతో పాటు కౌన్సిల్‌లో ప్రతిపాదించిన గ్రామం పెదకాకాణి ఇలా ఏడింటికి ఆయా ఎమ్మెల్యేల ఆమోదం, పంచాయతీల తీర్మానం జరగాల్సి ఉంది.
ఉపయోగాలు ఏమిటంటే: కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు వస్తాయి. భవిష్యత్తులో స్మార్ట్‌సిటీ నగరాల జాబితాలో చేరొచ్చు. ప్రత్యేక పథకాలు, నిధులు మంజూరు అవుతాయి. ప్రతిపాదిత విలీన గ్రామాల్లో దాదాపుగా 3 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి.
30 కి.మీ. దూరంలోనే రాజధాని: భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర సంస్థలు, పరిశ్రమలు ఏర్పాటై ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. జిల్లా కేంద్రానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే రాజధాని అమరావతి రూపుదిద్దుకుంటుండడం ఇందుకు కలిసొచ్చే అంశం. అలాగే విలీన గ్రామాల పరిసరాల్లో ఓఆర్‌ఆర్ వెళ్తుండడం కూడా దీనికి ఎంతో మేలు జరగనుంది.
జీఎంసీలో మరో అదనపు కమిషనర్ పోస్టు సహా కొన్ని విభాగాలు, అదనపు పోస్టులు మంజూరు అవుతాయి. సర్కిళ్లు, జోన్లు ఏర్పాటు చేసుకోవచ్చని నిన్న (శనివారం) కౌన్సిల్ సమావేశంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు సభ్యులకు వివరించారు.
రాజధాని రైతులకు గుడ్‌న్యూస్ - లింక్ డాక్యుమెంట్లు లేకుండానే రుణాలు
తెరపైకి 'గ్రేటర్ విజయవాడ' - సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు

