ఇంజినీరింగ్ ఫీజులు సవరించిన ప్రభుత్వం - ఆ కళాశాలల్లో పెరిగిన రుసుములు
న్యాయస్థానం ఆదేశాలతో 2023-26 మూడేళ్ల కాలపరిమితికి ఈ మార్పు - 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి కొత్త ఫీజులు - 2023లో నిర్ణయించిన ఫీజులనే వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 25, 2025 at 4:55 PM IST
Government Revises 2023 to 2026 Engineering College Fees: రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యాసంస్థలు ఫీజుల మోత మోగిస్తున్నాయి. పేద, మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు భారంగా మారుతోంది. అయినా సరే పిల్లల్ని మంచి కళాశాలలో చదివించాలనే ఉద్దేశంతో చాలామంది తల్లిదండ్రులు ఇంజినీరింగ్ సీటుకు ఫీజు ఎక్కువ ఉన్నా చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు.
తాజాగా ఇంజినీరింగ్ కళాశాలల ఫీజులను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలతో 2023-26 మూడేళ్ల కాలపరిమితికి ఈ మార్పు చేసింది. దీని ప్రకారం కనీస ఫీజు రూ.40,000 కాగా, గరిష్ఠంగా రూ.1.05 లక్షలు. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ 2023లో కళాశాలలకు 3 ఏళ్లు కాలానికి ఫీజులను నిర్ణయించింది. దీనిపై కొన్ని యాజమాన్యాలు అప్పట్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాల మేరకు అప్పట్లో కమిషన్ ఫీజులను 10 శాతం పెంచింది. తరువాత కమిషన్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది.
ఏడు కళాశాలలకు పెరిగిన రుసుములు: ఇటీవల హైకోర్టు ఆదేశాల మేరకు 31 కళాశాలలు తమ ఆదాయ, వ్యయాల నివేదికలను కమిషన్‌కు సమర్పించగా వాటిని ఆడిట్ చేసి, ఫీజులను నిర్ణయించింది. వీటిలో 7 కళాశాలల ఫీజులు పెరిగాయి. 192 కళాశాలలు కమిషన్‌కు నివేదికలు సమర్పించలేదు. దీంతో ఆ ఏడు కళాశాలలు మినహా మిగతా అన్నింటికీ 2023లో నిర్ణయించిన ఫీజులనే వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి గడువు ఈ ఏడాదితో పూర్తి అవుతుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి.
మరోవైపు గత కొన్ని నెలల కిందట ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల ఫీజుల ఖరారు చేసేందుకు గరిష్ఠ పరిమితులతో కూడిన శ్లాబ్‌లు నిర్ణయించే అధికారం ఉన్నత విద్యా కమిషన్‌కు ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2023-26 మధ్యకాలానికి కళాశాల ఫీజు నిర్ధారణ కోసం గార్డెనింగ్, చట్టపరమైన ఖర్చులు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు, ప్రకటనల పై ఉన్నత విద్యా కమిషన్ గరిష్ఠ పరిమితిని విధించింది. ఆ నిర్ణయాన్ని ఏపీ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం హైకోర్టులో సవాల్ చేసింది. ఇంజినీరింగ్ కాలేజీలకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
దీనిపై ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్)లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు వేసింది. సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది పరమేశ్వర్ వాదిస్తూ, శ్లాబ్‌లను నిర్ణయించే అధికారం కమిషన్‌కు ఉందని సుదీర్ఘ వాదనలు వినిపించారు. దీనిపై విచారించిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ పీకే మిశ్రలతో కూడిన ధర్మాసనం ఉన్నత విద్యా కమిషన్ వాదనలతో విభేదించింది. పిటిషన్‌ను కొట్టేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
‘కాలేజీలే ఫీజులు నిర్ధారించాల్సింది ఉన్నత విద్యా కమిషన్ కాదు. ట్యూషన్, హాస్టల్, ల్యాబ్‌లు, స్పోర్ట్స్ రుసుముల వివరాలను అవి కమిషన్ దృష్టికి తెస్తాయి. కాలేజీలు అందిస్తున్న సేవలకు తగ్గట్టుగా ఫీజులు ఉన్నాయా? లేదా? అని మాత్రమే కమిషన్ పరిశీలించాలి. ఆ ఫీజులు డొనేషన్ల తరహాలో ఉండకుండా చూడటం వరకే మీ బాధ్యత అని స్పష్టత ఇచ్చింది. అంతే తప్ప మీరే ఖరారు చేయకూడదు. విద్యార్థుల నుంచి ఎంత వసూలు చేయాలనే విషయాన్ని ఫీజు ఖరారు కమిటీ నిర్ణయిస్తే విద్యా సంస్థల స్వతంత్రత ఏమవుతుంది?’ అని ధర్మాసనం ప్రశ్నించింది.

