విజ్ఞాన్ వర్సిటీలో ఏఐ ల్యాబ్ - గూగుల్ ఆధ్వర్యంలో విద్యార్థుల నైపుణ్యానికి పదును
ఏఐ ల్యాబ్‌కు వేదికగా విజ్ఞాన్ వర్సిటీ - గూగుల్ ఆధ్వర్యంలో ఏఐ ల్యాబ్ ఏర్పాటు - పారిశ్రామిక అవసరాలకు తగ్గట్లు విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా రూపకల్పన - తద్వారా మెరుగైన పరిశోధన అవకాశాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 7, 2026 at 11:29 AM IST
|Updated : June 7, 2026 at 12:10 PM IST
Google AI Lab Inaugurated At Vignans University: సాంకేతికత మొత్తం ఏఐ చుట్టూ తిరుగుతున్న తరుణంలో విద్యాసంస్థలు, యూనివర్సిటీలు తమ ప్రణాళికను ఆ మేరకు మార్చుకుంటున్నాయి. అందుకు అవసరమైన సౌకర్యాలను సమకూర్చుకుంటున్నాయి. బహుళజాతి సంస్థలు ఇందుకు తోడ్పాటు అందిస్తున్నాయి. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో గూగుల్ సంస్థ ఆధ్వర్యంలో ఏఐ ల్యాబ్ ఏర్పాటైంది. యువ ఇంజినీర్లకు ఆధునిక సాంకేతికపై శిక్షణ ఇచ్చేలా దీన్ని రూపొందించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
విజ్ఞాన్ వర్సిటీలో ఏఐ ల్యాబ్: రాష్ట్రంలో మొట్టమొదటి ఏఐ ల్యాబ్‌ను గూగుల్ సంస్థ ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ జెమిని ఎంటర్‌ప్రైజ్ ఫర్ ఎడ్యుకేషన్ సహకారంతో ఈ ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏఐ, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, జనరేటివ్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతల్లో విద్యార్థులు ప్రత్యక్ష అనుభవాన్ని పొందేలా ఈ ల్యాబ్‌లో సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అత్యాధునిక ఏఐ టూల్స్, గూగుల్ క్లౌడ్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాలు, పరిశ్రమల్లో వినియోగిస్తున్న ఆధునిక విధానాలపై విద్యార్థులు ప్రయోగాత్మకంగా అవగాహన పొందేలా దీనిని తీర్చిదిద్దారు. విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు, పరిశోధనా సామర్థ్యాలు, సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధితో పాటు పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు తీర్చిదిద్దటమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం. ఏఐ ల్యాబ్ ద్వారా ఇంజినీరింగ్ విద్యార్థులకు శిక్షణ, ప్రాజెక్టులు, పరిశోధన అవకాశాలు లభించనున్నాయి.
గూగుల్ ఏఐ ల్యాబ్ ఏర్పాటుతో పరిశోధన, ఆవిష్కరణలు, సమస్యల పరిష్కార నైపుణ్యాల్లో విద్యార్థులు మరింత ముందంజలో నిలుస్తారని విజ్ఞాన్ విద్యాసంస్థల ఛైర్మన్ లావు రత్తయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఏఐ ల్యాబ్ ద్వారా కేవలం తమ యూనివర్సిటీ విద్యార్థులకే కాకుండా ఇతర ఇంజినీరింగ్ విద్యార్థులూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు.
ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనేది ఎంత నిజమో, దాన్ని నేర్చుకుని పనిచేస్తే సరికొత్త ఉద్యోగాలు వస్తాయనేది అంతే నిజం. ఫిన్‌టెక్, ఆరోగ్యరంగం, రోబోటిక్స్, ఇంజినీరింగ్, ఆటోమేషన్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అనేక రంగాల్లో ఏఐ అపార అవకాశాలను సృష్టించనుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఏఐ నేర్చుకునే విద్యార్థులకు భవిష్యత్తులో అవకాశాలు పెరగనున్నాయి.
"గూగుల్ ఏఐ ల్యాబ్ ఏర్పాటుతో పరిశోధన, ఆవిష్కరణలు, సమస్యల పరిష్కార నైపుణ్యాల్లో విద్యార్థులు ముందువరుసలో నిలుస్తారు. తమ మెదడుకు మరింత మెరుగుపరుచుకుని అత్యున్నత ఆవిష్కరణల దిశగా అడుగులు వేసేందుకు ఈ ఏఐ ల్యాబ్ ఎంతగానో దోహదపడుతోంది. అదే విధంగా ఏఐ ద్వారా పలు ఉద్యోగ అవకాశాలను సైతం తమ తమ నైపుణ్యాలతో సునాయాసంగా అందిపుచ్చుకునే వెసులుబాటు కలుగుతుంది. విద్యార్థులంతా నైపుణ్యాలను పెంచుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నాను". -లావు రత్తయ్య, విజ్ఞాన్ విద్యాసంస్థల ఛైర్మన్
"గూగుల్ ఏఐ ల్యాబ్ నిరంతరం అందుబాటులో ఉండే విధంగా చూస్తాం. ఇందులో గూగుల్ టూల్స్‌ను ఇప్పటి వరకు వెయ్యి మంది విద్యార్థులకు సబ్‌స్కైబ్ చేశాం. ఈ టూల్స్ ఫ్యాకల్టీకి సులభతరంగా బోధించడానికి, విద్యార్థులకు వేగంగా అర్ధమయ్యేందుకు కీలక భూమికను పోషిస్తాయి. అదే విధంగా రానున్న నాలుగు రోజుల వాతావరణం ఏ విధంగా ఉంటుందనే దానిపై సైతం ఏఐ టూల్స్ ఉపయోగించడం ద్వారా తెలుసుకనేందుకు కృషి చేస్తున్నాం". -జ్యోత్స్నాదేవి, ఏఐఎంఎల్ విభాగాధిపతి
"ఇండస్ట్రీలో గానీ లేదా మార్కెట్లో గానీ మనం ఏదైనా సరే వ్యాపారం చేయాలంటే ముందుగా మీకు భాగస్వామి ఉన్నారా అని అడుగుతారు. గూగుల్ అనే సంస్థ పారిశ్రామికంగా మనకు సలహాలు, సూచనలను అందిస్తూ మనల్ని ప్రోత్సహిస్తే మనకు బ్రాండెడ్ వాల్యూ అనేది వస్తుంది. ఈ ఏఐ ల్యాబ్ ద్వారా కేవలం మా యూనివర్సిటీ విద్యార్థులకే కాకుండా ఇతర ఇంజినీరింగ్ విద్యార్థులూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు". -ప్రసాద్ పాండా, డైరెక్టర్-ఇండస్ట్రీ రిలేషన్స్
వైద్యరంగంలో ఏఐ విప్లవాత్మక మార్పులు - తెరమీదకు కొత్త ఆవిష్కరణలు, ఏంటంటే?
ఐదుగురు విద్యార్థుల అద్భుత సృష్టి - ఏఐ సాంకేతికతతో వాహనాలు, మనుషుల లెక్కింపు

