ETV Bharat / state

ఒంగోలు జాతి వృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు

ఒంగోలు జాతి పశువుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు - చదలవాడ పశు క్షేత్రంలో ఒంగోలు జాతి సంతతి పెంచేలా కృషి, ఒంగోలు జాతిపై ఆసక్తి కనబరిచే రైతులకు ఊచితంగా పెయ్య దూడలు

AP Govt Focus on Ongole Breed Cattle
AP Govt Focus on Ongole Breed Cattle (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 2, 2026 at 11:59 AM IST

2 Min Read
Choose ETV Bharat

AP Govt Focus on Protect ongole Breed Cattle: ఒంగోలు జాతి పశువుల పరిరక్షణకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇన్నాళ్లు పశు సంరక్షణ, జాతి అభివృద్ధిని రైతుల ఆసక్తికే ప్రభుత్వాలు వదిలేశాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పశువుల గణాంకాల పెరుగుదలకు దోహదపడనున్నాయి. దీంతో ఒంగోలు జాతి పశువుల వృద్ధికి ప్రకాశం జిల్లాలో అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.

ఒంగోలు జాతి వృద్ధికి చర్యలు: ఒంగోలు జాతి పశువు అంటేనే రాజసానికి మారుపేరు. వ్యవసాయానికి, నాణ్యమైన పాల ఉత్పత్తికి ఈ జాతి పశువులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. యాంత్రీకరణ పెరగడం, పశుపోషణ భారం కావడంతో కాలక్రమంలో ఈ జాతి పశువుల పెంపకం తగ్గిపోయింది. వీటిపై ప్రేమ, ఆసక్తి ఉన్న వారు మాత్రమే కష్టమైనా వీటిని సాకుతున్నారు. చారిత్రాత్మకమైన గుర్తింపు ఉన్న ఈ జాతి పునరుజ్జీవానికి గతంలో ప్రభుత్వాలు పెద్దగా కృషి చేయలేదు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ జాతిని పరిరక్షించి, వాటి సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తోంది. తొలుత ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతాల్లోని రైతులను చైతన్య పరిచి వాటి పెంపకాన్ని ప్రోత్సహించేలా చర్యలు చేపట్టింది.

రైతులకు రూ. 7,000 ప్రోత్సాహకం: నాగులుప్పలపాడు మండలం చదలవాడలో ఉన్న పశు క్షేత్రంలో ఒంగోలు జాతి ఆవులు, ఎద్దుల సంతతిని పెంచేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. గతంలో పెయ్యదూడలను వృద్ధి చేసి వేలం వేసి విక్రయించేవారు. అయినా ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉండేది. ఇప్పుడు ఒంగోలు జాతి పట్ల ఆసక్తి కనబరిచే రైతులను గుర్తించి వారికి పెయ్య దూడలను ఉచితంగా అందించేలా రాష్ట్రీయ గోకుల మిషన్‌ ద్వారా కార్యక్రమం రూపొందించారు. దీనికి తోడు దాణా కోసం తొలి ఏడాదికి రూ. 7,000 నగదు ప్రోత్సాహకాన్ని పెంపకందారులకు అందించనున్నారు.

గ్రామాల్లో ఒంగోలు బ్రీడ్‌ అభివృద్ధిని ఇకపై ఆయా ప్రాంతాల్లో ఉన్న పశువైద్యాధికారులు పర్యవేక్షిస్తారు. ఇందుకోసం జిల్లాలోని పశు వైద్య అధికారులకు చదలవాడ పశు క్షేత్రంలో శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తొలుత ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతాల్లో ఒంగోలు జాతి పశువుల సంఖ్యను పెంచి ఆ తర్వాత గుంటూరు, కృష్ణా జిల్లాలకు విస్తరించాలని అధికారులు నిర్ణయించారు.

" నాగులుప్పలపాడు మండలంలోని చదలవాడలో ఏర్పాటు చేసిన పశు క్షేత్రంలో ఒంగోలు జాతి ఆవులు, ఎద్దుల సంతతిని పెంచేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఒంగోలు జాతి పట్ల ఆసక్తి కనబరిచే రైతులను గుర్తించి వారికి పెయ్య దూడలను ఉచితంగా అందించేలా రాష్ట్రీయ గోకుల మిషన్‌ ద్వారా కార్యక్రమాన్ని రూపొందించాం. ఇందులో భాగంగా దాణా కోసం తొలి ఏడాదికి రూ. 7,000 నగదు ప్రోత్సాహకాన్ని పెంపకందారులకు అందించనున్నాం"-శ్రీనివాసరావు, సీఈవో, పశు సంవర్థక శాఖ

గతంలో: ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సాధించిన ఒంగోలు జాతి గిత్తలను గతంలో 10 నుంచి 15 లక్షల ధర పలికేవి. కానీ మారిన పరిస్థితుల కారణంగా ఇప్పుడు ఉన్నవాటినే ఎంతోకొంతకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై పశువులను, గ్రాసం అందిస్తే మళ్లీ ఒంగోలు జాతి పశువులు వృద్ధి చెందే అవకాశం ఉంది.

అభివృద్ధి రంకె వేస్తున్న.. ఒంగోలు గిత్తల ఉత్పత్తి కేంద్రం!

అంతరించిపోయే దశకు ఒంగోలు గిత్తలు - దశాబ్దాలుగా పోషిస్తున్న ఓ కుటుంబం