ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ పాఠాలు - కంటెంట్‌ సృష్టికర్తలుగా మారనున్న విద్యార్థులు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు డిజిటల్‌ నైపుణ్యాలు అందించడంలో పాఠశాల విద్యాశాఖ మరో ముందడుగు - ‘కాన్వా’తో అయిదేళ్ల కాలానికి ఒప్పందం

Digital Lessons in Government Schools
Digital Lessons in Government Schools (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 24, 2026 at 1:29 PM IST

2 Min Read
Choose ETV Bharat

Digital Lessons in Government Schools: సర్కారు బడి, కళాశాలల విద్యార్థులంటే చాలా మందికి ఒక రకమైన చిన్నచూపు! కానీ అదంతా గతం. ఇకపై వారు కేవలం నేర్చుకునేవారు మాత్రమే కాదు కంటెంట్‌నూ క్రియేట్‌ చేయగల నిపుణులు కూడా! ఇంతవరకు ఆన్‌లైన్‌ క్లాస్‌లు ఆడియోలు వినడం, వీడియోలు చూడడానికే పరిమితమైన విద్యార్థులు ‘కాన్వా’ సంస్థ సహకారంతో ఉచితంగా ఇన్ఫోగ్రాఫిక్స్, విజువల్‌ అభ్యసన మెటీరియల్‌ను తయారు చేసుకోగలరు. దీని కోసం విద్యాశాఖ ‘కాన్వా’తో అయిదేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు డిజిటల్‌ నైపుణ్యాలు అందించడంలో పాఠశాల విద్యాశాఖ మరో ముందడుగు వేసింది. డిజిటల్, డిజైన్, క్రియేటివిటీ నైపుణ్యాలు అందించేందుకు గ్లోబల్‌ విజువల్‌ కమ్యూనికేషన్‌ ప్లాట్‌ఫాం ‘కాన్వా’ సంస్థతో కలిసి పని చేయనుంది. ఈ మేరకు ఆ సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఐదేళ్ల పాటు కాన్వా సంస్థ ఈ సేవలు అందించనుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు త్వరలోనే ఉచితంగా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

కంటెంట్‌ క్రియేటర్లుగా: ఇప్పటి వరకు డిజిటల్‌ అభ్యసన అంటే కేవలం ఆన్‌లైన్​ తరగతులు వినడం, వీడియోలు చూడడానికే విద్యార్థులు పరిమితమవుతున్నారు. ఇకపై విద్యార్థులు సమాచారాన్ని నేర్చుకునే వారిగానే కాకుండా సొంతంగా కంటెంట్‌ క్రియేటర్లుగానూ మారనున్నారు. కాన్వా ప్లాట్‌ఫామ్‌ సహాయంతో విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రజంటేషన్లు, సృజనాత్మక వీడియోలు, ఆకర్షణీయమైన ఇన్ఫోగ్రాఫిక్స్, విజువల్‌ అభ్యసన మెటీరియల్‌ను స్వయంగా రూపొందించుకోవచ్చు. దీంతో విద్యార్థుల్లో అధునిక విజువల్‌ కమ్యూనికేషన్, డిజిటల్‌ అక్షరాస్యత, అభ్యాసన నైపుణ్యాలు పాఠశాల స్థాయి నుంచే పెంపొందుతాయి. ఈ కార్యక్రమం ద్వారా డిజిటల్‌ అక్షరాస్యత, సృజనాత్మకత, కమ్యూనికేషన్, ప్రజెంటేషన్‌ నైపుణ్యాలు మెరుగుపడతాయి.

కమ్మనైన అమ్మభాషలోనూ: విద్యార్థులకు ఆంగ్లంతో పాటు మాతృభాష తెలుగులోనూ ప్రత్యేకంగా రూపొందించిన టెంప్లేట్‌లను ఇందులో విలీనం చేశారు. ఉన్నత విద్యలో డిజిటల్‌ అక్షరాస్యతకు ప్రాధాన్యం ఉన్నందున పాఠశాల స్థాయిలోనే సాంకేతిక నైపుణ్యాలు నేర్పించనున్నారు. సైన్సు ప్రాజెక్టు, తరగతిలో ప్రజెంటేషన్, గ్రూపు టాస్క్‌ అయినా సమాచారాన్ని ఆకర్షణీయమైన విజువల్స్‌గా మార్చుకునే అవకాశం ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా లభించనుంది. ఉపాధ్యాయులకు ఆధునిక డిజైన్‌ టూల్స్, తరగతి గదిలో ఏఐ పరికరాల వినియోగంపై శిక్షణ ఇవ్వనున్నారు.

ఉపాధ్యాయులు తరగతిలో ప్రజెంటేషన్లు, ఇతర బోధన వనరులను ఈ సాంకేతికతతో రూపొందించుకోవచ్చు. కేవలం సంప్రదాయ బోధన పద్ధతులపైనే ఆధారపడకుండా కాన్సెప్ట్‌లను వివరించేందుకు విజువల్‌ మెటీరియల్‌ను తయారు చేసుకోవచ్చు. కాన్వా ప్లాట్‌ఫామ్‌ను లీప్‌యాప్, గూగుల్‌ వర్క్‌స్పేస్, పాఠశాలల్లో ఏర్పాటు చేయనున్న క్రోమ్‌బుక్‌లతోనూ అనుసంధానం చేయనున్నారు. మొత్తం 4 నెలల్లో దశలవారీగా అమలు చేయనున్నారు.

ప్రైవేట్‌కు తక్కువేం కాదు - ప్రభుత్వ బడుల్లో 'నో అడ్మిషన్' బోర్డులు!

ప్రభుత్వ బడిలో కలెక్టర్​ కుమారుడి విద్యాభ్యాసం