గుంటూరు ఛానల్ ఆధునీకరణకు రూ.369 కోట్లు - తీరనున్న సాగు, తాగునీరు కష్టాలు
ఆధునికీకరణతో మరో 30 వేల ఎకరాలకు సాగునీరు - రెండు కార్పొరేషన్లు, 33 పంచాయతీలకు అందనున్న తాగునీరు - నిధుల మంజూరుపై రైతులు, ప్రజాప్రతినిధుల హర్షం

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 6, 2026 at 8:10 PM IST
Rs 369 Crore Sanctioned For The Modernization Of The Guntur Channel : గుంటూరు జిల్లాలో కీలకమైన సాగునీటి కాలువకు కూటమి ప్రభుత్వంలో మహర్దశ పట్టనుంది. రెండు దశాబ్దాలుగా ఇక్కడి రైతులు ఎదురుచూస్తున్న గుంటూరు ఛానల్ ఆధునీకరణకు ప్రభుత్వం రూ. 369 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఆధునీకరణ పనులు పూర్తయితే రెండు నియోజకవర్గాల పరిధిలో 30 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, రెండు కార్పోరేషన్లు, 33 పంచాయతీలకు తాగునీరు సక్రమంగా అందేందుకు మార్గం ఏర్పడుతుంది. ప్రభుత్వ నిర్ణయంతో సాగునీరు, తాగునీటి వ్యవస్థ మెరుగపడడంపై గుంటూరు జిల్లా రైతులు, ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
47 కిలోమీటర్ల మేర కాలువకు మరమ్మతులు : ప్రకాశం బ్యారేజీ నుంచి గుంటూరు జిల్లాకు నీరందించే ప్రధాన కాలువల్లో గుంటూరు ఛానల్ ఒకటి. కృష్ణా నది కుడి ఒడ్డున ప్రకాశం బ్యారేజి పైప్రాంతం నుంచి 47 కిలోమీటర్ల మేర సాగే ఈ కాలువ ద్వారా మంగళగిరి, పొన్నూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాల పరిధిలో సాగునీరు అందుతోంది. అంతేకాకుండా గుంటూరు నగరానికి తాగునీరు అందించే ప్రధాన నీటి వనరుగా ఉపయోగపడుతోంది. కాలువ గట్లు పాడైపోవటం, గుర్రపుడెక్క పెరిగిపోవడంతో నీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. గత ఎన్నికల సమయంలో ఈ విషయాన్ని రైతులు కూటమి నేతల ముందుంచారు.
నారా లోకేశ్, పెమ్మసాని చంద్రశేఖర్, ధూళిపాళ్ల నరేంద్ర, బూర్ల రామాంజనేయులు చొరవతో ఇప్పుడు గుంటూరు ఛానల్ ఆధునికీకరణ నిధులు మంజూరయ్యాయి. తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని, గుంటూరు, చేబ్రోలు, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు మండలాల పరిధిలో 30వేల ఎకరాల ఆయకట్టుకు భరోసా ఉంటుది. కృష్ణా డెల్టాలో నీటి నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చే ఈ ప్రాజెక్టుకు నిధుల విడుదలపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
భూసేకరణ కోసం 100 కోట్లు విడుదల : గుంటూరు ఛానల్ ప్రస్తుతం ప్రకాశం బ్యారేజి నుంచి గారపాడు వరకూ ఉంది. గారపాడు నుంచి పర్చూరు వరకూ కాలువ పొడిగించాలనే డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. దానికి కూడా కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భూసేకరణ కోసం 100 కోట్లు విడుదల చేసింది. కాలువ సామర్థ్యం పెంచకుండా, గట్లు బలోపేతం చేయకుండా దాన్ని ఇతర ప్రాంతాలకు పొడిగించటం వల్ల ఉపయోగం ఉండదు. పైగా నీళ్లు కింది ప్రాంతానికి తీసుకెళ్తున్నాయని రైతుల్లో అపోహలు పెరుగుతాయి.
ఇదే విషయాన్ని ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గుంటూరు ఛానల్ పొడిగింపుతో పాటు ఆధునీకరణ పనులు సమాంతరంగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు ఇప్పుడు గుంటూరు ఛానల్ ఆధునికీకరణకు నిధులు మంజూరయ్యాయి. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, మంగళగిరి మున్సిపాలిటీతోపాటు 33 గ్రామాలు తాగునీరు కోసం గుంటూరు ఛానల్ పైనే ఆధారపడి ఉన్నాయి. కాలువ సామర్థ్యం మెరుగుపడితే తాగునీటి సరఫరా కూడా మెరుగవుతుంది. కాలువ ఆధునికీకరణ ద్వారా 5 నియోజకవర్గాలు పర్చూరు వరకూ పొడిగింపు ద్వారా మరో మూడు నియోజకవర్గాలకు లబ్ది చేకూరనుంది.
జగన్ సర్కారు నిర్లక్ష్య వైఖరి - పూర్తి కాని గుంటూరు ఛానల్ పనులు - Guntur Channel Extension Works
"దయచేసి వినండి రాబోతోంది రైలుబండి" - నడికుడి-శ్రీకాళహస్తి మార్గంలో గుంటూరు నుంచి ప్రత్యేక రైలు

