ETV Bharat / state

హైదరాబాద్​లో అనుమతి లేని భవన యజమానులకు గుడ్ న్యూస్ - క్యూర్ - 2026 చట్టంతో రెగ్యులరైజేషన్​కు ఛాన్స్

క్యూర్ - 2026 ముసాయిదాలో అనుమతి లేని భవనాల క్రమబద్ధీకరణకు అవకాశం - బిల్డింగ్ రెగ్యులరైజేషన్​ స్కీమ్​కు ప్రత్యామ్నాయంగా మరో నిబంధన - 11 ఏళ్ల తర్వాత మళ్లీ పట్టాలకెక్కనున్న ప్రక్రియ

అనుమతి లేని భవనాల క్రమబద్ధీకరణపై క్యూర్ 2026 చట్టం
CURE 2026 ACT FOR BUILDINGS REGULARIZATION (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : July 8, 2026 at 7:33 PM IST

2 Min Read
Choose ETV Bharat

New Act For Unauthorized Buildings : హైదరాబాద్ మహానగర పరిధిలో అక్రమ నిర్మాణ జాబితాలో ఉంటూ సమస్యలను ఎదుర్కొంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్​ న్యూస్ చెప్పింది. ఈ తరహా అనుమతి లేని భవనాల క్రమబద్ధీకరణపై కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. జీహెచ్​ఎంసీ స్థానంలో కొత్తగా రానున్న చట్టానికి సంబంధించిన ముసాయిదాలో దీని గురించి ప్రస్తావించింది. దీని ద్వారా ఆయా భవనాల యజమానులకు 11 సంవత్సరాల తర్వాత మళ్లీ తీపి కబురు అందించినట్లయింది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయంతో లక్షలాది మంది భవన యజమానులకు లబ్ధి చేకూరడంతో పాటు ప్రభుత్వానికి కూడా భారీ ఆదాయం సమకూరనుంది.

అఫిడవిట్ ద్వారా దరఖాస్తులు తీసుకొని : జీహెచ్​ఎంసీ చట్టం స్థానంలో త్వరలో రానున్న 'క్యూర్ - 2026' బిల్లుకి సంబంధించిన ముసాయిదాలో ఒకసారి పరిష్కారంలో భాగంగా దీన్ని తీసుకురానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో అనుమతి లేకుండా నిర్మించిన భవనాలను జరిమానా ద్వారా క్రమబద్ధీకరించేందుకు ఆయా కమిషనర్లకు అధికారం కల్పించింది. అంటే ఈ బిల్లు అమలు పరిచిన తర్వాత అక్రమ నిర్మాణ భవనాల యజమానుల నుంచి అఫిడవిట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి, పాత వాటిని క్రమబద్ధీకరించనున్నారు.

గత ప్రభుత్వం పథకాన్ని ప్రవేశ పెట్టగా : ప్రత్యేక రాష్ట్ర అవతరణ తర్వాత గత ప్రభుత్వం బల్దియాలో బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (బీఆర్​ఎస్)ను ప్రకటించింది. సెప్టెంబరు 2, 2015 రోజున ఈ పథకాన్ని ప్రవేశపెడుతూ, జీహెచ్​ఎంసీ పరిధిలో అక్టోబరు 28, 2015 నాటికంటే ముందు అనుమతులు పొందకుండా నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు తలపెట్టింది. బల్దియా పరిధిలోని భవన యజమానుల నుంచి మొత్తం 1.39 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.2,500 కోట్ల మేర ఆదాయం వచ్చింది. అయితే, అక్రమ నిర్మాణాలకు ఈ పథకం తోడ్పాటుగా వ్యవహరిస్తోందంటూ పలువురు కోర్టును ఆశ్రయించడంతో కొద్ది రోజులకే ఈ ప్రక్రియను నిలిపేశారు.

ఎవరైనా దరఖాస్తు చేసుకునేలా : అప్పటి నుంచి 11 సంవత్సరాలుగా ఈ ప్రక్రియలో ఎలాంటి పురోగతీ లేదు. తాజాగా మహానగరంలోని మూడు కార్పొరేషన్ల కోసం రూపొందిన క్యూర్ - 2026 చట్టంలో ఈ బీఆర్​ఎస్​ పథకానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఓ ప్రత్యేక నిబంధన తీసుకొచ్చింది. అందులోని సెక్షన్​ - 160 ప్రకారం అప్పటి కటాఫ్​ తేదీతోనే అనుమతి లేని భవనాలను క్రమబద్ధీకరించేలా జీహెచ్​ఎంసీతో పాటు సీఎంసీ, ఎంఎంసీ కమిషనర్లకు అధికారం ఇచ్చింది. అయితే, కేవలం అప్పుడు దరఖాస్తు చేసిన భవన యజమానులకు మాత్రమే కాకుండా ఇతరులు కూడా దరఖాస్తు చేసుకునేలా ఈ నిబంధన వర్తించనుంది.

ఉల్లంఘనలకు పాల్పడితే క్రిమినల్ కేసులు : ఇప్పుడు దరఖాస్తు చేసుకోనున్న యజమానులు తమ భవనాన్ని 2015 కంటే ముందు నిర్మించినట్లు అఫిడవిట్ సమర్పిస్తే సరిపోతుందని నూతన చట్టంలోని ముసాయిదాలో పేర్కొంది. ఎవరైనా తప్పుడు సమాచారం ద్వారా లబ్ధి పొందాలని అప్లై చేసుకుంటే మాత్రం క్రిమినల్ కేసులు నమోదవుతాయి. అయితే, ఈ కీలక నిర్ణయం పట్ల ముసాయిదాలో స్పష్టంగా పేర్కొనలేదని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. సరైన మార్గదర్శకాలు లేకుంటే, ఇటీవలే నిర్మించిన అక్రమ భవనాల యజమానులు సైతం దరఖాస్తు చేసుకొని హక్కులు పొందే అవకాశముందని గుర్తుచేస్తున్నారు.

సాదాబైనామా పరిష్కారాలు షురూ - ఆమోదం కంటే తిరస్కరణలే అధికం

ధరణి అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం! - నేడో, రేపో మార్గదర్శకాలు జారీ