6 నెలల్లో 3 సార్లు ఆలయంలో బంగారం మాయం - అర్చకులు ఏం చేశారంటే?
శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయంలో తాజాగా సుమారు 15 లక్షల విలువైన బంగారం మాయం - ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిగ్గు తేల్చాలని భక్తుల విజ్ఞప్తి

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 20, 2026 at 5:09 PM IST
Gold Missing From Sri Bhramaramba Malleswara Swamy Temple: ఇంట్లో దొంగలు పడి బంగారం దోచుకెళ్తే త్వరగా దొరకాలని దేవుడ్ని ప్రార్థిస్తాం. కానీ ఆ దేవుడు గుడిలోనే తరచూ చోరీలు జరుగుతుంటే ఏం చేస్తాం? ఇంకా ఎవరికి చెప్పకుంటాం? ఇటువంటి ఘటనే కలకలం రేపుతోంది ఓ ఆలయంలో. గుంటూరు జిల్లా పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయంలో తరచూ అమ్మవారి బంగారు ఆభరణాలు మాయమవుతున్నాయి. గడిచిన 6 నెలల్లో 3 సార్లు బంగారం మాయమైంది. తాజాగా సుమారు 70 గ్రాముల అమ్మవారి తాళిబొట్టు గొలుసు, మంగళసూత్రం మాయమైంది. ఈ విషయాన్ని ఆలయ అర్చకులు కొన్ని రోజులుగా గోప్యంగా ఉంచినా ఎట్టకేలకు బయటకు పొక్కింది.
ఇష్టం లేక బయటపెట్టారు: 6 నెలల క్రితం అమ్మవారి వడ్డాణంలో కొంత భాగం మాయమవడంతో అర్చకులంతా చందాలు వేసుకొని కొత్త ఆభరణం చేయించారు. రెండు నెలల క్రితం మంగళ సూత్రానికి చెందిన తీగ పోవడంతో ఆ సమయంలో ఉన్న అర్చకులు ఆ నష్టాన్ని భర్తీ చేశారు. తాజాగా సుమారు రూ. 15 లక్షల విలువైన బంగారం మాయం కావడంతో మళ్లీ అర్చకులంతా కలసి నష్టం భర్తీ చేయాలనుకున్నారు. ఇది ఇష్టం లేని కొందరు పూజారులు విషయం బయటకు వచ్చేలా చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిగ్గు తేల్చాలని భక్తులు కోరుతున్నారు.
గతంలో శివాలయంలో చోరీ: గుడిలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదేం తొలిసారి కాదు. ఇంతకు ముందు ఇలాంటి ఘటనలు వార్తల్లోకెక్కాయి. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో సమర్పించుకున్న కానుకలను కాపాడాల్సిన అధికారులే కక్కుర్తి పడ్డారు. సాక్షాత్తూ ఆ పరమశివుడి సొమ్ముకే ఎసరు పెట్టారు. గుట్టుచప్పుడు కాకుండా పక్కా ప్లాన్‌తో ఆలయ హుండీకే మారుతాళం వేసి భారీగా నగదును కొల్లగొట్టారు. కృష్ణా జిల్లా యనమలకుదురులోని ప్రసిద్ధ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈ ఘటన కొన్ని నెలల క్రితం వెలుగు చూసింది. ఈ చోరీలో ఆలయ ఈవో, అర్చకులు భాగస్వాములు కావడం స్థానికంగా చర్చనీయాంశమైన విషయం విదితమే.

