ETV Bharat / state

సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన - ఉద్యోగులు తప్పనిసరిగా హాజరు కావాల్సిందే

సిబ్బంది గైర్హాజరుపై దృష్టి సారించిన సచివాలయాల శాఖ - సీఎం చంద్రబాబు ఆదేశాలతో చర్యలు చేపట్టిన అధికారులు- జిల్లా స్థాయిలో పర్యవేక్షణకు జిల్లాకో అధికారి నియామకం, ప్రస్తుతం ఉమ్మడి 13 జిల్లాల్లో అధికారులు

Mandatory Attendance For Secretariat Staff
Mandatory Attendance For Secretariat Staff (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 27, 2025 at 11:38 AM IST

3 Min Read
Choose ETV Bharat

Mandatory Attendance For Secretariat Staff: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. ప్రజలకు సేవలను మరింత చేరువ చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల హాజరుపై దృష్టి సారించింది. అందుకుగాను క్షేత్రస్థాయి నుంచి సిబ్బంది సమాచారాన్ని సేకరించింది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇక తప్పనిసరిగా విధులకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది.

అధికారులు చెప్పారని అనధికార డిప్యుటేషన్లపై ఇతర కార్యాలయాల్లో పని చేయడం క్షేత్రస్థాయి పరిశీలన, పనుల పర్యవేక్షణ పేరుతో బయటకు వెళ్లడం ఇకపై కుదరదు. నిర్దేశించిన సమయంలోగా యాప్‌లో రోజూ హాజరు వేయాల్సిందే. రీ సర్వేలో పాల్గొంటున్న కొందరు సర్వేయర్లకు తప్ప మిగిలిన వారెవరికీ మినహాయింపు లేదు. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడం తప్పనిసరి అనుకుంటే అధికారుల అనుమతి తప్పనిసరి చేస్తూ రాష్ట్ర సచివాలయాల శాఖ ఈ మేరకు చర్యలను చేపట్టింది.

సచివాలయ ఉద్యోగులు ఇక తప్పనిసరిగా హాజరు కావాల్సిందే! (ETV)

సిబ్బంది తీరుపై సీఎం అసంతృప్తి: ప్రభుత్వం ఆదేశాలతో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు తప్పనిసరిగా విధులకు హాజరయ్యేలా సచివాలయాల శాఖ చర్యలు ప్రారంభించింది. ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో గ్రామ, వార్డు సచివాలయాల పని తీరుపై జరిగిన చర్చలో సిబ్బంది తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయాల్లో సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న సమాచారంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలన్న సీఎం ఆదేశాలతో అధికారులు ఆ మేరకు చర్యలు చేపట్టారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో అనధికార డిప్యుటేషన్లపై ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్నారు. వీటిని గుర్తించిన సచివాలయాల శాఖ రద్దు చేసింది. క్షేత్రస్థాయి పరిశీలన, పనుల పర్యవేక్షణ పేరుతో బయటకు వెళ్లడానికి చెక్‌ పెట్టింది. నిర్దేశించిన సమయంలోగా యాప్‌లో హాజరును తప్పనిసరి చేసింది. రీసర్వేలో పాల్గొంటున్న సర్వేయర్లు తప్పితే మిగిలిన సిబ్బంది విధిగా సచివాలయాలల్లో పని చేయాల్సిందే. సర్వేయర్లలోనూ అందరికీ మినహాయింపు లేదు. జాయింట్‌ కలెక్టర్‌ సూచించిన వారికే వెసులుబాటు ఉంది. వీరు కూడా రీసర్వే చేస్తున్న ప్రాంతంలో యాప్‌ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది.

పర్యవేక్షణకు జిల్లాకో అధికారి: సచివాలయాలపై 3 దశల పర్యవేక్షణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్వరలో పూర్తిస్థాయి అధికారులు రానున్నారు. జిల్లా స్థాయిలో పర్యవేక్షణకు జిల్లాకో అధికారిని నియమిస్తున్నారు. ఉమ్మడి 13 జిల్లాల్లో ప్రస్తుతం అధికారులు ఉన్నారు. మరో 13 మంది త్వరలో రానున్నారు. పుర, నగరపాలక, నగర పంచాయతీలకు ఒక్కో అధికారి చొప్పున 123 మందిని కేటాయిస్తారు. మండలానికో అధికారి చొప్పున 660 మంది రానున్నారు. ప్రస్తుతం 600 మంది ఎంపిక పూర్తయింది. మిగిలిన మండలాలకు వచ్చే నెల మొదటి వారంలో అధికారులు రానున్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల పేరును స్వర్ణ గ్రామం, వార్డుగా మార్చనున్నారు. ఇందుకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు రానున్నాయి. పేరు మార్చాలని కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు . ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు.

గత వైఎస్సార్సీపీ హయాంలో అస్తవ్యస్తం: వైఎస్సార్సీపీ పాలనలో గ్రామ, వార్డు సచివాలయాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలకు స్థానికంగా సేవలందించే పేరిట భారీ సంఖ్యలో సిబ్బందిని నియమించారు. కొందరికి పని తక్కువ ఉండగా మరికొందరిపై అదనపు భారం పడుతోంది. ధ్రువపత్రాల జారీలో డిజిటల్, వెల్ఫేర్‌ సహాయకులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. కానీ వీరి సంఖ్య తక్కువగా ఉంది. అందుకే చాలాచోట్ల ఇన్‌ఛార్జులే అదనపు బాధ్యతలతో పని చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వ శాఖల్లో బదిలీలకు రంగం సిద్ధం - ఈ నెలాఖరులోపు ప్రక్రియ పూర్తికి యోచన

"జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గ్రామవార్డు సచివాలయాలు"