ETV Bharat / state

మహిళా కమిషన్ విచారణకు హాజరైన గుడివాడ అమర్నాథ్ - పోలీసులతో లాయర్ పొన్నవోలు తీవ్ర వాగ్వాదం

హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యల కేసులో కొనసాగుతున్న విచారణ - న్యాయవాదులతో కలిసి మహిళా కమిషన్ కార్యాలయానికి వచ్చిన అమర్నాథ్ - మాజీ మంత్రికి మద్దతుగా భారీగా చేరుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు

Gudivada Amarnath Enquiry
Gudivada Amarnath Enquiry (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 30, 2026 at 4:55 PM IST

3 Min Read
Choose ETV Bharat

Gudivada Amarnath Enquiry : రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైఎస్సార్సీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విచారణకు హాజరయ్యారు. ఏపీ మహిళా కమిషన్ కార్యాలయంలో ఆయన విచారణను ఎదుర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి అమర్నాథ్‌పై ఇదివరకే పోలీసు కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఆయన మహిళా కమిషన్ ముందు విచారణకు స్వయంగా హాజరు కావాల్సి వచ్చింది.

అమర్నాథ్ విచారణకు వచ్చే సమయంలో మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయనకు మద్దతుగా భారీ ఎత్తున వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు అక్కడికి చేరుకున్నారు. అమర్నాథ్​కు అనుకూలంగా వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కార్యాలయం పరిసరాల్లో కాసేపు గందరగోళం చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మహిళా కమిషన్ విచారణకు హాజరైన గుడివాడ అమర్నాథ్ - పోలీసులతో లాయర్ పొన్నవోలు తీవ్ర వాగ్వాదం (ETV Bharat)

పోలీసులతో తీవ్ర వాగ్వాదం : మాజీ మంత్రి అమర్నాథ్ వెంట ఆయన న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా విచారణ నిమిత్తం వచ్చారు. ఈ సమయంలో పోలీసులతో ఆయన తీవ్ర వాగ్వాదానికి దిగారు. అక్కడే బందోబస్తు విధులు నిర్వహిస్తున్న గ్రామీణ సీఐ వెంకట్​తో పొన్నవోలు వాదించారు. ఆగ్రహంతో సీఐకి వేలు చూపించి బెదిరింపు ధోరణిలో ఆయన మాట్లాడారు. ఈ ఘటనతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

'దిస్ ఈజ్ టూ మచ్' : అమర్నాథ్ మహిళా కమిషన్ కార్యాలయంలోకి వెళ్లిన తర్వాత మరో నాటకీయ పరిణామం జరిగింది. ఆయన వెంట లోపలికి వెళ్లేందుకు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రయత్నించారు. అయితే పోలీసులు ఆయనను గేటు వద్దే గట్టిగా అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై పొన్నవోలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 'దిస్ ఈజ్ టూ మచ్' అంటూ పోలీసు సిబ్బందితో వాదనకు దిగారు.

పొన్నవోలు వాదనలకు సిబ్బంది కూడా ధీటుగా బదులిచ్చారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ నుంచి అనుమతి వస్తేనే లోపలికి పంపిస్తామని సిబ్బంది తేల్చి చెప్పారు. ఆమె అనుమతి లేకుండా ఎవరినీ లోపలికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో పొన్నవోలుతో పాటు మరో ఇద్దరు లాయర్లు కూడా కార్యాలయం వద్దకు వచ్చారు. వారు కూడా లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు నిలువరించారు. ఆ ఇద్దరు లాయర్లను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి బయటికి పంపించేశారు.

బయట ఈ నాటకీయ పరిణామాలు జరుగుతుండగానే లోపల విచారణ కొనసాగింది. మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ ఈ విచారణను చేపట్టారు. మాజీ మంత్రి అమర్నాథ్​ను ఆమె సుమారు గంట పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆమె పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం, ఇతర అంశాలపై ఆమె నిశితంగా ఆరా తీసినట్లు సమాచారం. విచారణ అనంతరం అమర్నాథ్​ మీడియాతో మాట్లాడారు.

రాజకీయ కోణంలోనే విమర్శలు : హోం మంత్రి అనితపై తాను రాజకీయ కోణంలోనే విమర్శలు చేశానని, ఎక్కడ వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడలేదని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఇదే విషయాన్ని మహిళ కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజకు సమాధానం ఇచ్చానని చెప్పారు. మహిళా కమిషన్​ అడిగిన కొన్ని ప్రశ్నలకు తాను రాజకీయ కోణంలోనే విమర్శలు చేసినట్లు కమిషన్ దృష్టికి తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. ఇకపై తాను హోంశాఖ పైనే దృష్టి సారిస్తానని తెలిపారు. తమ నాయకులపై విమర్శలు చేసే వారిని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వారిని వదిలిపెట్టమన్నారు. తనకు మహిళలంటే గౌరవం ఉందని చెప్పారు. అమర్నాథ్ ఇచ్చిన సమాచారాన్ని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత మళ్లీ విచారణకు పిలిచే అంశంపై నిర్ణయం తీసుకుంటామని కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ చెప్పారు.

అసలు ఏం జరిగిందంటే : ఇటీవల జరిగిన ఒక బహిరంగ సభలో అమర్‌నాథ్ రాష్ట్ర హోం మంత్రి అనితను ఉద్దేశించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. ఆమెను 'మేకప్ మంత్రి' అంటూ అనడమే కాకుండా "ఆమె వేసుకునే కిలోల కొద్దీ మేకప్" అంటూ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పర్యవేక్షించే కీలక బాధ్యత కలిగిన హోం మంత్రిని, అందులోనూ ఒక మహిళా ప్రజాప్రతినిధిని ఇలా కించపరచడం పెద్ద రాజకీయ వివాదానికి దారి తీసింది.

'హాజరై వివరణ ఇవ్వండి' - గుడివాడ అమర్‌నాథ్‌కు మహిళా కమిషన్ నోటీసులు

అనితపై గుడివాడ అమర్నాథ్ అనుచిత వ్యాఖ్యలు - మహిళా కమిషన్‌కు ఫిర్యాదు