సర్కార్ వారి హెయిర్ స్టైల్ - స్కూల్ విద్యార్థులు ఇలాగే కటింగ్ చేయించుకోవాలి
విద్యార్థుల్లో క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు - హెయిర్ స్టైల్ విషయంలో నూతన మార్గదర్శకాలు జారీ - ఇకపై క్రమశిక్షణకు విరుద్ధంగా, వింతగా ఉండే కేశాలంకరణకు అనుమతి నిరాకరణ

Published : July 9, 2026 at 12:48 PM IST
Govt New Hair Style Rules For Students : ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమైనది. చిన్న వయసు నుంచే బాలలకు క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇందులో భాగంగానే పాఠశాల విద్యార్థులకు కేశాలంకరణ(హెయిర్ స్టైల్) విషయంలో సర్కారు నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యార్థి రూపం వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా విద్యాశాఖ వెల్లడించింది.

నిబంధనలు ఇలా : విద్యాశాఖ నూతన నిబంధనల ప్రకారం మగ విద్యార్థులు జుత్తును సరళంగా, శుభ్రంగా కత్తిరించుకోవాల్సి ఉంటుంది. వెనుక భాగంలో చక్కగా, శుభ్రంగా హెయిర్‌కట్ చేసుకోవాలి. చిన్న కేశాలకు అనుమతి ఉంటుంది. క్రమశిక్షణకు విరుద్ధంగా, వింతగా ఉండే హెయిర్ స్టైల్‌ను ఇకమీదట తరగతి గదులోకి అనుమతించరు. తల్లిదండ్రులు ఈ విషయమై సహకరించాలని పాఠశాలల నిర్వాహకులు కోరుతున్నారు.
అనుమతించని హెయిర్ స్టైళ్లు ఇవే
- చాలా పొడవుగా లేదా గీరజాలుగా ఉన్న జుట్టు
- జుట్టులో డిజైన్లు లేదా గీతలు
- తల వెనుక భాగంలో పొడవుగా ఉండే మల్లెట్ స్టైల్
- స్పైక్ లేదా నిలువుగా ఉండే హెయిర్ స్టైల్
- జుట్టుకు రంగు వేయడం
- ఎక్స్ట్రీమ్ ఫేమ్ లేదా అతిగా స్టైలింగ్ చేసిన హెయిర్ కట్
విద్యాశాఖ సాధారణ సూచనలు :
- జుట్టును ఎల్లప్పుడూ శుభ్రంగా, చక్కగా ఉంచండి
- పాఠశాల నియమాలను పాటించి క్రమశిక్షణతో ఉండండి
- చక్కగా, శుభ్రంగా ఉండే హెయిర్ స్టైల్‌ను ఎంచుకోండి
- మీ రూపం మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది
విద్యార్థుల్లేని పాఠశాలలు సున్నా : తెలంగాణ రాష్ట్రంలో ఒక్క విద్యార్థీ లేని బడుల సంఖ్య ఈసారి సున్నా. ఇలాంటి బడులు 2022-23లో 1,672, 2023-24లో 2,097 ఉండగా 2024-25 సంవత్సరంలో 2,245కు పెరిగింది. కాగా ఈసారి ఒక్కటీ లేకపోవడం గమనించదగ్గవిషయం. ప్రీప్రైమరీ నుంచి ఇంటర్ వరకు అన్ని రకాల పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు సంబంధించి 2025-26 అకాడమిక్ ఇయర్లో ఏకీకృత జిల్లా పాఠశాల విద్యా సమాచారం(యూడైస్) గణాంకాలను కేంద్ర విద్యాశాఖ మంగళవారం విడుదల చేసింది.
తగ్గిన సింగిల్ టీచర్ పాఠశాలల సంఖ్య : ఈసారి యూడైస్ గణాంకాల్లో జీరో విద్యార్థులున్న పాఠశాలలను చూపరాదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిని తాత్కాలికంగా మూసివేశామనే ఆప్షన్‌ను ఎంచుకుంది. ఈ క్రమంలో విద్యార్థులు ఒక్కరూ లేని పాఠశాలల సంఖ్య సున్నాకు పడిపోయింది. విద్యార్థులు చేరినట్లయితే మళ్లీ వాటిని తెరుస్తారు. 2022-23లో 6,054 సింగిల్ టీచర్ పాఠశాలలు ఉండగా 2023-2024లో 5,895, 2024-25లో 5,001, 2025-26లో 4793కి తగ్గడం విశేషం. పాఠశాలల్లో మౌలిక వసతుల్లో జాతీయ సగటు కంటే రాష్ట్ర పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి.
- రాష్ట్రంలో ప్రీప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో బోధించే ఉపాధ్యాయులు/అధ్యాపకులు 3,70,756 మంది ఉండగా వారిలో అధికశాతం 2,42,377 (65%) మంది మహిళలున్నారు.
- 42,755 విద్యాసంస్థల్లో 76.76 లక్షల మంది విద్యార్థులున్నారు. అంటే ఒక్కో దాంట్లో విద్యార్థుల సగటు 184. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి 13వ స్థానం.
- మొత్తం విద్యార్థుల్లో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుంటున్నది కేవలం 26.52 లక్షల మందే. ఎయిడెడ్ పాఠశాలల్లో 69,651 మంది ఉండగా పలు ప్రైవేటు విద్యాసంస్థల్లో 49.52 లక్షల మంది చదువుతున్నారు. అంటే అధికశాతం మంది ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్‌లో చదువుకుంటున్నారు.
ఫలిస్తోన్న ప్రభుత్వ చర్యలు - తెలంగాణ విద్యా సంస్కరణలకు జాతీయ స్థాయిలో గుర్తింపు
వయసుకు మించి స్కూల్ బ్యాగ్‌ల బరువు - ప్రీప్రైమరీకి పుస్తకాలను అంటగడుతున్న కార్పొ'రేటు'

