ETV Bharat / state

గర్భిణీలలో రక్తహీనత సమస్యకు చెక్ - ఇకపై ఎఫ్‌సీఎం ఇంజెక్షన్లు

రక్తహీనత సమస్య ఉన్న గర్భిణులకు సైతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం - ఎఫ్‌సీఎం ఇంజెక్షన్లు సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు - ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామన్న వైద్యారోగ్యశాఖ మంత్రి

Government is Providing FCM Injection to Anemia in Pregnant Women
Government is Providing FCM Injection to Anemia in Pregnant Women (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 6, 2026 at 7:40 PM IST

2 Min Read
Choose ETV Bharat

Government is Providing FCM Injection to Anemia in Pregnant Women : సాధారణంగా శరీరంలో హీమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోవడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. ఈ సమస్య గర్భిణీల్లో అధికంగా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఐరన్ లోపం, పోషకాహార లోపం, ఫోలిక్ యాసిడ్ లేదా విటమిన్ B12 వంటివి కారకాలుగా ఉన్నాయి. దీనివల్ల ప్రసవ సమయంలో అనేక సమస్యలు తలెత్తే అవకాశముంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యాన్ని పెంచేందుకు పలు పథకాలు అమలు చేస్తున్నాయి. సంపూర్ణ పోషకాహారం కూడా అందిస్తున్నారు. అయినా గర్భిణుల్లో పౌష్టికాహార లోపం, అవగాహన లేమి, రక్తహీనత కారణాలతో హైరిస్క్ కేసులుగా పరిగణిస్తున్నామని నిపుణులు చెబుతున్నారు.

గర్భిణీల్లో రక్తహీనతకు లక్షణాలు ఇవే:

  • తీవ్రమైన అలసట
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం
  • కాళ్లు, చేతులు చల్లబడటం
  • గుండె వేగంగా కొట్టుకోవడం

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • రక్తహీనతను అధిగమించాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి
  • తేలికపాటి వ్యాయామం, యోగా చేయాలి
  • దైనందిన జీవితంలో ప్రశాంతత అలవాటు చేసుకోవాలి

మరోవైపు పోషకాహార లోపంతోనే గర్భిణులు రక్తహీనతకు లోనవుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రక్తహీనత నివారణకు అధికారులు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామ స్థాయిలో రక్తహీనత కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. తద్వారా సత్ఫలితాలిచ్చాయని గణాంకాలు పేర్కొన్నాయి.

గర్భిణుల్లో రక్తహీనత పరిష్కారానికి ఎఫ్‌సీఎం ఇంజెక్షన్లు: బాలింతల్లో రక్తహీనత సమస్య పరిష్కారానికి ఇచ్చే ఫెర్రిక్ కార్బాక్సీ మాల్టోజ్ (FCM) ఇంజెక్షన్లు ఇస్తారు. ఇకపై వీటిని గర్భిణులకు కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఇంజెక్షన్లు రూ.1,478.40 విలువైనవి. వీటిని గత సంవత్సరం సెకండరీ ఆసుపత్రుల్లో 53,500 మంది బాలింతలకు ఇచ్చారు. ఈ సారి రక్తహీనత సమస్య ఉన్న గర్భిణులకు సైతం ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దాంతో 18,500 మందికి త్వరలో అందుబాటులోకి తీసుకు రానున్నారు.

ప్రస్తుతం రక్తహీనతతో గర్భిణులు, బాలింతలు బాధపడుతున్నారు. వీరికి ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. సమస్య తీవ్రతను బట్టి 7-10 ఇంజెక్షన్లు ఇవ్వాల్సి వస్తోంది. అందుకోసం బాధితులు పలుమార్లు ఆసుపత్రులకు రావాల్సి వస్తోంది. దీంతో ఒకటి లేదా రెండు ఎఫ్​సీఎం ఇంజెక్షన్లు ఇస్తే సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టారు. ఇప్పటికే బాలింతలకు అవసరమైన ఇంజెక్షన్‌ నిల్వలు పీహెచ్‌సీ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)లకు 80, ప్రాంతీయ ఆసుపత్రులకు 175, జిల్లా ఆసుపత్రులకు 400 చొప్పున జిల్లాలకు పంపించారు. గర్భిణులకు కేటాయించిన నిల్వలు త్వరలో చేరవేస్తారు. ఎఫ్‌సీఎం ఇంజెక్షన్‌ అవసరమైన గర్భిణులు ఆసుపత్రులకు పంపించనున్నారు. వీటిని తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు.

మరోవైపు గతేడాది రక్తహీనత నివారణ చర్యల్లో ఏపీ దేశంలో తొలి స్థానంలో నిలిచింది. 6 నెలల శిశువు నుంచి చిన్నారులు, బాలింతలు, గర్భిణీల్లో రక్తహీనత తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు, సిరప్‌ పంపిణీ ప్రాతిపదికన రాష్ట్రాల వారీగా ర్యాంకులు ప్రకటించాయి. ప్రథమ స్థానంలో ఏపీ నిలవగా, ద్వితీయ స్థానంలో హరియాణా, తృతీయ స్థానాల్లో తెలంగాణలు నిలిచాయి.

గర్భిణీలు మెట్లు ఎక్కకూడదా? ఎక్కువ సార్లు స్నానం చేస్తే ఇబ్బందా? డాక్టర్లు ఏం అంటున్నారంటే?

అమ్మతనంను అడ్డుకునే రక్తహీనతపై గెలుపు- ప్రధానమంత్రి అవార్డుతో మన్యం జిల్లా అధికారులకు ప్రశంస