ప్రజల నుంచి రూ.206 కోట్లు కొల్లగొట్టిన శ్రేయ గ్రూప్ సంస్థ - ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి
కర్నూలు జిల్లాలో ప్రజలను మోసం చేసిన సంస్థపై ప్రభుత్వం చర్యలు -రూ.206 కోట్లు కొల్లగొట్టిన శ్రేయ గ్రూప్ ఆస్తుల జప్తునకు ఆదేశం -పీపీబీ, జీఐపీ, వీఐపీ పేర్లతో పెట్టుబడి పథకాలు అంటూ మోసం

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 2, 2026 at 5:14 PM IST
AP Govt Take Action ON Shreya Group Company: ప్రజల ఆశలే వారికి అవకాశాలు నమ్మించి దోపిడీ చేసి బోర్డు తిప్పేస్తున్నారు. సైబర్ నేరగాళ్లది ఒక ఎత్తైతే ట్రేడింగ్, అధిక వడ్డీలు, మనీ యాప్‌ల పేరిట నగదు వసూలు చేసే మోసగాళ్లు మీ డబ్బుకు మాదీ పూచీ అంటూ ప్రలోభపెడుతున్నారు. ప్రజల ఆశను అవకాశంగా మలచుకుని వారిని నమ్మించి నిలువునా మోసం చేస్తున్నారు కేటుగాళ్లు. మీరు కొంత డబ్బు చెల్లిస్తే చాలు రోజు వారీగా మీ బ్యాంకు ఖాతాలో మేము కొంత నగదును జమచేస్తామని నమ్మించారు. అనుకున్న టార్గెట్ రీచ్ అయిన వెంటనే అక్కడి నుంచి ఉడాయిస్తున్నారు. అయితే కర్నూలు జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అయితే దీనిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం సంస్థపై చర్యలకు ఆదేసించింది, .
కర్నూలు జిల్లా కేంద్రంలో అధిక వడ్డీలు ఆశ పెట్టి డిపాజిట్లు వసూలు చేసి ప్రజలను మోసం చేసిన సంస్థపై ప్రభుత్వం చర్యలకు ఆదేశించింది. 8,128 డిపాజిటర్ల నుంచి రూ.206 కోట్లు కొల్లగొట్టిన శ్రేయ గ్రూప్ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శ్రేయ గ్రూప్, ఆ సంస్థ ఛైర్మన్ హేమంత్ కుమార్ రాయ్, అతని భార్య, సంస్థ సీఈవో సంగీతారాయ్ల పేరిట జూపాడు బంగ్లా మండలం పారుమంచాలలోని రూ.3 కోట్ల 12 లక్షల విలువైన 51.55 ఎకరాల భూమి అటాచ్ చేసేందుకు సీఐడీకి అనుమతి మంజూరు చేసింది.
స్కీంలు పెట్టి ప్రజల నుంచి డిపాజిట్లు సేకరణ: 5 ఏళ్ల క్రితం కర్నూలు బిర్లా కాంపౌండ్‌లో శ్రేయా ఇన్ఫ్రా, మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట సంస్థను ఏర్పాటు చేసిన నిందితులు ప్రజలను భారీ మోసం చేశారు. అధిక వడ్డీలు ఇస్తామని పలు స్కీంలు పెట్టి ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారు. పీపీబీ, జీఐబీ, వీఐపీ (PPB, GIP, VIP) పేర్లతో నకిలీ పెట్టుబడి పథకాలుపెట్టి 2023 నవంబర్‌లో బోర్డు తిప్పేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయగా సీఐడీ దర్యాప్తునకు కూటమి ప్రభుత్వం ఆదేశించింది.
ఏ1గా శ్రేయ గ్రూప్, ఏ2 హేమంత్ కుమార్ రాయ్, ఏ3 సంగీత రాయ్లుగా చేర్చుతూ సీఐడీ దర్యాప్తు చేసింది. 8,128 డిపాజిటర్ల నుంచి రూ.206 కోట్లు వసూలు చేసి మోసం చేసినట్లు సీఐడీ గుర్తించింది. అధిక లాభాల ఆశచూపి ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి మోసం చేసినట్లు పోలీసులు తేల్చారు. మోసం చేసిన సొమ్ముతో పలు ప్రాంతాల్లో నిందితులు విలువైన ఆస్తులు కొనుగోలు చేసినట్లు తేల్చారు. ప్రస్తుతానికి రూ.3 కోట్ల 12 లక్షల విలువైన 51.22 ఎకరాల భూమి అటాచ్‌మెంట్‌కు ప్రభుత్వం అనుమతించింది. తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఆదేశాలు జారీ చేశారు.
కిడ్నీ మార్పిడి పేరుతో మోసం - 33 కేసులున్న నకిలీ డాక్టర్ అరెస్ట్
హైదరాబాద్‌లో తలదాచుకున్న సీఈవో శివాని? - అజ్ఞాతంలోకి కీలక సూత్రధారులు

