కేజీ టు పీజీ వరకు ఇంగ్లీష్ మీడియంలోనే బోధన - ఎప్ సెట్ రద్దు : తెలంగాణ విద్యా విధానం-2026 నివేదిక
నూతన విద్యా విధానంపై నివేదిక రూపొందించిన విద్యా కమిషన్ - తెలంగాణ విద్యా విధానం-2026లో భాగంగా పలు అంశాలపై సూచన - కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్ మాధ్యమంలోనే బోధించాలని వెల్లడి

Published : February 27, 2026 at 7:31 AM IST
Education Commission On New Policy Telangana : విద్యార్థులకు నర్సరీ మొదలుకొని పీజీ వరకు ఆంగ్లంలోనే బోధించాలని తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మాసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఎప్ సెట్‌ను రద్దు చేయాలని తెలిపింది. బడ్జెట్లో విద్యకు 18 శాతం కేటాయించాలని కమిషన్ పేర్కొంది. నూతన విద్యా విధానంపై విద్యా కమిషన్ రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
విద్యా విధానంపై పలు సిఫారసులు : ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీ కోసం ఏర్పాటైన తెలంగాణ విద్యా కమిషన్ సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆకునూరి మురళి ఛైర్మన్‍గా ఏర్పాటైన ఈ కమిషన్ పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు పలు సిఫారసులు చేస్తూ తెలంగాణ విద్యా విధానం-2026ను రూపొందించింది. ఇందుకు సంబంధించిన నివేదికను కమిషన్ సీఎం రేవంత్‌రెడ్డికి అందించింది. ఇందులోని వివరాలను ఛైర్మన్ మురళీ సీఎంకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
86 శాతం టీచింగ్ పోస్టులు ఖాళీ : పైతరగతి విద్యార్థులు కింది తరగతిలోని పుస్తకాలను కూడా చదవలేకపోతున్నట్లు కమిషన్ గుర్తించింది. విద్యార్థులే లేని బడుల సంఖ్య 1920 ఉన్నాయని, దేశంలోనే రెండో స్థానంలో ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. 82 శాతం పాఠశాలల్లో మల్టీ గ్రేడ్ టీచింగ్ ఉందని, 36 శాతం ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క టీచర్ మాత్రమే ఉన్నారని పేర్కొంది. నాణ్యమైన పాఠశాల విద్యలో మన ర్యాంకు 26వ స్థానంలో ఉందని, విశ్వవిద్యాలయాల్లో 86 శాతం టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది.
బోధన ఆంగ్ల మాధ్యమంలోనే : అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న విద్యా కమిషన్ తెలంగాణ విద్యా విధానంలో పలు సిఫార్సులు చేసింది. విద్యా విధానంలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలను ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు 1,500 మంది విద్యార్థులతో, అన్ని మౌలిక సదుపాయాల కలిగిన క్యాంపస్, బస్ సౌకర్యం ఏర్పాటు చేయాలని తెలిపింది. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని సూచించింది. ఒకటో తరగతి నుంచి పీజీ వరకు విద్యా బోధన ఆంగ్ల మాధ్యమంలోనే ఉండాలని, త్రిభాషా విధానం సైతం ఒకటో తరగతి నుంచే ఉండాలని కమిషన్ సిఫార్సు చేసింది. మధ్యాహ్న భోజనాన్ని కళాశాల వరకు విస్తరించాలని కమిషన్ సూచించింది. విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులందరికీ బీఎడ్ తప్పనిసరి చేయాలంది.
"నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలు ప్రీప్రైమరీ స్కూళ్లల్లో తప్పనిసరిగా ఉండాలి. తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనే కొత్త విధానం తేవాలని సూచించాం. ఇలాంటివి ప్రతి మండలానికి సగటున 3 పాఠశాలలు పెడితే బాగుంటుంది. ఒక్కో స్కూల్లో 1500 మంది పిల్లలు ఉండాలి. దీనిలో నర్సరీ నుంచి 12 తరగతి వరకు అందుబాటులో ఉండాలి. విద్యార్థులకు పూర్తి సౌకర్యాలు ఉండాలి. వీటిలో 52 అంశాలు తప్పని సరిగా ఉండాలి. ఒకటో తరగతి నుంచి 3 భాషలనూ అలవాటు చేయాలి. నర్సరీ నుంచి పీజీ వరకు బోధన ఇంగ్లిష్ మీడియంలోనే ఉండాలి." - ఆకునూరి మురళీ, విద్యాకమిషన్ ఛైర్మన్
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు : ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరుతో నిర్వహిస్తున్న పాఠశాలలో వచ్చిన ఉత్తమ ఫలితాలను కమిషన్ నివేదికలో పొందుపర్చింది. ఆరుట్ల పాఠశాల తరహాలో రాబోయే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరో 400 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. ఏటా 400 తెలంగాణ పబ్లిక్ పాఠశాలను ఏర్పాట చేసుకుంటే పోతే 2031 నాటికి 2,000 పాఠశాలలవుతాయంది.
తప్పుదోవ పట్టించే ప్రకటనలపై నియంత్రణ : ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ పేరుతో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పడటంతో పాటు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని కమిషన్ అభిప్రాయపడింది. ఈ కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లను నియంత్రించడానికి చట్టంలో సవరణలు తీసుకురావాలని విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా ఇచ్చే ప్రకటనలపైనా నియంత్రణ అవసరమని కమిషన్ సిఫార్సు చేసింది.
ఎస్సెస్సీ బోర్డును ఇంటర్మీడియెట్‌లో విలీనం : 12వ తరగతిలో మాత్రమే బోర్డు ఎగ్జామ్ నిర్వహించాలని ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఎప్ సెట్ ను రద్దు చేసి 12వ తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని కమిషన్ సూచించింది. బడ్జెట్లో 18శాతం విద్యకు కేటాయించడం వల్ల ప్రమాణాలు మెరుగుపడతాయని కమిషన్ తెలిపింది. ఎస్సెస్సీ బోర్డును ఇంటర్మీడియెట్‌లో విలీనం చేయాలని సిఫారసు చేసింది. విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడానికి కనిష్ట ఉత్తీర్ణత 45 శాతానికి పెంచాలని స్పష్టంచేసింది. యూజీ, పీజీ కనీస ఉత్తీర్ణతను 50శాతానికి పెంచాలని సూచించింది. ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఫీజులను నియంత్రించాలని విద్యా కమిషన్ సిఫారసు చేసింది.
ఇంటర్నేషనల్ స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలు - మండలానికి రెండు?

