మావోయిస్టు రహితంగా తెలంగాణ - గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీ ఇక కనుమరుగు!
గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీ విభాగాలను ఎత్తేయాలని కేంద్రం లేఖ! - మావోయిస్టులతో పాటు ప్రత్యేక విభాగాలు కూడా కనుమరుగు - అసలేంటీ గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీ ఎవరు ఏర్పాటు చేశారు? వారి విధులేంటి?

Published : February 28, 2026 at 12:39 PM IST
Greyhounds and SIB Face Phase out in TG : సుమారు 45 సంవత్సరాల పాటు హడలెత్తించిన వామపక్ష తీవ్రవాదం చివరి దశకు చేరడంతో పోలీస్ శాఖలో పలు వ్యవస్థాపరమైన మార్పులు చేర్పులు జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా మావోయిస్టులపై పోరాటంలో నిమగ్నమైన గ్రేహౌండ్స్ కమాండో దళం, ప్రత్యేక నిఘా విభాగాల పాత్ర పరిమితం కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ విభాగాల్లో ఉన్న సిబ్బంది సంఖ్య, వెచ్చిస్తున్న ఖర్చును కుదించనున్నారు. మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ మారడంతో ఇవి క్రమంగా కనుమరుగు కానున్నాయి.
రాష్ట్రంలో మావోలే లేరని చెబుతున్నప్పుడు వారికోసమే పెట్టిన వ్యవస్థల అవసరం ఏముంటుందని ఇటీవల జరిగిన ఓ హైలెవల్ మీటింగ్‌లో ప్రభుత్వం ప్రశ్నించినట్లుగా సమాచారం. మరో పక్క వామపక్ష తీవ్రవాదంపై పోరాడేందుకు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక విభాగాలను రద్దు చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసినట్లుగా తెలుస్తోంది.
గ్రే హౌండ్స్ విభాగ రూపశిల్పి వ్యాస్ : బంగాల్లోని నక్సల్ బరిలో పుట్టిన నక్సలైట్ ఉద్యమం ఉమ్మడి ఏపీలోని శ్రీకాకుళంలో ప్రవేశించి అనంతరం మిగతా ప్రాంతాలకు ముఖ్యంగా తెలంగాణకు విస్తరించింది. అనతికాలంలోనే ఈ ఉద్యమం ప్రభుత్వానికే సవాలు విసిరే స్థాయికి చేరింది. గెరిల్లా దాడులతో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న వీరిని అదే తరహాలో ఎదుర్కోవాలన్న ఉద్దేశంతో అప్పటి ఐపీఎస్ అధికారి వ్యాస్ గ్రేహౌండ్స్ విభాగానికి రూపకల్పన చేశారు. నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారంతో దాదాపు 700 ఎకరాల్లో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
మావోయిస్టులు అడవుల్లో ఉండి ఏ విధంగా దాడులు చేస్తారో అలానే ఎదురుదాడులు చేసేవిధంగా కమాండోలకు శిక్షణ ఇస్తారు. పోలీస్ శాఖలో కొత్తగా జాయిన్ అయిన వారిలో ఆసక్తి గల మెరికల్లాంటి వారికి కఠిన తర్ఫీదునిచ్చి కమెండోలుగా తీర్చిదిద్దుతారు. అడవుల్లోని ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ, ఆరు రోజుల పాటు మనగలిగేలా, రాత్రీపగలు అనే తేడాలేకుండా కనీసం 20 కిలీమీటర్లు నడవగలిగే విధంగా, ప్రత్యేక ఆయుధాలను ఉపయోగించే విధంగా ట్రైనింగ్ ఇస్తారు. గెరిల్లా యుద్ధతంత్రంలో గ్రేహౌండ్స్ విభాగానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అమెరికాతో పాటు పలు దేశాలకు చెందిన నిపుణులు గ్రేహౌండ్స్ పనితీరును పరిశీలించారు.
ప్రాణాలనూ లెక్కచేయకుండా : ప్రాణాలు కూడా లెక్కచేయకుండా ఎంతో రిస్క్ చేసి ఇక్కడ పనిచేయాల్సి ఉంటుంది. అందువల్ల గ్రేహౌండ్స్‌లోకి వచ్చేవారికి ప్రత్యేక అలవెన్సులు ఇస్తారు. సివిల్ పోలీసులతో పోల్చుకుంటే సీఐ స్థాయి నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు అరవై శాతం, డీఎస్పీ ఆపై స్థాయివారికి 50 శాతం అధికంగా జీతభత్యాలను చెల్లిస్తారు. విధి నిర్వహణలో ఏదైనా ప్రమాదం లాంటివి జరిగితే ఎంత ఖర్చయినా ప్రభుత్వమే ఆ మొత్తాన్ని భరిస్తుంది.
మరణిస్తే ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు మరణించిన ఉద్యోగి డ్యూటీలోనే ఉన్నట్లుగా పరిగణించి, పదవీ విరమణ వయసు వచ్చే వరకు ఆ కుటుంబానికి నెలవారీ జీతభత్యాలను చెల్లిస్తుంది. అందుకే గ్రేహౌండ్స్ విభాగానికి ప్రతి ఏటా బడ్జెట్లో ప్రత్యేక నిధులను కేటాయిస్తారు. గత ఏడాది ఈ విభాగానికి రూ.34.91 కోట్లు కేటాయించారు. ఉమ్మడి రాష్ట్రంలో 3000 మంది కమాండోలు ఉండేవారు. ఇప్పుడు తెలంగాణలో వీరి సంఖ్య సుమారు 1500.
కనుమరుగవనున్న ఎస్‌ఐబీ, గ్రేహౌండ్స్ : ఈ విభాగంలో పనిచేసే సిబ్బంది సొంత సమాచార వ్యవస్థతో ఎప్పటికప్పుడు మావోయిస్టుల కదలికలను పసిగడతారు. వీటి ఆధారంగానే గ్రేహౌండ్స్ కమెండోలు మెరుపు వేగంతో దాడులకు దిగేవారు. గ్రేహౌండ్స్‌లో పనిచేసే వారికి ఇచ్చే రాయితీలన్నీ ఎస్‌ఐబీ వారికి కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ ఎస్‌ఐబీలో సుమారు 100 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమం ఇంచుమించు చివరిదశకు చేరుకోవడం, ఇంకో 11 మంది మాత్రమే మిగిలారని డీజీపీ శివధర్‌రెడ్డి స్వయంగా ప్రకటించిన సంగతి విధితమే.
దీంతో మావోయిస్టులే లేనప్పుడు గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీ విభాగాలు ఎందుకు అనే ప్రశ్న మొదలైంది. ఇదిలా ఉంటే వామపక్ష తీవ్రవాదంపై (మావోయిస్టులపై) పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా బాధిత రాష్ట్రాలకు పెద్దఎత్తున నిధులిచ్చేది. ఇక మీదట ఈ నిధులను ఆపేస్తామని అనధికారికంగా చెప్పిన కేంద్రం, ప్రత్యేక విభాగాలను ఎత్తేయాలని లేఖ రాసినట్లుగా సమాచారం. దాంతో పోలీసు శాఖలో ప్రతిష్ఠాత్మకమైన గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీలు మరికొద్ది రోజుల్లో కనుమరుగయ్యే అవకాశం ఉంది.
'సారండా' అడవుల్లో మరో అపరేషన్ - మావోయిస్టు అగ్రనేతలే లక్ష్యంగా బలగాల కూంబింగ్
దగ్గరపడుతున్న గడువు - మావోయిస్టులపై ఒత్తిడి పెంచుతున్న సాయుధ బలగాలు

