విశాఖ మీదుగా రైల్లో వెళ్లేవాణ్ని - సాగర నగరం గ్లోబల్ ఏఐ హబ్ అవుతుందని ఊహించలేదు: సుందర్ పిచాయ్
ఐఐటీ ఖరగ్‌పుర్‌కు చెన్నై నుంచి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లేటప్పుడు విశాఖ మీదుగా వెళ్లేవాన్ని - విశాఖ నగరం ప్రపంచ ఏఐ హబ్‌గా మారుతుందని ఊహించలేదు - గ్లోబల్ ఏఐ సమిట్‌లో గూగుల్ సీఈఓ

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 20, 2026 at 1:42 PM IST
|Updated : February 20, 2026 at 5:12 PM IST
Google CEO Sundar Pichai About Google AI Hub in Visakhapatnam : "నేను భారతదేశానికి వచ్చినప్పుడల్లా ఇక్కడ జరుగుతున్న మార్పుల వేగాన్ని చూసి ముగ్ధుడినవుతున్నా. ఇప్పుడూ కూడా అందులో ఏం తేడా లేదు. విశాఖపట్నంలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏఐ హబ్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇది భారతీయులకు ఉద్యోగాలతో పాటు, అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఏఐని అందుబాటులోకి తెస్తుంది. అంతరిక్షంలో డేటాసెంటర్ల ఏర్పాటుపై చర్చించే రోజు వస్తుందని కానీ, శాన్‌ఫ్రాన్సిస్కోలో నా తల్లిదండ్రులను డ్రైవర్‌లెస్ కారులో తీసుకెళ్తాననీ ఎప్పుడూ అనుకోలేదు. ఆరోజు 83 ఏళ్ల నా తండ్రి కళ్లలో కనిపించిన వెలుగు నాకు ఇప్పటికీ గుర్తుంది. అలాంటి కారు భారతీయ రద్దీ రోడ్లపైనా పనిచేస్తే చాలా సంతోషిస్తానని ఆ రోజు ఆయన వ్యక్తం చేసిన కోరికను సాకారం చేయడానికి ఇప్పుడు మేం పని చేస్తున్నాం" అని గూగుల్ సీఈఓ సుందుర్ పిచాయ్ పేర్కొన్నారు.
తాను ఐఐటీ ఖరగ్‌పుర్‌కు చెన్నై నుంచి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లేటప్పుడు ఆ రైలు విశాఖపట్నం మీదుగా వెళ్లేదని సుందర్ పిచాయ్ తెలిపారు. అయితే ఆ సాగర నగరం ఇప్పుడు ప్రపంచ ఏఐ హబ్‌గా మారుతుందని ఆనాడు ఊహించలేదని పిచాయ్ పేర్కొన్నారు. ఆయన ఇక్కడి భారత్ మండపంలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమిట్-2026లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు, వివిధ దేశాధినేతలు, కార్పొరేట్ దిగ్గజాల సమక్షంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే
ఏఐ ఆధారిత వాతావరణ హెచ్చరికలు : వైజాగ్‌తో పాటు మలేషియా, థాయ్‌లాండ్ ఇంకా చాలాచోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. భారత్-యూఎస్ మధ్య విస్తృతస్థాయిలో సబ్‌సీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఏర్పాటు చేస్తున్నాం. వర్షాకాలంలో రైతుల జీవనోపాధిని కాపాడే అంశంపై పని చేస్తున్నాం. అందులో భాగంగా గత సంవత్సరం వేసవిలో భారత ప్రభుత్వం ఏఐ ఆధారిత వాతావరణ హెచ్చరికలను కోట్ల మంది రైతులకు పంపింది. అలాగే భాషలను సమ్మిళితం చేయడానికి స్వచ్ఛంద సంస్థలు, యూనివర్సిటీలతో కలిసి పని చేస్తున్నాం. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అద్భుతమైన ప్రయోజనాలను తీసుకొస్తుంది. ఆ ప్రయోజనాలు అందరికీ దక్కేలా చూడాలి.
అదేవిధంగా డిజిటల్ విభజన ఏఐ విభజనకు దారితీసే పరిస్థితి కల్పించకూడదు. అందువల్ల కనెక్టివిటీ, కంప్యూటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. ఏఐ వర్క్‌ఫోర్స్ సామర్థ్యాలను పూర్తిగా మారుస్తుంది. కొన్ని పాత్రలను ఆటోమేటిక్ చేసి, మరికొన్నింటిని పూర్తిగా మార్చి సరికొత్త ఉద్యోగావకాశాలు సృష్టిస్తుంది. 20 సంవత్సరాల క్రితం ప్రొఫెషనల్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ అన్న వృత్తే లేదు. ప్రస్తుతం కోట్లమంది ఉన్నారు. ఇందుకు శిక్షణ కూడా చాలా ముఖ్యం.
గూగుల్ ఏఐ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐ ఉద్యోగాలను అందుకోవడానికి అవకాశం తెస్తుంది. మనం ఎంత ధైర్యంగా ఉన్నామన్నది కాదు, ఎంత బాధ్యతాయుతంగా ఉన్నామన్నదే ప్రధానం. ఇందులో రెగ్యులేటర్లు, ప్రభుత్వాల పాత్ర చాలా విస్తృతంగా ఉంటుంది. ఈ ప్రయాణంలో అవసరమైన నిబంధనలు రూపొందించి ఎదురయ్యే ముప్పును పరిష్కరించేలావాటిని అమలు చేయాలి. అలాగే ఇన్నోవేటర్లు ప్రజల జీవితాలను మెరుగుపరిచేలా సేవలను అందుబాటులోకి తీసుకురావాలి.
సరికొత్త ఆవిష్కరణల మలుపులో ఉన్నాం : మన జీవితకాలంలో కనిపించిన అతిపెద్ద మార్పు ఏఐ. హైపర్ ప్రోగ్రెస్, సరికొత్త ఆవిష్కరణల మలుపులో ఉన్నాం. ఇది అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు పెద్ద ముందడుగు వేయడానికి చేయూతనిచ్చి వారసత్వంగా వస్తున్న లోపాలను సరిదిద్దుతుంది. అదేవిధంగా ఏఐ ప్రతి ఒక్కరికీ సహాయకారిగా ఉంటుంది. మనం దాన్ని ధైర్యంగా స్వీకరించి, బాధ్యతాయుతంగా ఉపయోగించాలి. సైన్స్‌లోని కఠిన సమస్యలను ఏఐ పరిష్కరిస్తుంది. 50 ఏళ్లుగా ప్రొటీన్ నిర్మాణాలను అంచనా వేయడం పెద్ద సవాల్‌గా ఉండేది. కానీ డెమిస్ హసాబిస్, గూగుల్ డీప్‌మైండ్‌లోని అతని బృందం ఆ సమస్యను ఏఐ ద్వారా ఎలా పరిష్కరించగలమని ప్రశ్నించుకున్నారు.
ఆ ప్రశ్నే ఆల్ఫాఫోల్డ్ ఆవిష్కరణకు దారి తీసింది. అది నోబెల్ బహుమతి తెచ్చిపెట్టడమే కాకుండా ఏళ్లతరబడి సాగిన పరిశోధనను ఒక డేటాబేస్‌లోకి తీసుకొచ్చి ప్రపంచం ముందు పెట్టగలిగింది. ఇప్పుడు 190 దేశాల్లో 30 లక్షల మంది పరిశోధకులు మలేరియా టీకా అభివృద్ధి కోసం, యాంటీబయాటిక్ నిరోధకాలపై పోరాడేందుకు, ఇతర కార్యక్రమాల కోసం దాన్ని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు సైన్స్ సమస్యలన్నింటికీ పరిష్కారాలు చూపే ప్రశ్నలను ఏఐని అడుగుతున్నాం అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు.
ఏఐ హబ్‌గా విశాఖ పోర్టు సిటీ - విస్తరణకు కార్యాచరణ రూపకల్పన
విశాఖలో అతి పెద్ద 'గూగుల్ ఏఐ హబ్' - అమెరికా తర్వాత రాష్ట్రంలోనే ఏర్పాటు

