సీఐఐ తొలిరోజే పెట్టుబడుల జాతర - 40 సంస్థలతో ఒప్పందాలు, రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు
గురువారం 35 ఒప్పందాల ద్వారా రూ.3,65,304 కోట్ల పెట్టుబడులు - నిన్న(గురువారం), ఇవాళ కలిపి మొత్తం 75 అవగాహనా ఒప్పందాలు - రెండ్రోజుల్లో రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు, 5,42,361 ఉద్యోగాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : November 14, 2025 at 8:34 PM IST
|Updated : November 14, 2025 at 10:33 PM IST
Government Signs Mous with 40 Companies on First Day of CII Summit : సాగర తీరంలో పెట్టుబడుల కెరటాలు. దేశవిదేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలతో లక్షల కోట్ల ఒప్పందాలు. మీ పెట్టుబడులకు మాదీ భరోసా అంటూ ప్రభుత్వ గ్యారంటీలు. సంతకం నుంచి స్థాపనకు వరకు వెన్నంటి ఉంటామని ప్రకటనలు. ఏపీని గమ్యస్థానంగా ఎంచుకోండని పిలుపులు. 'పెట్టుబడులతో రండి, వ్యాపారం చేసుకోండి, కలిసి ఎదుగుదాం' అని నినాదాలు. ఫలితంగా పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సులో తొలి రోజే 40 కంపెనీలతో రూ. 3లక్షల 50 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు! 4 లక్షల మందికి ఉద్యోగావకాశాలు. మొత్తంగా నిన్న, ఇవాళ కలిపి విశాఖలో 75 MOUల ద్వారా రూ.7లక్షల 14,780 కోట్ల పెట్టుబడులు, 5,42,361 ఉద్యోగాలు.
తొలి రోజు ఒప్పందాలు ఇవే : అర్బన్ గవర్నెన్సు, రియల్ టైమ్, డిజిటల్ గవర్నెన్సు ట్రాన్సఫర్మేషన్, సుస్థిరాభివృద్ధి అంశాలపై సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీ-సింగపూర్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగింది. అలాగే AI డేటా సెంటర్, సోలార్ పవర్ ప్లాంట్, గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటేడ్ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామని రిలయన్స్ ప్రకటించింది. అదేవిధంగా సదస్సులో 17 ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో రూ.27,909 కోట్ల మేర పెట్టుబడులకు మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా 53,879 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
తిరుపతిలో ఎస్సీఐసీ(SCIC) వెంచర్స్ ఎల్ఎల్పీ 2,630 మందికి ఉద్యోగాలు రూ.1,704 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. శ్యామా ఎస్జీఎస్ లిమిటెడ్ 1894 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ రూ.1595 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఎపిటోమ్ కాంపోనెంట్స్ లిమిటెడ్ వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పిస్తూ రూ.700 కోట్ల పెట్టుబడికి ముందుకు వచ్చింది. హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ 613 మందికి ఉద్యోగాలు రూ.586 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. సోలమ్ ఇండియా హైటెక్ ప్రైవేట్ లిమిటెడ్ 700 మందికి ఉద్యోగాలు ఇస్తూ రూ.268 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు : ఈమక్(Yeemak) ప్రైవేట్ లిమిటెడ్ 20,500 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ రూ.11వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2,500 మందికి ఉద్యోగాలు ఇస్తూ రూ.2,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్పీఎస్ పీఎల్(NPSPL) స్పెషాలిటీ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 400 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ రూ.2,400 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ-ప్యాక్(Epack) గ్రూప్ 5,322 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ రూ.1,416 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. నియోలింక్ డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్ 2,100 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ రూ.1,150 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
CIPSA TEC ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 1,251 మందికి ఉద్యోగాలు ఇస్తూ రూ.1,140 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సంవర్థన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ 2వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ రూ.1,100 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్(ఎక్స్ పాన్షన్)10వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అంబర్ ఎంటర్ ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ 1,500 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
మీనా సర్క్యూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 819 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ రూ.350 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. విశాఖపట్నంలో రీఫైబ్స్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ 450 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ రూ.350 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఎన్టీఆర్ జిల్లాలో టైటాన్ ఇంటెక్ లిమిటెడ్ రూ.250 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఎంవోయూ కుదుర్చుకుంది.
10 ఏళ్లలో 1 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు : రాబోయే పదేళ్లలో 1 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించాలన్నదే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ సీఐఐ-భాగస్వామ్య సదస్సు వేదికగా ప్రకటించారు. ఇందులో భాగంగా రాబోయే మూడేళ్లలో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 50 లక్షల ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని వెల్లడించారు. ఇప్పటికే 17 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా పురోగతి సాధించామని తెలిపారు.
పెట్టుబడిదారులకు రాబోయే కాలంలోనూ ఎలాంటి ఇబ్బందులు కలగబోవని భరోసా ఇచ్చారు. దేశంలోనే మొదటిసారిగా పారిశ్రామికవేత్తలకు ఇచ్చే ప్రోత్సాహకాలు జమచేసేలా ఎస్క్రో అకౌంట్‌ను త్వరలోనే తెరవబోతున్నామని ప్రకటించారు. తద్వారా ప్రోత్సాహకాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండబోదన్నారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి సంస్కరణనూ ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎం అన్నారు. ఆరోగ్య, సమృద్ధ, సంతోషకర సమాజ స్థాపనలో పెట్టుబడిదారులు సహకరించాలని కోరారు.
పారిశ్రామికవేత్తలు సీట్లు రిజర్వ్ చేసుకోండి : ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్-ITPO కోసం విశాఖలోని కొండపై సముద్రానికి అభిముఖంగా సుందరమైన ప్రదేశాన్ని కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రతి పారిశ్రామికవేత్త విశాఖలో రెండో నివాసం ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. అరకు కాఫీని, ఆంధ్ర ఆక్వా ఫుడ్‌ని ప్రతి ఒక్కరూ రుచిచుడాలని CII-భాగస్వామ్య సదస్సుకు హాజరైన ప్రతినిధులను కోరారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి మరింత పెద్ద స్థాయిలో CII-భాగస్వామ్య సదస్సుకు ఆతిథ్యమిచ్చేందుకు విశాఖ సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దానికి గాను ఇప్పటి నుంచే సీట్లు రిజర్వ్ చేసుకోవాలని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు.
త్వరలో డ్రోన్ టాక్సీలు - కేంద్రం సాయం అందించాలి: సీఎం చంద్రబాబు
AI డేటా సెంటర్, సోలార్ పవర్ ప్లాంట్ - రాష్ట్రంలో రిలయన్స్ పెట్టుబడులు

