ప్రభుత్వం కీలక నిర్ణయం - ఇకపై విమానాశ్రయాల్లోనూ బార్లు, మార్గదర్శకాలు ఇవే
తిరుపతి మినహా మిగిలిన విమానాశ్రయాల్లో ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం - ఒక విమానాశ్రయ బార్ లైసెన్స్ కింద గరిష్టంగా 3 సర్వింగ్ పాయింట్లకు అనుమతి - రోజుకు 24 గంటలు ఉండేలా నిర్ణయం

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 28, 2026 at 11:19 AM IST
Government Decided To Set Up Bars at Airports in AP : రాష్ట్రంలో తిరుపతి మినహా మిగిలిన విమానాశ్రయాలలో బార్ల ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయాల్లో బార్ లైసెన్స్‌లు మంజూరు చేయాలని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక విమానాశ్రయ బార్ లైసెన్స్ కింద, గరిష్టంగా మూడు సర్వింగ్ పాయింట్లకు అనుమతిస్తారు. విమానాశ్రయ బార్‌ల వ్యాపార వేళలు రోజుకు 24 గంటలు ఉండేలా, ఇవి వర్తించే విమానాశ్రయ కార్యాచరణ నియమావళి, భద్రతా ఆదేశాలు, శాంతిభద్రతల అవసరాలులోబడి ఉంటాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాలు కాగా, కడప ,రాజమండ్రి, కర్నూలు దేశీయ విమానాశ్రయాలు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి మినహా మిగిలిన విమానాశ్రయాల్లో బార్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విమానాశ్రయాలలో బార్ లైసెన్సుల నిర్వహణకు సంబంధించి మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, దిల్లీ రాష్ట్రాల్లోని విధానాలను మంత్రుల బృందం అధ్యయనం చేసింది. ఈ బృందం సూచనల మేరకు ఎయిర్ పోర్ట్ల్లో బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మార్గదర్శకాలు : విమానాశ్రయ బార్‌ల కోసం రిటైల్ ఎక్సైజ్ పన్ను, సంవత్సరానికి రూ.20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ప్రయాణీకుల రద్దీ ఉన్న విమానాశ్రయాలకు సంవత్సరానికి రూ.25 లక్షలు గా వసూలు చేస్తారు. రూ.20 లక్షల కంటే తక్కువ ప్రయాణీకుల రద్దీ ఉన్న విమానాశ్రయాలకు సంవత్సరానికి రూ.15 లక్షలుగా ఉంటుంది. ఈ రిటైల్ ఎక్సైజ్ పన్నును దరఖాస్తుదారుడి ఎంపిక మేరకు ఒకేసారి లేదా ఆరు సమాన వాయిదాలలో చెల్లించే వెసులుబాటు కల్పించారు.
విమానాశ్రయాలకు మంజూరు చేసిన బార్‌ల లైసెన్స్ కాలపరిమితి గరిష్టంగా మూడేళ్లకు ఉంటుంది. లైసెన్స్ మంజూరు కోసం విమానాశ్రయ నిర్వాహకుడు, అతనిచే సిఫార్సు చేయబడిన దరఖాస్తుదారు మధ్య కుదిరిన ఒప్పంద కాలం (MoU) లేదా ఈ నిబంధనల క్రింద పేర్కొన్న బార్ లైసెన్స్ కాలం, ఈ రెండింటిలో ఏది తక్కువైతే అది అమలవుతుంది.
లైసెన్స్ రుసుము నిర్మాణం, పని వేళలు, మద్యం అందించే కేంద్రాలు కౌంటర్లు మొదలైన అంశాలతో ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
బీచ్‌ల్లో బార్లు : మరోవైపు రాష్ట్రంలో టూరిజం అభివృద్ధిలో భాగంగా బీచ్ షాక్స్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రయోగాత్మకంగా బీచ్ బార్ల ఏర్పాటు కోసం మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది. బీచ్ షాక్ (shacks) పేరిట వీటిని ఏర్పాటు చేయడానికి ఎక్సైజ్ శాఖ జీవోను విడుదల చేసింది. రాష్ట్రంలో 12 తీర ప్రాంత జిల్లాలో ఏపీటీడీసీ గుర్తించిన చోట్ల బీచ్ షాక్స్ ఏర్పాటునకు విధివిధానాలు రూపొందించారు. ప్రయోగాత్మకంగా పైలెట్ ప్రాజెక్టుగా విశాఖ, సూర్యలంక బీచ్లలో ఈ బీచ్ షాక్స్ ఏర్పాటుకోసం స్టార్ హోటళ్లు, టూరిజం గుర్తింపు ఉన్న హోటళ్లకు అనుమతి ఇవ్వనున్నారు.
సెప్టెంబర్ 1 నుంచి 2029 ఆగస్టు 31 వరకు ఈ విధానం కింద బీచ్ షాక్స్ ఏర్పాటునకు నోటిఫికేషన్ జారీ అయింది. పైలెట్ ప్రాజెక్టు కింద సూర్యలంక, విశాఖపట్నం బీచ్లలో వీటిని ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ అనుమతి ఉన్న స్టార్ హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులకు వీటిని ఏర్పాటు చేసేందుకు లైసెన్స్‌లు మంజూరు చేస్తారు.
స్టార్ హోటళ్లకు కిక్ ఇచ్చే న్యూస్ - బార్ల లైసెన్సు ఫీజు భారీగా తగ్గింపు
తిరుపతిలో బార్లు, స్పా సెంటర్ల నిర్మాణమా! - మత సంప్రదాయాలకు విరుద్ధం

