ETV Bharat / state

అమరావతి ఎకనమిక్‌ రీజియన్​కి మాస్టర్​ ప్లాన్ - 9 జిల్లాల్లో ఒకే ఆర్థికవ్యవస్థ

అమరావతి ఆర్థిక ప్రాంతం సమగ్ర అభివృద్ధికి కీలక ముందడుగు - సమగ్ర ఆర్థిక మాస్టర్‌ ప్లాన్‌ను 6 నెలల్లో సిద్ధం చేయాలని నిర్ణయం - కలెక్టర్లు, వివిధ ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్న వర్క్‌షాప్‌లో నిర్ణయం

Comprehensive Development of Amaravati Economic Zone
అమరావతిలోని సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో వర్క్‌షాప్‌ (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 3, 2026 at 7:24 AM IST

2 Min Read
Choose ETV Bharat

Amaravati Economic Region : తొమ్మిది జిల్లాలు, ఒకే ఆర్థిక వ్యవస్థగా అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా జిల్లాలను అనుసంధానిస్తూ సమగ్ర ఆర్థిక మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించనున్నారు. 6 నెలల్లో ప్రణాళికను సిద్ధం చేసి, అంతర్జాతీయస్థాయి ఆర్థిక, పట్టణ ప్రణాళిక నిపుణులను నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌గా ఎంపిక చేయనున్నారు. వివిధ రంగాలను ఒకే దిశగా తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యశాలలో అమరావతి ఎకనామిక్ రీజియన్ పరిధిలోని 9 జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లా సరిహద్దులకు పరిమితం కాకుండా ప్రాంతీయ అవసరాలు, వనరులు, ఆర్థిక అవకాశాలను పరిగణనలోకి తీసుకుని, మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని అమరావతి ఆర్థిక ప్రాంతం సీఈవో ఎస్​.సురేష్‌ కుమార్‌ సూచించారు.

ఒకే ప్రణాళికలోకి అభివృద్ధి కార్యక్రమాలు: ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, మార్కాపురం జిల్లాల ప్రత్యేకతలను పరస్పరం అనుసంధానించాలని సూచించారు. వ్యవసాయం, ఆహారశుద్ధి పరిశ్రమలు, పారిశ్రామిక రంగం, లాజిస్టిక్స్‌, పట్టణ ప్రాంతాలు, మౌలిక వసతులు, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల మధ్య బలమైన అనుసంధానం కల్పించడంపై దృష్టి పెట్టనున్నారు.

పరిశ్రమలు, గనులు, వైద్యం, ఐటీ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఇంధనం, వ్యవసాయం, పర్యాటకం, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడులు, ప్రణాళిక శాఖల అభివృద్ధి కార్యక్రమాలను ఒకే ప్రణాళికలోకి తీసుకురానున్నారు. పరిశ్రమలు, లాజిస్టిక్స్‌ పార్కులు, ఆర్థిక క్లస్టర్లు, ఇన్నోవేషన్‌ హబ్‌లు, వ్యూహాత్మక మౌలిక వసతులకు సంబంధించిన కీలక ప్రాజెక్టులను గుర్తించి ప్రాధాన్యతతో ముందుకు తీసుకెళ్లనున్నారు.

అమరావతి వనరులకు అనుగుణంగా ప్రణాళిక: ప్రభుత్వ శాఖలు, జిల్లా యంత్రాంగం, పట్టణ స్థానిక సంస్థలు, ప్రాంతీయ అభివృద్ధి సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టుల అమలులో ఎదురయ్యే సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి పనుల భౌతిక, ఆర్థిక పురోగతిని నిరంతరం సమీక్షించనున్నారు. విశాఖపట్నం ఆర్థిక ప్రాంత మాస్టర్‌ ప్లాన్‌ అనుభవాలనూ కార్యశాలలో పరిశీలించారు. అక్కడి అనుభవాలను ఆధారంగా చేసుకుని అమరావతి ఆర్థిక ప్రాంత ప్రత్యేకతలు, వనరులకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించనున్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు సాంకేతిక సహాయంతో పాటు, సింగపూర్‌ ప్రభుత్వంతో ఉన్న అవగాహన ఒప్పందం ద్వారా ప్రణాళిక నిపుణుల సహకారాన్ని వినియోగించుకోవాలని ప్రతిపాదించారు.

అంతర్జాతీయ నిపుణులతో ‘నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌’ ఎంపిక: సుమారు 44 వేల 962 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అమరావతి ఆర్థిక ప్రాంతం రాష్ట్ర జీఎస్​డీపీలో 35.15 శాతం వాటాను కలిగి ఉంది. వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగంతో పాటు పట్టణాభివృద్ధి, రవాణా, తీర ప్రాంత అనుసంధానం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో ఉన్న అవకాశాలను వినియోగించుకుని, 9 జిల్లాల అభివృద్ధిని ఒకే దిశగా నడిపాలని నిర్ణయించుకున్నారు. సమగ్ర ఆర్థిక మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించనున్నారు. 6 నెలల్లో ప్రణాళికను సిద్ధం చేసి, అంతర్జాతీయస్థాయి ఆర్థిక, పట్టణ ప్రణాళిక నిపుణులను నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌గా ఎంపిక చేయనున్నారు. వివిధ రంగాలను ఒకే దిశగా తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

120 ఏళ్ల భూ సమస్య కొలిక్కి - ప్రజాప్రతినిధులను సన్మానించిన గ్రామస్థులు

65వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం - భూమి వినియోగంలో పొదుపు పాటించాలన్న సీఎం చంద్రబాబు