జీఎస్టీ వసూళ్లలో ఏపీ సరికొత్త రికార్డు - ఫిబ్రవరి నెలలో రూ. 3,061 కోట్ల ఆదాయం
జీఎస్టీ వసూళ్లలో వృద్ధి నమోదు చేసిన ఏపీ - ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ. 3061 కోట్ల ఆదాయం, గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే నెట్ జీఎస్టీ వసూళ్లలో 5.45 శాతం మేర వృద్ధి

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 2, 2026 at 9:32 AM IST
AP Sets Record in GST Collection February: నికర జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం వృద్ధి నమోదు చేసింది. 2017లో జీఎస్టీ అమలైనప్పటి నుంచి చూస్తే ఈ ఏడాది ఫిబ్రవరి నెల వసూళ్లు అత్యధికంగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో వసూలైన నికర జీఎస్టీ రూ. 2,902 కోట్లు కాగా ఈ ఏడాది వసూళ్లు రూ. 3,061 కోట్లు. ఈ లెక్కన జీఎస్టీ గతేడాది కంటే రూ.159 కోట్లు అదనంగా వసూలైంది.
జీఎస్టీ వసూళ్లలో రికార్డు: ప్రధాన సరుకులు, వినియోగ వస్తువులు, ఔషధాలు, సిమెంట్‌పై పన్ను రేట్లు తగ్గినా జీఎస్టీ 2.0 సంస్కరణ వల్ల జీవిత బీమా, ఆరోగ్య బీమాపై జీఎస్టీ ఉపసంహరణ జరిగినా నికర వసూళ్లలో ఏపీ ప్రభుత్వం వృద్ధినే నమోదు చేసింది. పన్ను రేటు తగ్గింపులు, వ్యూహాత్మక విధాన చర్యలు, మెరుగైన విధానాల వల్ల వినియోగం పెరగటం రాష్ట్ర ఆదాయ వృద్ధికి దోహదపడిందని రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్ బాబు.ఎ తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నికర జీఎస్టీ వసూళ్లు రూ. 3,061 కోట్ల రూపాయలకు చేరాయి. అనేక వస్తువుల పన్ను తగ్గించినప్పటికీ వసూళ్లు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే వరుసగా 11 నెలల పాటు జీఎస్టీ నికర వసూళ్లు అధికంగా నమోదయ్యాయి.
వసూళ్లలో అధిక వృద్ధి నమోదు: వివిధ వస్తువులపై పన్ను రేట్లు తగ్గినప్పటికీ 2025 ఫిబ్రవరిలో జీఎస్టీ వసూళ్లతో పోలిస్తే నెట్ జీఎస్టీ వసూళ్లలో 5.45 శాతం మేర వృద్ధి నమోదైంది. ప్రతినెలా క్యుమిలేటివ్ జీఎస్టీ వసూళ్లతో దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ 2025-26లో మొదటి స్థానంలో ఉంది. పన్ను రేట్ల తగ్గింపు, పొగాకు, మద్యం, విలాసవంతమైన వస్తువుల మినహా మిగిలిన వస్తువులపై సెస్సు మినహాయించిన తర్వాత 2026 ఫిబ్రవరిలో గ్రాస్ జీఎస్టీ కింద 3వేల562 కోట్లు వసూలైంది. అది 2025 ఫిబ్రవరిలో రూ. 3.569 కోట్ల రూపాయలుగా ఉంది. పన్ను రేట్ల తగ్గింపు, అన్ని ఉత్పత్తులపై సెస్ ఉపసంహరణ ప్రభావంతో స్వల్పంగా 0.22 శాతం తగ్గింది. ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే స్థిరమైన, సగటు కన్నా జీఎస్టీ వసూళ్లలో అధిక వృద్ధిని నమోదు చేస్తోంది.
గత ఏడాది ఫిబ్రవరిలో జీఎస్టీ వసూళ్లతో పోలిస్తే ఎస్‌జీఎస్టీ వసూళ్లలో 2.96 శాతం పెరుగుదల నమోదై మొత్తం రూ. 12,051 కోట్లకు చేరింది. కేంద్రం ఐజీఎస్టీ సెటిల్‌మెంట్‌లో 7.27 శాతం పెరుగుదలతో మొత్తం రూ. 18,9.85 కోట్లు వచ్చింది. పెట్రోలియం వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం రూ. 1442 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 3.06 శాతం పెరుగుదల నమోదయ్యింది. ప్రొఫెషనల్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయంలో 31.97 శాతం పెరిగింది. వాణిజ్య పన్నుల శాఖ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను గుర్తించడంలో చేసిన కృషి కారణంగా ఐజీఎస్టీ సెటిల్‌మెంట్ కింద కేంద్రం నుంచి వచ్చే మొత్తం పెరిగింది.
ఆదాయ వృద్ధి రేటు 4.63 శాతం: రాష్ట్రం గతంలో పడిపోతున్న జీఎస్టీ వసూళ్లను ఆపడమే కాకుండా 2026 ఫిబ్రవరిలో 4.63 శాతం వృద్ధిని సాధించింది. 2025 ఏప్రిల్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు క్యుమిలేటివ్ పెరుగుదల 4.77 శాతంగా నమోదైంది. వసూళ్లు కఠినతరం చేయడం, తప్పుడు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్‌లు నియంత్రించడం, కేంద్రం నుంచి ఐజీఎస్టీ సెటిల్‌మెంట్‌లో కచ్చితత్వంతో ఇది సాధ్యమైంది. ఫిబ్రవరిలో అన్ని సెక్టార్ల నుంచి వసూళ్లు రూ. 4,634 కోట్లు. గత ఏడాది ఇదే కాలానికి వసూలైన మొత్తం రూ. 4,428 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే అన్ని సెక్టార్లలో కలిపి ఆదాయ వృద్ధి రేటు 4.63 శాతంగా ఉంది.
కేసుల పరిష్కారంలో చురుకైన పాత్ర: పన్ను ఎగవేత, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్‌లలో నిబంధనలు కఠినతరం చేయడం, అంతర్ రాష్ట్ర లావాదేవీలకు సంబంధించి రిటర్న్‌లు ఫైలింగ్‌ల వ్యత్యాసాన్ని గుర్తించేందుకు డేటా విశ్లేషణ, ఏఐ వినియోగించడం వంటి చర్యలు వసూళ్లు పెంచేందుకు దోహదపడ్డాయి. ఆడిట్‌లు దర్యాప్తులు వేగంగా పూర్తి చేయడం, అంతర్ రాష్ట్ర లావాదేవీలను గుర్తించి ఐజీఎస్టీ చెల్లించేలా చూడటం, నిర్దేశిత వ్యవధిలోగా రిటర్న్‌లు కచ్చితమైన వివరాలతో ఫైల్ చేసేలా వ్యాపారులను ప్రోత్సహించడం వంటివి సత్ఫలితాలనిచ్చాయి.
పన్ను ఎగవేతదారులను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ల నిర్వహణ, దీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించడంలో ప్రభుత్వం చురుకైన విధానాన్ని అమలు చేస్తోంది. వారి ఆస్తులు, బ్యాంకు ఖాతాలను గుర్తించి నిబంధనల మేరకు రికవరీ చేసేలా చర్యలు చేపట్టింది.
సవరణల తరువాత జీఎస్టీ వసూళ్లలో నూతనోత్సాహం
దక్షిణాదిన ఏపీలోనే అత్యధిక జీఎస్‌టీ వృద్ధిరేటు.. ఆదాయపరంగా 4వ స్థానంలో రాష్ట్రం

