ఇకపై ‘ఆంధ్రా యాత్రి’తో సేఫ్ రైడ్స్ - ఇది ప్రభుత్వ యాప్
ప్రజలకు తక్కువ ధరకే సేవలు అందేలా ప్రణాళిక - పీపీపీ విధానంలో ఏర్పాటుకు రవాణా శాఖ కసరత్తు -ప్రైవేటు యాప్‌లకు పోటీగా అందుబాటులోకి తెచ్చే యత్నం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 17, 2026 at 10:46 AM IST
Andhra Yatri For Safe Transportation in Cities: సిటీలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే చాలా వరకు ఎక్కువ మంది మొబైల్ యాప్‌లో ఆటో, టాక్సీ, బైక్ ఇలా తమకు అవసరమైంది బుక్ చేసుకుంటారు. ఒకరి కంటే ఎక్కువ మంది అయితే ఆటో, కారు, ఒక్కరే వెళ్లాల్సి వస్తే బైక్ ట్యాక్సీని బుక్ చేసుకుంటున్నారు. ఇలా అవసరానికి రైడ్స్ బుక్ చేసుకోవాలంటే మన కోసం అందుబాటులో ఉన్నవి అన్నీ ప్రైవేటు యాప్‌లే. ఈ నేపథ్యంలో ‘ఆంధ్రా యాత్రి’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఓ యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దీనికోసం ఆన్లైన్లో ఫ్లాట్ ఫామ్ నిర్వహణ, తదితరాల అవసరాల కోసం గుత్తేదారును ఎంపిక చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పీపీపీ (ప్రభుత్వ, ప్రైవేటు, భాగస్వామ్యం) విధానం కింద ఈ యాప్‌ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
చందా రుసుము చెల్లిస్తే చాలు: ఈ యాప్ ద్వారా బైక్, ఆటో, కారు ట్యాక్సీ డ్రైవర్లు రైడ్స్ పొందాలనుకున్న వాళ్లు దీనికోసం నామమాత్రపు చందా రుసుము చెల్లిస్తే సరిపోతుంది. ఒక్కో బైక్ ట్యాక్సీ ట్రిప్‌కి గరిష్ఠంగా రూ.3, రూ.5 తో ఆటో, రూ.11 కారు కోసం చందా రుసుము ఉంటుంది. ఆయా వాహనాన్ని బట్టి రోజు మొత్తానికి రూ.30 నుంచి రూ.50 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎన్ని రైడ్స్ అయినా పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ప్రైవేటు యాప్స్‌లో డ్రైవర్ కమీషన్‌గా ప్రతి రైడ్‌కు తాను పొందే డబ్బు మొత్తంలో 20 శాతం వరకు యాప్ వారికే చెల్లించాల్సి వస్తోంది. ఇటువంటిదేదీ 'ఆంధ్రా యాత్రి' యాప్‌లో ఉండదు. కేవలం ముందుగా రైడ్స్ పొందేందుకు చందా రుసుము మాత్రమే తీసుకుంటారు.
టెండర్ కోట్ ఇదే: యాప్ నిర్వహణ గుత్తేదారు ఈ విధంగా వసూలైన చందా డబ్బుల నుంచి 10 శాతం మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ యాప్ కోసం ప్రచారం బ్రాండింగ్ వంటి మిగిలిన వాటన్నింటికి అయ్యే మొత్తాన్ని రాష్ట్ర రవాణాశాఖ వినియోగిస్తుంది. ఈ యాప్‌నకు చెందిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ నిర్వహణకు బిడ్లు ఆహ్వానించనున్నట్లు సంబంధిత అధికారులు తెలుపుతున్నారు. దీనికోసం వాహన యజమానుల నుంచి ఎవరైతే తక్కువ చందా రుసుం తీసుకుని, ఈ యాప్‌ను నిర్వహిస్తామంటూ కోట్ చేస్తారో వారికే టెండరు కేటాయించనున్నట్లు తెలుస్తుంది.
అన్ని శాఖలను కలుపుతూ: రవాణా శాఖతో పాటు ఈ యాప్‌తో, ఆర్టీసీ, పోలీస్, కార్మిక శాఖలు, టూరిజం, ఆర్టీజీఎస్‌ను కూడా అనుసంధానం చేస్తారు. అన్ని శాఖల పర్యవేక్షణ ఉండడంతో రైడ్ బుక్ చేసుకున్న వారికి సురక్షితమైన ప్రయాణం లభిస్తుంది. డ్రైవర్ల నుంచి ఎటువంటి కమీషన్ వసూలు చేయకపోవడంతో వల్ల ప్రయాణికులకు కూడా రైడ్స్ కొంత వరకు తక్కువ ధరకే లభిస్తాయి. ఇందులో రియల్‌టైమ్ ట్రాకింగ్ తదితరాలన్నీ ఉంటాయి.
ప్రయోగాత్మకంగా ఆ13 జిల్లా కేంద్రాల్లో : ఒకప్పటి ఉమ్మడి జిల్లా కేంద్రాలైన తిరుపతి, విజయవాడ నగరాల్లో ముందుగా ఈ ‘ఆంధ్రా యాత్రి’ ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలుపుతున్నారు. ఇక్కడ ప్రయోగాత్మకంగా చేసిన అనంతరం ఇతర పట్టణాల్లో కూడా ఈ యాప్‌ను అందుబాటులోకి తెేనున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం పాలసీ రూపొందిస్తున్నారు. దాంట్లే నియమ నిబంధనలు ఖరారు చేసి, ఆపై టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో గతంలో కేంద్ర ప్రభుత్వం ఇదే విధానంలో ‘భారత్ యాత్రి’ అనే యాప్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించింది. ఏపీలో కూడా దీనిని భవిష్యత్తులో అమలు చేస్తారు. ‘ఆంధ్రా యాత్రి’ యాప్‌ని అందులో విలీనం చేస్తారు.
సంక్రాంతికి పల్లెబాట పడుతున్న నగరవాసులు - కిక్కిరిసిన ప్రయాణ ప్రాంగణాలు
9 రోజులు 14 క్షేత్రాలు - రాజమహేంద్రవరం నుంచి కర్ణాటక-మైసూర్ యాత్ర

