ETV Bharat / state

బండలే తప్ప బిందెడు నీళ్లు లేవు - రాష్ట్రంలో అడుగంటుతున్న భూగర్భజలాలు

Ground Water Issue In Telangana : పంటలను కాపాడుకునేందుకు రైతులు బోర్లు వేస్తున్నారు. సుమారు 250 మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. కొత్త బోర్లకు ఖర్చుతప్ప ఫలితం లేదని రైతులు వాపోతున్నారు.

Ground Water Issue Telangana
ప్రతీకాత్మక చిత్రం (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : October 12, 2026 at 9:12 AM IST

3 Min Read
Choose ETV Bharat

Ground Water Issue In Telangana : మరో అడుగు నేలను తొలిస్తే గంగమ్మ ఉబికి రాకుండా పోతుందా? ఎండుతున్న పైరుకు నీరు పారి పచ్చగా మారకపోతుందా? అనే రైతుల ఆశ ఓ వైపు. ఎంత తవ్వినా బండ తప్ప నీరు అందడం లేదు, బోరు వేయాలా వద్దా అనే రిగ్గు యజమాని ప్రశ్నలు మరో వైపు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు జేబు తడుముకుంటూ పొలం వైపు చూస్తూ మరో ఐదడుగులు వెయ్యి నీళ్లు పడకపోతాయా అని దీనంగా అడుగుతున్నారు. గంగమ్మ కానరాక బోరుపై బోరు వేస్తూ రైతులు బేజారవుతున్నారు.

కీలకదశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు అనేక కష్టాలుపడుతున్నారు. ఇంట్లో అవసరాలను తీర్చేందుకు బోర్లు ఎండిపోతుండగా కొత్తవి వేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 31 జిల్లాల్లో 250 పైగా మండలాల్లో భూగర్భ జలాలు తీవ్ర స్థాయికి పడిపోయనట్లు భూగర్భ జలవనరుల శాఖ పేర్కొంది. అయినప్పటికీ గంగమ్మపై ఆశతో తవ్వకాలు ఆపడం లేదు. జియో ఫిజకల్​, హైడ్రాలజీ టెస్టులు చేయకుండా బోర్లు వేసి నష్టపోతున్నారు. గృహ వినియోగం, వ్యవసాయం, వాణిజ్యానికి బోర్లు వేస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 32 లక్షల వరకు బోర్లు ఉన్నాయి.

Ground Water Issue Telangana
కొత్తగా వేస్తున్న బోర్లు (Eenadu)

400 అడుగులు వరకు కొత్త బోర్లు

చెరువులు, ప్రాజెక్టులు వట్టిపోవడంతో భూగర్భ జలం లోతుకు వెళ్తోంది. వనపర్తి జిల్లాలో చాలా ప్రాంతాల్లో సుమారు 200 అడుగుల్లోపే నీరు ఉంటుంది. అయితే ప్రస్తుతం అందుకు భిన్నంగా ఉంది. పత్తి, వరి పంటలను కాపాడుకునేందుకు రైతులు అదనంగా 300 నుంచి 400 అడుగులు వరకు కొత్త బోర్లు తవ్వుతున్నారు. ఇంధన ధరలు పెరగడంతో గతంలో రిగ్గు యజమానులు అడుగుకు రూ.65 నుంచి 70 తీసుకొనేవారు, ప్రస్తుతం రూ.85 వరకు తీసుకుంటున్నారని రైతులు చెబుతున్నారు. కేసింగ్​, మోటారు పంపు ఇతరత్రా కలిపి రూ.25 వేల వరకు అదనంగా ఖర్చవుతోందంటున్నారు. మొత్తంగా కొత్త బోరుకు రూ.50 వేలకు పైనా ఖర్చు చేస్తున్నారు. నీళ్లు అడుగంటిన ప్రాంతంలో 10 గంటలు నడవాల్సిన పంపును 20 గంటలు తిప్పుతుండటంతో మోటార్లు కాలిపోతున్నాయి.

ఇప్పుడే ఇలా ఉంటే

రాష్ట్రంలో జనగామ జిల్లా తప్ప అన్ని జిల్లాల్లో గంగమ్మ లోతుల్లోకి వెళ్లింది. రాష్ట్రంలోని దాదాపుగా అన్ని జిల్లాల్లో ఒక మీటరుకు పైగా లోతుకు వెళ్లింది. 29 జిల్లాల్లో అరమీటరు నుంచి ఒక మీటరు వరకు లోతుకు 188 మండలాల్లో అర మీటరు వరకు లోతుకు వెళ్లాయి. సాధారణంగా సెప్టెంబరు నాటికి రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం ఉపరితలం నుంచి 7.52 మీటర్లు ఉండగా గత సంవత్సరం ఇదే నెలలో 4.41 మీటర్లుగా ఉంది. 2014 నుంచి నేటి వరకు సెప్టెంబరులో సగటు నీటి మట్టం 7.29 మీటర్లు కాగా ఈ సంవత్సరం దానిని దాటి పడిపోయింది. రాష్ట్రంలో ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు ఉంటాయో అని రైతులు ఆందోళన చెందుతున్నారు.

"భూగర్భ జలాలు అడుగంటిన ప్రాంతాల్లో కొత్త బోర్లు తవ్వినా పెద్దగా ఫలితం ఉండదు. జియో ఫిజికల్​, హైడ్రాలజీ పరీక్షలు చేయించుకుంటే ఎక్కడ నీళ్లు ఉన్నాయనే విషయం స్పష్టం అవుతుంది. ప్రతి జిల్లా కేంద్రంలో ఉన్న శాఖ కార్యాలయాలను సంప్రదించాలి. దీనివల్ల బోరు విఫలమై రైతులు నష్టపోకుండా ఉంటారు. వాల్డా చట్టాన్ని అనుసరించి 120 మీటర్ల లోతుకు మించి బోర్లు వేయొద్దు. తాగునీటి బోర్లు ఉన్న ప్రాంతానికి 250 మీటర్లు దూరం వరకు మరో బోరు తవ్వొద్దు. కొత్తవి వేసుకునే బదులుగా పాత వాటికి ఫ్లషింగ్​ చేసి శుభ్రం చేసుకోవడం ఉత్తమం" - కె.లక్ష్మా, డైరెక్టర్, భూగర్భ జలవనరుల శాఖ

నీటి జాడలేక గోదారమ్మ వెలవెల

ప్రతి సంవత్సరం ఈ సమయానికి గోదావరిలో నీరు కళకళలాడుతూ ఉంటాయి. అయితే ఎల్​నినో ప్రభావంతో వర్షాలు అంతంతమాత్రంగానే కురవడంతో నదిలో నీరు లేదు. ఇసుక దిబ్బలు తేలి ఎడారిని తలపిస్తోంది. మరో వైపు ఎండలు మండిపోతుండటంతో పంటను కాపాడుకోవడం ఎలా? అని రైతులు ఆవేదన చెందుతున్నారు. మంచిర్యాలలో నీటి జాడలేక గోదారమ్మ వెలవెలబోతోంది.

Ground Water Issue Telangana
రాళ్లు తేలిన పెన్​గంగ (Eenadu)

పెన్​గంగ నది రాళ్లు తేలి

ఆదిలాబాద్​ జిల్లాలోని భీంపూర్​ మండలం గుబిడి గ్రామ శివారులో రాష్ట్రంలోకి ప్రవేశించే పెన్​గంగదీ ఇదే పరిస్థితి. అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకు జలకళతో పరవళ్లు తొక్కాల్సిన నది, రాళ్లు తేలి ఆనవాళ్లు కోల్పోయింది. అక్కడక్కడా నిలిచిన నీటిని రైతులు పంటలకు తడులు ఇస్తుండగా మరికొద్ది రోజుల్లో పశువులకూ నీళ్లు కరవవుతాయనే కలవరం వారిని వెంటాడుతోంది.

అడుగంటుతున్న నీటి వనరులు - నీటి జాడ లేక, నిప్పులు కక్కుతున్న నేలతల్లి!

పడిపోతున్న భూగర్భజలాలు, పాడవుతున్న మోటార్లు - ఎల్​నినో కారణంగా రైతన్నల అవస్థలు