ETV Bharat / state

'కభీ కభీ మేరే దిల్‌ మే', 'నన్ను దోచుకుందువటే' - ఆ పార్కులో పాత మధురాలు

పాత పాటలతో అందరినీ అలరిస్తున్న మిత్రులు - ఎలాంటి సంగీత శిక్షణ లేకుండా, కేవలం పాడాలనే ఆసక్తితో - వాకింగ్‌లో ఏర్పడిన స్నేహితులతో బృందంగా మారి - అవకాశం వస్తే కచేరీలకు కూడా సిద్ధంగా

Group Of People Singing 90s Songs In Narayanguda Park
Group Of People Singing 90s Songs In Narayanguda Park (EENADU)
author img

By ETV Bharat Telangana Team

Published : January 10, 2026 at 1:00 PM IST

3 Min Read
Choose ETV Bharat

Group Of People Singing 90s Songs In Narayanguda Park : శని, ఆదివారాలు వచ్చాయంటే ఆ ఉద్యానవనంలో మంచి పాటలు వినిపిస్తుంటాయి. 'జిందగీ ఏక్‌ సరఫరా హై సుహానా', 'కభీ కభీ మేరే దిల్‌ మే', 'నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని' వంటి పాత మధురాలతో ఆ ప్రదేశం మురిసిపోతుంది. అక్కడకు వచ్చే వాకర్స్, సందర్శకులు ఆ పాటలను వింటూ పరవశించిపోతుంటారు. వారంతా ప్రముఖ గాయనీ గాయకులు, సంగీత విద్వాంసులు అనుకుంటే పొరపాటే.

చిన్ననాటి నుంచి పాడాలనే ఆసక్తి : వీరికి ఎలాంటి సంగీత శిక్షణ లేదు. ఉన్నదల్లా బాల్యం నుంచి పాటలు పాడాలనే ఆసక్తి మాత్రమే. అప్పుడున్న సామాజిక, కుటుంబ పరిస్థితులతో సాధ్యపడలేదు. అప్పటి వినోద సాధనాలు రేడియో, టేప్‌ రికార్డర్‌లలో అలాగే ప్రస్తుతం సెల్‌ఫోన్‌లో పాటలు వింటూ కూనిరాగాలు తీస్తూ చేసిన స్వీయసాధనే వారిని గాయనీ, గాయకులుగా తీర్చిదిద్దింది. వారిలో మేమూ పాడగలమనే విశ్వాసాన్ని పెంచింది. తమ ప్రతిభను ప్రపంచానికి తెలియజేయడానికో వేదిక కావాలి. కానీ అనుభవం లేనివారికి అవకాశాలు ఎవరిస్తారు? అలాగని వారు నిరుత్సాహపడలేదు. తామే ఒక వేదికను సృష్టించుకోవాలనుకున్నారు.

అందరూ 5 పదులు దాటిన వారే : 'ఆరోగ్యమే మహాభాగ్యం' అనుకొని చాలా మంది 'నారాయణగూడ, విఠల్‌వాడిలోని జీఎస్‌మెల్కోటే పార్కు'లో ప్రతిరోజు ఉదయం వాకింగ్‌కు వస్తుంటారు. ఆ క్రమంలో ఏర్పడిన స్నేహితులైన వారు తమ అభిప్రాయాలు, అభిరుచులు పంచుకునే సందర్భంలో పాటల గురించి చర్చ రావడంతో ఔత్సాహికులంతా ఒక బృందంగా ఏర్పడ్డారు. ఇందులో చాలా వరకు 5 పదుల వయసు దాటిన వారే ఉన్నారు. సొంతంగా ఒక మైక్‌సెట్‌ సిద్ధం చేసుకున్నారు. నేరుగా లైవ్‌ సంగీతంతో (వాయిద్యాలతో) కచేరీలు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు కాబట్టి 'కరౌకే' విధానంలో పాటలు పాడుతూ పార్కులోని వాకర్స్‌ను ఉర్రూతలూగిస్తున్నారు. శనివారం భక్తి భజనలు, ఆదివారం ఉదయం, రాత్రి వేళలో 1970, 1980, 1990 నాటి ఆ పాత మధురాలు పాడుతుంటారు. ఇది చూసి నవతరం ఔత్సాహికులూ తోడయ్యారు.

"ఈరోజు పాడుతున్నామంటే వింటూ నేర్చుకున్నదే. ఎవరైనా అవకాశాలు ఇస్తే కచేరీలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 7:30 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం పాడుతాం. మొదట ఇద్దరమే. ఇప్పుడు పది మందికిపైగా సంఖ్య పెరిగింది." - రాజు విజయ్‌వర్గీయ, ఔత్సాహిక గాయకుడు

సరదా కచేరీ నుంచి డిమాండ్​ చేసే స్థాయికి : సంగీత బృందం ప్రతినిధి దినేశ్​ శర్మ మాట్లాడుతూ, "గతంలో మాకు ఎలాంటి సంగీత పరిజ్ఞానం లేదు. పాటలు వింటూ గొంతును సవరించుకున్నాం. ముందు సరదాగా మొదలుపెట్టిన తమ సంగీత కచేరీ ఇప్పుడు వాకర్స్‌ నుంచి డిమాండ్‌ చేసే స్థాయికి చేరుకున్నాం. చాలా మంది ఫలానా పాటలు పాడండి అని కోరుతున్నారు." అని అన్నారు. అలాగే ఔత్సాహిక గాయని నైనా తనకు చిన్నప్పటి నుంచి పాటలు పాడాలని ఉన్నా, అది సాధ్యం కాలేదని అన్నారు. మెల్కోటే పార్కులో సంగీత ప్రియులంతా కలిసి, కరౌకే విధానంలో పాడుకునే వారని చెప్పారు. ఈ కొత్త అనుభవంతో ఇలాగే నిరంతరం పాటలు పాడుతూ, అందరూ ఆస్వాదించాలని కోరుకుంటునట్లు తెలిపారు.

మిగిలిన జీవితం తమకు నచ్చినట్లు : ఈ విధంగా చిన్న వయసులో, ఓ కోరికలా మిగిలిపోయిన కల ఇన్నాళ్లకు నెరవేరుతోంది. అంతేకాకుండా పార్క్​కు వచ్చే వారు ఆ పాత పాటలు వింటూ ఆహ్లాదంగా గడుపుతున్నారు. వీరు పార్క్​లోనే కాకుండా బయట ఫంక్షన్స్​కు వెళ్లి పాడేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇలా ఇంటి, కుటుంబ బాధ్యతలు పూర్తి చేసుకుని, వారి కంటూ ఉన్న సమయాన్ని తమకు నచ్చినట్లు జీవిస్తున్నారు. వారికి ఎంతో ఇష్టమైన పాటలు పాడుకుంటూ ఆనందంగా ఉంటున్నారు.

మీ సేవలకు జోహార్లు - అమ్మమ్మ, తాతయ్యలకు భరోసా ఇస్తున్న పోలీసు సేవలు

వృద్ధాప్యంలో పిల్లలు పట్టించుకోవట్లేదా? - కుంగిపోకుండా మీరూ వీళ్లలా చేయండి!