ఏపీలో ‘గ్రీన్ బిల్డింగ్’ విధానానికి ప్రభుత్వం మొగ్గు - రిజిస్ట్రేషన్ ఫీజుల్లో రాయితీలు
పర్యావరణహిత నిర్మాణాలే స్థిరమైన పట్టణాభివృద్ధికి మార్గంగా భావిస్తోన్న ప్రభుత్వం - నీరు, విద్యుత్ వినియోగం తగ్గేలా నిర్మించే ప్రకృతి అనుకూల గ్రీన్ బిల్డింగ్‌లకు ప్రోత్సహాలు - ఇంపాక్ట్, రెరా రిజిస్ట్రేషన్ ఫీజుల్లో రాయితీలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 25, 2026 at 11:39 AM IST
Government Encouraging Green Buildings in AP : వేగం పుంజుకున్న పట్టణీకరణతో నగరాల రూపురేఖలు మారుతున్నాయి. పచ్చని ప్రదేశాల స్థానంలో కాంక్రీట్ నిర్మాణాలు విస్తరించడంతో సహజ వనరులపై ఒత్తిడి పెరుగుతోంది. విద్యుత్తు, నీటి అవసరాలు పెరగడం, తగ్గుతున్న పచ్చదనం, తీవ్రమవుతున్న పగటి ఉష్ణోగ్రతలు భవిష్యత్ పట్టణ జీవనానికి సవాల్‌గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణహిత నిర్మాణాలే స్థిరమైన పట్టణాభివృద్ధికి మార్గంగా ప్రభుత్వం భావిస్తోంది. నీరు, విద్యుత్ వినియోగం తగ్గేలా నిర్మించే ప్రకృతి అనుకూల గ్రీన్ బిల్డింగ్‌లను ప్రోత్సహిస్తోంది.
ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ఇచ్చే గ్రీన్ బిల్డింగ్ రేటింగ్ ఆధారంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇంపాక్ట్ ఫీజులో ఆయా భవనాలకు రాయితీ ఇస్తారు. సిల్వర్ రేటింగ్ పొందిన భవనాలకు 10, గోల్డ్ రేటింగ్‌కు 15, ప్లాటినం రేటింగ్ ప్రాజెక్టులకు 20 శాతం చొప్పున రాయితీ లభిస్తుంది. ఐజీబీసీ తుది సర్టిఫికేషన్ సాధించిన ప్రాజెక్టులకు ఏపీ రెరా ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ ఫీజులోనూ సిల్వర్‌కు 10, గోల్డ్‌కు 15, ప్లాటినానికి 20 శాతం వెనక్కి (రిఫండ్) ఇవ్వనున్నారు.
ఉదాహరణకు 2 లక్షల చదరపు అడుగుల నిర్మిత విస్తీర్ణానికి చదరపు అడుగుకు రూ.23 చొప్పున ఇంపాక్ట్ ఫీజు ఉంటే మొత్తం రూ.46 లక్షలు చెల్లించాలి. ప్రాజెక్టుకు సిల్వర్ రేటింగ్ వస్తే రూ.4.60 లక్షలు, గోల్డ్ రేటింగ్‌కు రూ.6.90 లక్షలు, ప్లాటినం రేటింగ్‌కు రూ.9.20 లక్షల వరకు ఇంపాక్ట్ ఫీజులో నేరుగా ఆదా కానుంది. వాస్తవ రుసుములు, ప్రాంతం, భూ వినియోగం, స్థానిక పట్టణాభివృద్ధి సంస్థ నిబంధనలు, ప్రాజెక్టు స్వభావాన్ని బట్టి మారొచ్చు.
ఇంధన, నీటి వినియోగంలో ఆదా : సాధారణ భవనంతో పోలిస్తే గ్రీన్ బిల్డింగ్ నిర్మాణానికి ప్రారంభ మూలధన వ్యయం సుమారు రూ.12 శాతం అధికంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. భవనం అందుబాటులోకి వచ్చాక ఇంధన వినియోగంలో 20-30%, నీటి వినియోగంలో 30-50 శాతం వరకు ఆదా అవుతుందని అంటున్నారు. అలాగే గ్రీన్ బిల్డింగ్ ప్రోత్సాహకాలతో డెవలపర్లు, నిర్మాణ సంస్థలకు చట్టబద్ధ రుసుముల్లో ఆదా కావడంతో పాటు ప్రాజెక్టు విలువ, మార్కెటింగ్ మెరుగవుతుంది. ఆర్కిటెక్టులు, కన్సల్టెంట్లకు పర్యావరణహిత డిజైన్ విధానాలను అమలు చేసే అవకాశం పెరుగుతుంది. ఇలాంటి భవనాల్లో నివసించే వారికి మెరుగైన సౌకర్యం, తక్కువ విద్యుత్, నిర్వహణ బిల్లులు, ఆరోగ్యకర ఇండోర్ వాతావరణం, ఆస్తి విలువ పెరుగుదల వంటి ప్రయోజనాలు ఉంటాయి.
ఐజీబీసీ పోర్టల్‌లో ప్రాజెక్టు నమోదు : ప్రభుత్వం నుంచి గ్రీన్ బిల్డింగ్ ప్రోత్సాహకాలు పొందాలనుకునే డెవలపర్ ముందుగా ఐజీబీసీ పోర్టల్‌లో ప్రాజెక్టును నమోదు చేయాలి. అనంతరం డిజైన్ దశలో ప్రీ-సర్టిఫికేషన్ పొందాలి. ఆ లేఖను పట్టణ ప్రణాళిక విభాగంతోపాటు పట్టణాభివృద్ధి సంస్థకు అందించి రాయితీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. నిర్మాణం పూర్తయ్యాక తుది ధ్రువీకరణ కోసం అవసరమైన పత్రాలు, పనితీరు నివేదికలు, అసెస్‌మెంట్ వివరాలను సమర్పించాలి. తుది రేటింగ్ సాధించిన తర్వాత సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
పెరుగుతోన్న గ్రీన్ బిల్డింగ్ ప్రాధాన్యం : రాజధాని అమరావతి, విశాఖపట్నం నగరాల్లో భారీ స్థాయిలో నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో గ్రీన్ బిల్డింగ్ విధానానికి ప్రాధాన్యం పెరుగుతోంది. రెరా సంబంధిత సంస్కరణలు, ఇంపాక్ట్ ఫీజు ప్రోత్సాహకాలు డెవలపర్లు, పెట్టుబడిదారుల్లో ఆసక్తి పెంచాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ ‘ఈనాడు’తో అన్నారు. ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వడంతో మరింత మంది డెవలపర్లు పర్యావరణ అనుకూల నిర్మాణాల వైపు వచ్చే అవకాశం ఉందని ఐజీబీసీ జాతీయ ఛైర్మన్ సి.శేఖర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
పర్యావరణ హితంగా 'అమరావతి' - గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ కోసం కసరత్తు
ప్రభుత్వ భవనాలపై సోలార్ ఏర్పాటు పనులు త్వరితగతిన చేపట్టాలి: సీఎం చంద్రబాబు

