ETV Bharat / state

బాస్కెట్​బాల్​ ఛాలెంజ్​తో పచ్చటి విప్లవం - విజయవాడలో "గ్రీన్ ఇండియా ప్లే ఛాలెంజ్"

పర్యావరణ పరిరక్షణకు గ్రీన్‌ ‘ఇండియా ప్లే ఛాలెంజ్‌’ - విజయవాడ కలెక్టరేట్​ ఇగ్నైట్‌ సెల్‌లో కార్యక్రమం ప్రారంభం - తొలిరోజు మొక్కలు నాటిన 50 మంది - ఏడాదికి లక్ష మొక్కలు నాటించడమే లక్ష్యం

Green India Play Challenge
Green India Play Challenge (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 14, 2026 at 1:30 PM IST

2 Min Read
Choose ETV Bharat

Green India Play Challenge : పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH), ఆటోనగర్‌లోని కూలెక్స్ ఇండస్ట్రీస్ సంయుక్త ఆధ్వర్యంలో ‘గ్రీన్ ఇండియా ప్లే ఛాలెంజ్’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ ఇగ్నైట్ సెల్‌లో ఈ వినూత్న ఛాలెంజ్‌ను ప్రారంభించగా, తొలిరోజే ఉత్సాహంగా పాల్గొన్న 50 మందితో మొక్కలు నాటించారు. ఈ ఆటను ఎలా ఆడాలి? నిబంధనలు ఏమిటి? ఎన్నిసార్లు బంతిని బాస్కెట్​లో వేయాలి? మొదలైన వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆట నిబంధనలు ఇవే: ఈ వినూత్న పర్యావరణ ఆటలో పాల్గొనేవారు ముందుగా రూ.50 చెల్లించి ఒక మొక్కను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిర్ణీత నిమిషం వ్యవధిలో 40 సార్లు బంతిని బాస్కెట్‌లో వేసి లక్ష్యాన్ని చేరాలి. నిర్దేశిత గోల్ సాధించిన వారికి, వారు మొక్క కొనేందుకు చెల్లించిన రూ.50 సొమ్మును నిర్వాహకులు తిరిగి ఇచ్చేస్తారు. ఇలా ఎన్నిసార్లు లక్ష్యాన్ని చేరుకుంటే అన్నిసార్లు ఉచితంగా ఆడే అవకాశం కల్పిస్తారు.

నిర్వాహకులే పోషణ బాధ్యత చూస్తారు: ఒకవేళ ఛాలెంజ్‌లో గెలవలేకపోయినా సరే వారు కొనుగోలు చేసిన మొక్కను ఇస్తారు. ఆ మొక్కను ఇంటికి తీసుకెళ్లి నాటుకోవచ్చు. అదేవిధంగా వారికి ఇష్టముంటే ప్రభుత్వ కార్యాలయాలు లేదా పాఠశాలల ప్రాంగణాల్లో నిర్వాహకులే ఆ మొక్కను నాటి, దాని పోషణ బాధ్యతలను చూసుకుంటారు. ఇలా నాటిన మొక్కల ఫొటోలను రెండుసార్లు నిర్వాహకులకు వాట్సాప్‌లో పంపిస్తే 2 సార్లు మొక్క కొనకుండా ఉచితంగా ఈ ఆట ఆడే వీలుంటుంది.

ఏడాదిలో లక్ష మొక్కల నాటడమే లక్ష్యం: పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యార్థులలో పచ్చదనంపై మక్కువ పెంచేందుకు ‘గ్రీన్ ఇండియా ప్లే ఛాలెంజ్’ నిర్వాహకులు సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం విజయవాడ పరిధిలోని పలు పాఠశాలలు, కళాశాలలు, విజ్ఞాన ప్రదర్శనలకు (సరికొత్త గేమింగ్ యంత్రాన్ని) తీసుకువెళ్లి విద్యార్థులతో ఈ ఆటను ఆడిస్తున్నారు. వినోదభరితంగా సాగుతున్న ఈ ప్రక్రియ ద్వారా ఆయా విద్యాసంస్థల ప్రాంగణాల్లో విద్యార్థుల చేతుల మీదుగానే పెద్ద ఎత్తున మొక్కలు నాటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

పర్యావరణానికి రక్షణ కవచం: ఈ వినూత్న ఉద్యమాన్ని క్రమంగా రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు, కీలక ప్రాంతాలకు విస్తరించాలని నిర్వాహక సంస్థలు నిర్ణయించాయి. ఇందులో భాగంగానే ఏడాది కాలంలోగా లక్ష మొక్కలను నాటాలనే బృహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. కేవలం అలంకార ప్రాయమైనవి కాకుండా ప్రకృతికి, మానవాళికి ఎంతో మేలు చేకూర్చే వేప, రావి, చింత, జామ, దానిమ్మ వంటి ఔషధ, పండ్ల మొక్కలను ఈ ఛాలెంజ్ ద్వారా పంపిణీ చేస్తున్నారు.

ఈ కార్యక్రమంతో అటు విద్యార్థులతో పాటు ఇటు సాధారణ ప్రజలకూ పర్యావరణ పరిరక్షణపై పూర్తి అవగాహన కలుగుతోంది. ప్రజలకు చక్కని వినోదం పంచుతూనే, మరోవైపు సమాజానికి రక్షణ కవచాలైన మొక్కలను నాటించేలా చేస్తున్న ఈ ప్రయత్నంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

నేటితో ముగియనున్న ఓటర్ల జాబితా సవరణ గడువు - ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ

ఏపీలో పారిశ్రామిక విప్లవం - 8 కొత్త ప్రైవేట్ పార్కులకు కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్