ETV Bharat / state

దివ్యాంగ విద్యార్థులు ఎలా కోరితే అలానే పింఛన్‌ - వారి కష్టాలు తీర్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం

దివ్యాంగ విద్యార్థులకు పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం - వారు ఏవిధంగా కోరుకుంటే అలా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం - అక్టోబరు నుంచి అమలు చేసేందుకు సెర్ప్ అధికారుల కసరత్తు

Government Key Decision On Disabled Students Pensions in AP
Government Key Decision On Disabled Students Pensions in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 23, 2026 at 10:31 AM IST

2 Min Read
Choose ETV Bharat

Government Key Decision On Disabled Students Pensions in AP : రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోని అంధుల, బధిరుల గురుకులాల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు పింఛన్ల అందజేతపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దూర ప్రాంతాల్లో గురుకులాల్లో చదివే ది‌వ్యాంగ విద్యార్థులు ఏ విధానంలో పింఛన్ అందజేయాలని కోరితే అదే విధంగా ఇచ్చేందుకు నిర్ణయించింది. నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయాలని కోరుకున్న వారికి అదే విధంగా, ఇంటి వద్దనే ఇవ్వాలన్న వారికి, గురుకులం పరిధిలోని స్వర్ణ సచివాలయానికి మ్యాప్‌ చేసి పాఠశాలలోనే అందించాలన్న వారికి అలానే ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అక్టోబర్‌ నుంచి ఈ విధానాన్ని అమలు చేసేలా సెర్ప్‌ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద దివ్యాంగులకు ప్రభుత్వం నెలకు రూ.6 వేల చొప్పున పింఛను అందిస్తోంది.

424 మంది దివ్యాంగ విద్యార్థులు : రాష్ట్రంలో విజయనగరం, విశాఖ, హిందూపురం నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున 3 అంధుల గురుకుల పాఠశాలలు, విజయనగరం, బాపట్ల, ఒంగోలులో ఒక్కొక్కటి చొప్పున 3 బధిరుల గురుకుల పాఠశాలలు, బాపట్లలో మరో గురుకుల కళాశాల ఉంది. వీటిలో 424 మంది విద్య అభ్యసిస్తున్నారు. వీరిలో కొంతమంది కొన్నేళ్లుగా పింఛను తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం వారికి సులువుగా అందించడంపై దృష్టి పెట్టింది.

పింఛను అందజేతపై వారి నుంచి అభిప్రాయాలు తీసుకునేందుకు ఇటీవల సర్వే నిర్వహించింది. 424 మంది దివ్యాంగ విద్యార్థుల్లో 116 మంది తమకు నేరుగా బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేయాలని నివేదించారు. తాము చదివే గురుకులం సమీపంలోని స్వర్ణ సచివాలయానికి వివరాలను మ్యాప్‌ చేసి అక్కడి సిబ్బంది ద్వారా పాఠశాలలోనే పింఛను అందించాలని 17 మంది విన్నవించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంలోనే ఇంటి వద్దనే పింఛను పంపిణీ చేయాలని 178 మంది కోరారు.

అందరికీ పింఛన్లు అందే అవకాశం : ఈ అంధుల, బధిరుల గురుకులాల్లో చదివే 113 మందికి గత కొన్నేళ్లుగా పింఛను అందట్లేదు. కొత్త పింఛన్ల మంజూరుతో సంబంధం లేకుండా తీవ్రమైన వైకల్యం ఉన్న వారికి కలెక్టర్‌ సిఫార్సు మేరకు ప్రభుత్వం ప్రతి నెలా పింఛను ఇస్తోంది. దివ్యాంగుల శాఖ ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారిస్తే వీరందరికీ పింఛను అందే అవకాశముంది.

రాష్ట్ర ఆదాయంలో అధిక భాగం జీతాలు, వడ్డీలు, పింఛన్లకే - కాగ్‌ నివేదికలో వెల్లడి

కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం కీలక నిర్ణయం - జూన్‌ నుంచి ఇవ్వాలని నిర్ణయం