ఐటీ 'కౌశలం'తో 4 నెలల్లో ఉద్యోగాలు! - డేటాబేస్‌లో 24 లక్షల మంది వివరాలు
సంక్రాంతి తర్వాత ‘ఐటీ జాబ్ ఫెయిర్’లు - కంపెనీలు, అగ్రిగేటర్లతో ‘కౌశలం’ పోర్టల్ అనుసంధానం - నాలుగు నెలల్లో ఐటీ ఉపాధి కల్పన లక్ష్యం - త్వరలోనే మెట్రో నగరాల్లో రోడ్ షోలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 31, 2025 at 7:59 AM IST
Government Plans To Provide IT Jobs Through Kaushalam Portal : రాష్ట్రంలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులకు వచ్చే నాలుగు నెలల్లో ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా ఐటీ శాఖ ప్రణాళిక రూపొందించింది. అర్హతలను బట్టి అభ్యర్థులు, కంపెనీలు, జాబ్ అగ్రిగేటర్లకు వారధిలా ‘కౌశలం’ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇంజినీరింగ్ పూర్తిచేసి, చిరుద్యోగులుగా, నిరుద్యోగులుగా ఉన్న సుమారు 24 లక్షల మంది సమస్త సమాచారాన్ని అందులో ఉంచింది. నిరుద్యోగ యువత వివరాలను ఆర్టీజీఎస్‌లోని డేటాలేక్ ద్వారా సేకరించి, క్షేత్రస్థాయిలో అధికారులు ఇప్పటికే పరిశీలించారు.
రాష్ట్రంలో ఇంజినీరింగ్ పూర్తిచేసి, ఎక్కడా ఉపాధి లభించని, ఒకవేళ ఉద్యోగం చేస్తున్నా అర్హతకు తగని వృత్తి(అండర్ ఎంప్లాయిమెంట్)లో ఉన్నవారిని ఐటీ శాఖ గుర్తించింది. ఆ వివరాలను ‘కౌశలం’లో అందుబాటులో ఉంచింది. ప్రైవేటు కంపెనీలు తమ అవసరాలకు సరిపడా స్కిల్స్ ఉన్నవారిని అందులోంచి ఎంపిక చేసుకోవచ్చు. ఉద్యోగాలు కల్పించే కంపెనీలు, నైపుణ్య శిక్షణ ఇచ్చే సంస్థలు, టెస్టింగ్ ఏజెన్సీలు, అభ్యర్థులు, అగ్రిగేటర్లను ఒకే వేదికపైకి తెచ్చేలా ప్రభుత్వమే ఓ సంస్థను ఏర్పాటు చేయడం విశేషం. పోర్టల్‌లో ఇంకా నమోదుకాని వారుంటే, నేరుగా రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఆ సమాచారమంతా పోర్టల్‌లో ప్రత్యక్షం : పోర్టల్‌లో నమోదైన ప్రతి ఒక్కరికీ ఐటీ శాఖ ఒక లాగిన్‌ను కల్పించింది. అందులో వారికి ఓ వెబ్‌పేజీ ఉంటుంది. లాగిన్ కాగానే సిస్టమ్ జనరేటెడ్‌గా వచ్చే హోంపేజీలో అభ్యర్థి, తండ్రి పేరు, కమ్యూనికేషన్ అడ్రస్, ఈ-మెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్, విద్యార్హతలు, ధ్రువీకరణ పత్రాలు, కోర్సు ఉత్తీర్ణులైన సంవత్సరం, సాధించిన మార్కులు, ఏఐ నైపుణ్యం, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశం వంటి సమాచారమంతా ప్రత్యక్షమవుతుంది. అభ్యర్థి ప్రతిభా పాటవాలను ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అందించేలా ఐటీ శాఖ ఒక పరీక్ష నిర్వహించి, వారికి గ్రేడింగ్‌లు ఇచ్చింది. వచ్చే ఆరు నెలల్లో ఏ రంగంలో ఉద్యోగాలు రావొచ్చు? దానికి కావాల్సిన నైపుణ్యాలేంటి? ఇందుకోసం ఎలాంటి సర్టిఫికెట్ కోర్సులు చేయాలి? తదితర వివరాలు ఆయా వ్యక్తుల ఇన్‌బాక్స్‌లో కనిపిస్తాయి.
పోర్టల్ ఇన్‌బాక్స్‌లో ఖాళీల వివరాలు : రోజూ ఇంటర్‌నెట్ స్క్రేప్ చేసి (ఏ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయో ఏఐ టూల్ గమనిస్తుంది. వివిధ జాబ్ పోర్టల్స్‌ను పరిశీలిస్తారు) ఉపాధి అవకాశాలను గుర్తిస్తారు. ఇదంతా ఏఐ టూల్ ద్వారా జరుగుతుంది. పోర్టల్‌లో నమోదైన 24 లక్షల మందిలో ఆయా ఉద్యోగాలకు అర్హులైన వారి ఇన్‌బాక్స్‌లో ఖాళీల వివరాలు కనిపిస్తాయి. ఉదాహరణకు ఓ అభ్యర్థి సివిల్ ఇంజినీరింగ్ చేసి, క్యాడ్‌క్యామ్‌లో అనుభవం ఉందనుకోండి. ఒక సంస్థకు అలాంటి ఉద్యోగి అవసరమైతే వారికి ఆ సమాచారాన్ని పోర్టల్ ద్వారా పంపిస్తారు. అభ్యర్థి పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు.
వారికీ అందుబాటులో కౌశలం పోర్టల్ డేటా : యువత సమాచారమంతా పెద్దపెద్ద రిక్రూట్‌మెంట్ కంపెనీలకు ఏపీఐ (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్) ద్వారా ఐటీ శాఖ ఇప్పటికే అందించింది. ఉదాహరణకు ఓ ఐటీ కంపెనీ పైథాన్‌లో అనుభవమున్న 500 మంది కావాలనుకుంటే అర్హులైన నిరుద్యోగులు, ఇప్పటికే ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తూ మెరుగైన కెరీర్ కోసం ఎదురుచూస్తున్న వారి జాబితా ఆ కంపెనీకి కనిపిస్తుంది. కంపెనీ ప్రతినిధులు నేరుగా అభ్యర్థులను సంప్రదించి, ఇంటర్వ్యూ నిర్వహించి, ఎంపిక చేసుకోవచ్చు. జాబ్ అగ్రిగేటర్లుగా ఉన్న మాన్‌స్టర్, నౌకరీ వంటి ఏజెన్సీలు ఉద్యోగాలిచ్చే కంపెనీలు, అభ్యర్థులకు మధ్య వారధిగా పనిచేస్తున్నాయి. కౌశలం పోర్టల్ డేటా వారికీ అందుబాటులో ఉంది.
విద్యార్థులకు పోర్టల్ ద్వారా తాజా సమాచారం : రాష్ట్రంలోని అన్ని కళాశాలలనూ కౌశలం పోర్టల్‌తో అనుసంధానించాలని ఐటీ శాఖ యోచిస్తోంది. ఇంజినీరింగ్ మూడో, నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పోర్టల్ ద్వారా తాజా సమాచారం అందుతుంది. వారు ఇంజినీరింగ్ పూర్తై జాబ్ మార్కెట్‌కు వెళ్లేలోగా నేర్చుకోవాల్సిన కోర్సులేంటి? వచ్చే ఏడాదిలో ఏఏ రంగాల్లో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉండొచ్చన్న సమాచారం విద్యార్థులు, ప్రొఫెసర్లు, కళాశాలల యాజమాన్యాలకు వెళ్తుంది. ముందస్తు అంచనాల మేరకు కోర్స్, సిలబస్ మార్పులను సూచిస్తుంది. కళాశాలల్లో నైపుణ్యాలు పెంచుకునేలా పోర్టల్ ద్వారా సమాచారమిస్తారు.
వారికి స్కిల్ డెవలప్‌మెంట్ నైపుణ్య శిక్షణ : గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, నిరుద్యోగులుగా ఉన్నవారిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తారు. సాంకేతిక నైపుణ్యాలు లేనివారికి ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. స్కిల్ కంపెనీలనూ పోర్టల్‌కు అనుసంధానించి, వారిద్వారా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, హైబ్రిడ్ విధానంలో నైపుణ్య శిక్షణ ఇప్పిస్తారు. రానున్న 4 నెలల్లో ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టనుంది. తర్వాత వారికి కంపెనీలతో నేరుగా మాట్లాడుకునేలా చూస్తుంది. పోర్టల్‌లో రిజిస్టరైన కంపెనీలు, అగ్రిగేటర్లతో సంక్రాంతి తర్వాత ‘ఐటీ జాబ్ ఫెయిర్’ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కౌశలం డేటాబేస్‌లోని అభ్యర్థులకు ఈ ఫెయిర్‌లోనే కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించవచ్చు. అర్హులకు అక్కడికక్కడే ఉద్యోగాలు ఆఫర్ చేయొచ్చు.
విస్తృత ప్రచారానికి రోడ్‌షోలు : "కౌశలంపై ప్రచారానికి జనవరి మొదటి వారంలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పుణె, దిల్లీ నగరాల్లో రోడ్ షోలు నిర్వహిస్తాం. ఐటీ కంపెనీలు, అగ్రిగేటర్లకు పోర్టల్ గురించి వివరిస్తాం. ఆయా కంపెనీల హెచ్‌ఆర్ మాడ్యూల్, ఐటీ శాఖ మాడ్యూల్‌ను అనుసంధానిస్తున్నాం. తద్వారా పోర్టల్‌లో డేటాను కంపెనీలు సులువుగా వాడుకోవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) డేటాతోనూ పోర్టల్‌ను అనుసంధానిస్తాం. దీనివల్ల కౌశలం పోర్టల్‌లో నమోదైన వారికి ఏదైనా కంపెనీ, అగ్రిగేటర్ ఉద్యోగం కల్పిస్తే, ఆ సమాచారం అందుతుంది". అని ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేని తెలిపారు.
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ - జనవరి వరకు దరఖాస్తులకు అవకాశం
నర్సింగ్ విద్యార్థులకు గుడ్‌న్యూస్ - జర్మనీలో అధిక వేతనంతో ఉద్యోగాలు

