ETV Bharat / state

ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు - స్థలాల ఎంపిక పూర్తి, పనులు ప్రారంభం!

ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యంగా ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణానికి కూటమి సర్కారు అడుగులు - ఇప్పటికే పలు నియోజక వర్గాల్లో స్థలాల ఎంపిక పూర్తి చేసి గ్రౌండింగ్​కు సిద్ధం- మహిళ కోసం కొత్త పారిశ్రామిక విధానం

Government Set up MSME Parks in Every Constituency
Government Set up MSME Parks in Every Constituency (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 20, 2026 at 10:06 PM IST

3 Min Read
Choose ETV Bharat

AP Govt Set up MSME Parks in Every Constituency : ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిన విషయం తెలిసిందే. అందులోభాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది.

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో దశల వారీగా ఎంఎస్‌ఎంఈ పార్కులు/ ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్సులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో 56 పార్కులను అభివృద్ధి చేస్తోంది. మిగిలిన వాటి అభివృద్ధికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ఏపీఐఐసీకి అప్పగించాలని ప్రభుత్వం ఆదేశించింది. అవసరమైన చోట ప్రైవేటు భూములనూ సేకరించాలని కలెక్టర్లను కోరింది.

మొత్తం 175 పార్కుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో 122, ప్రైవేటు భాగస్వామ్యంతో 53 పార్కులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు అవసరం అయిన నిధులను రుణంగా తీసుకునేందుకు ఏపీఐఐసీకి ప్రభుత్వం అనుమతించింది.

ప్రతి నియోజకవర్గంలో MSME పార్కులు - స్థలాల ఎంపిక పూర్తి, గ్రౌండింగ్ పనులు ప్రారంభం! (ETV Bharat)

ఒక్కో నియోజకవర్గంలో 50 ఎకరాలు : ప్రతి ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యంగా ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణానికి కూటమి సర్కారు పూనుకుంది. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేట, మైలవరంలో స్థలాల గ్రౌండింగ్ పనులు ఆరంభించారు. తాజాగా విజయవాడ తూర్పు, పశ్చిమ, జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామలోనూ స్థలాల ఎంపిక పూర్తి చేసి గ్రౌండింగ్​కు సిద్ధం చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో 5 నుంచి 50 ఎకరాల వరకు స్థలాలు సేకరించారు. స్థానిక ఉత్పత్తులను ఇక్కడే విక్రయించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఈ పార్కులు ఎంతగానో ఉపయోగపడేలా ఉంటాయంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెనర్ కార్యక్రమం తీసుకుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక MSME పార్కు నిర్మాణానికి పూనుకుంది. ఇప్పటికే భూమి పూజ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా జరిగింది. దీంతో ఎన్టీఆర్ జిల్లాలో గ్రౌండింగ్ పనులకు అడుగులు శరవేగంగా పడుతున్నాయి.

రూ.3 కోట్ల అంచనా వ్యయంతో : విజయవాడ నడిబొడ్డున ఉన్న సింగ్​నగర్ ప్రాంతంలో 5 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 3 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఎంఎస్ఎంఈ పార్కు నిర్మిస్తున్నారు. స్థలం తక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అంటే బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. వీటిని పరిశ్రమలు పెట్టుకునేందుకు వీలుగా ఆకృతులు డిజైన్ చేశారు. ఇప్పటికే ఇక్కడ భూమి పూజ పూర్తి కావటంతో రోడ్డు ఫార్మేషన్, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల పనులు వేగంగా జరుగుతున్నాయి.

లెదర్ ఇండస్ట్రియల్ పార్క్ : అటు జగ్గయ్యపేట నియోజకవర్గంలో 20 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఎంఎస్ఎంఈ పార్కు పనులు ప్రారంభం అయ్యాయి. మైలవరంలోనూ అత్యాధునిక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి అధికారులు పనులు చేపట్టారు. తిరువూరులో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా ‘లెదర్ ఇండస్ట్రియల్ పార్క్’ ఏర్పాటుకు భూమిని కేటాయించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో ఒక ఎకరం స్థలాన్ని చిన్న తరహా పరిశ్రమల కోసం సిద్ధం చేశారు. నందిగామ నియోజకవర్గంలోని పెద్దవరం వద్ద ఇప్పటికే ఉన్న పారిశ్రామిక వాడలను మరింత బలోపేతం చేసే దిశగా ఆశాఖ అధికారులు సన్నాహలు చేస్తున్నారు.

ఉపాధి అవకాశాల్లో 80 శాతం స్థానికులకే : ఈ పార్కుల ద్వారా లభించే ఉపాధి అవకాశాల్లో 80 శాతం స్థానికులకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల హైదరాబాద్, చెన్నై సహా పలు ప్రాంతాలకు వలసలు ఆగిపోతాయని అంటున్నారు. అంతేకాకుండా స్వయం ఉపాధితో జీవనం సాగించే మహిళల్ని ఇందులో భాగస్వామ్యం చేయటం మూలంగా వారి ఉత్పత్తులు ఇక్కడే విక్రయించుకునేందుకు వీలుగా ఉంటుందని చెబుతున్నారు.

మహిళ కోసం కొత్త పారిశ్రామిక విధానం : 2024లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం మహిళ కోసం కొత్త పారిశ్రామిక విధానం సైతం అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం మహిళలకు పెట్టుబడిలో 40 శాతం రాయితీ కల్పిస్తున్నారు. అంతేకాకుండా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను సింగిల్ విండో విధానంలో వారం రోజుల్లోనే మంజూరు చేస్తున్నారు. తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకోవడానికి పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడకుండా, కేంద్ర ప్రభుత్వ ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థల తరహాలోనే అతి తక్కువ ఛార్జీలతో తమ వస్తువులను ప్రపంచవ్యాప్తంగా అమ్ముకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

ఐనంపూడిలో పదిన్నర ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కు - పనులు ప్రారంభం

ఇంటికో పారిశ్రామికవేత్తే లక్ష్యం - 50 MSME పార్కులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు