బంధాల మధ్య 'బంగారు' చిచ్చు - చదివింపులు ముట్టజెప్పలేక అంతరాలు
పరుగులు పెడుతున్న బంగారం ధర - పసిడి ధర పెరగడంతో కుటుంబాల మధ్య చిచ్చు - శుభకార్యాల్లో పెట్టిన బంగారానికి తిరిగి చెల్లించలేకపోతున్నారు?

Published : October 17, 2025 at 8:28 AM IST
Jewellery Disputes in Family : బంగారం ధర రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతోంది. ఐదేళ్ల క్రితం రూ.50 వేలు ఉన్న బంగారం ధర, ఇవాళ రూ.80 వేలు పెరిగి రూ.1,30,000 చేరింది. దీంతో సామాన్యులు, మధ్య తరగతి వారు దీన్ని కొనేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఇది ఓ మోస్తరు ఆదాయమున్న వారికి కూడా అందకుండా పరుగులు పెడుతోంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో ఒంటి మీద బంగారం వేసుకోవడం, అలాగే కానుకగా బంగారం చదివించడం ఓ ఆనవాయితీ. ఇప్పుడు ఇదే కొందరి కొంపలను ముంచుతోంది.
బంగారం తెచ్చిన గొడవలు :
- ఆరేళ్ల క్రితం నల్గొండ జిల్లా నాంపల్లికి చెందిన ఓ చిరుద్యోగి కుమార్తె పెళ్లికి బంధువులు ఒకరిద్దరు బంగారు ఉంగరాలను పెట్టారు. వారు వారి అవసరాల రీత్యా ఆ ఉంగరాలను వాడుకున్నారు. ఇటీవల బంగారం పెట్టిన వారి ఇంట్లో శుభకార్యం జరగడంతో తిరిగి వారికి ఉంగరం చేయించడం భారంగా మారింది. దీంతో ఆ కుంటుంబాల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తాయి.
- మరోవైపు నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యాపారి గతంలో బంధువుల ఇళ్లల్లో జరిగిన శుభకార్యాలకు బంగారం ఉంగరాలను చదివించారు. ఇటీవల తన కుమార్తె పెళ్లికి వారు అదే స్థాయిలో తిరిగి పెట్టారు. వాటిలో ఆ రెండు బంగారు ఉంగరాలు నకిలీవి అని తేలింది. దీంతో ఎవరు పెట్టారనే అనుమానంతో బంధువులు అందరికీ ఆ కుటుంబం దూరం అయింది.
మంగళగౌరి గొలుసైనా, ఎదురింటి పిన్ని గారి కాసులపేరైనా బంగారం కాకపోవచ్చు :
- ఆభరణం చేయించాక ట్రెండ్ మారిందని కొత్తగా మరొకటి చేయిస్తారు. పది గ్రాములున్న వస్తువును చెరిపి, కొత్తది చేయిస్తే గ్రాము తరుగుతుంది. ఒక వస్తువును పదిసార్లు మారిస్తే ప్రతిసారీ గ్రాము తగ్గి మొదట కొనుగోలు చేసిన మొత్తం తరిగిపోతుంది.
- గ్రామాల్లో పాత తరం పసిడి తరుగు గురించి ఆలోచించేది. లోహం ఏదీ కలవొద్దని తీగ, కడెం, పడిగెలను చేయించేది. అరుగుదలే తప్ప తరుగుదల ఉండదని ఎప్పుడు మార్చినా కొన్నంత బంగారం ఉంటుందని జాగ్రత్త సైతం పడేవారు.
- ఏదైనా శుభకార్యాలలో బంగారు కానుకలు పెట్టినా వాటిని తిరిగి తీసుకునే సంస్కృతి సైతం మారాలి. బంధువుల్లో పేదవారు మిమ్మల్ని కానుకలు పెట్టమని ఏమీ అడగరు. కానీ బ్యాంకు లాకర్లలో దాచిపెట్టినట్లుగా కానుకలను ఇచ్చి, ఏ పదేళ్లకో మీ ఇంట్లో జరిగే శుభకార్యానికి వారి నుంచి తిరిగి ఆశిస్తే వారు ఇవ్వలేని పరిస్థితిలో ఉండొచ్చు. ఇక్కడ కానుక విలువ కన్నా, ఇచ్చే వారి ఆంతర్యం ముఖ్యమైనది.
- వివాహాలు, విందులకు వెళ్లేటప్పుడు చాలా మంది ప్రస్టేజెస్ కోసం విలువైన ఆభరణాలు వేసుకుంటారు. అలాగే కొందరు బంగారం వంటి వస్తువు లేదని ఎలా వెళ్లాలని బాధపడుతుంటారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అవతలి వారు వేసుకునేదంతా బంగారం కాకపోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు ఎన్నో లభిస్తున్నాయి. వాటితో తక్కువ ధరలో అచ్చం బంగారం మెరుపును చూడవచ్చు.
- మీరు వేసుకున్న బంగారం ఎవరైనా తాకి చూస్తారా? ఇది బంగారం అవునా? కాదా? అని. అందుకే పొరిగింటి మంగళగౌరి వేసుకున్న గొలుసైనా, ఎదురింటి పిన్ని గారి కాసులపేరైనా బంగారం కాకపోవచ్చు. అందుకే మనమే ఇతరులను చూసి ఏవో ఆలోచనలు చేయకుండా, ఉన్నదానితోనే సర్దుకుంటే అంతా బాగుంటుంది.
దీపావళికి బంగారం కొనాలా? BIS Care Appతో అసలు, నకిలీ ఆభరణాలను గుర్తించండిలా!
బంగారం ధరలకు రెక్కలు- రూ.1.30 లక్షలు దాటిన 10 గ్రాముల పసిడి ధర

