కృష్ణా డెల్టాకు మరోసారి గోదావరి భరోసా - పట్టిసీమ ద్వారా నీటి తరలింపు
పులిచింతలలో ప్రస్తుతం 32 టీఎంసీలే నిల్వ - గత 11 ఏళ్లుగా పట్టిసీమ నుంచి 442 టీఎంసీల నీటిని వినియోగం

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 9, 2026 at 10:18 AM IST
Godavari Water For Krishna Delta : కృష్ణా డెల్టాకు మరోసారి గోదావరి అండగా నిలుస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా ప్రాజెక్టుల్లోకి నీరు రాకపోడవంతో గడ్డు పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కరువు కారణంగా ఆయకట్టు ఎండిపోకుండా కాపాడటంలో పట్టిసీమ మరోసారి ప్రాణదాత పాత్ర పోషిస్తోంది. పట్టిసీమ పంపుల ద్వారా గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలిస్తున్నారు.
442 TMCల నీటి వినియోగం : ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవట్లేదు! ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టుల్లోకి వరద నీరు రావట్లేదు! ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కృష్ణా డెల్టాకు మరోసారి గోదావరి జలాలే దిక్కయ్యాయి. కృష్ణా డెల్టాకు బ్యాలెన్సింగ్ జలాశయంగా ఉన్న పులిచింతల ప్రాజెక్టులో ఉన్న 32 TMCలు ఏమాత్రం సరిపోని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపు గోదావరి వరద జలాలు మళ్లించాలన్న ఉద్దేశంతో 2015లో చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకమే ఈ సారీ డెల్టాను ఆదుకుంటుంది. గత 11 ఏళ్లుగా 442 TMCల నీటిని పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు వినియోగించారు. డెల్టా కింద తూర్పు, పశ్చిమ కాల్వలతో పాటు గుంటూరు ఛానల్ కింద సుమారు 10 లక్షల 60 వేల ఎకరాలకు గోదావరి జలాలు ఊపిరి పోయనున్నాయి.
సముద్రంలో కలిసిన 100 TMC నీళ్లు : ఈ ఏడాది ఇప్పటివరకు ఆలమట్టి జలశయానికి 12.88 TMCలు, నారాయణపూర్‌కు 3.30 TMCలు, జూరాలకు 4.13 TMCలు, తుంగభద్రకు 2.4 TMCలు, శ్రీశైలానికి 5.76 TMCలు, నాగార్జున సాగర్‌కు 13.65 TMCలు, పులిచింతలకు 2.44 TMCలు, ప్రకాశం బ్యారేజీకి 5.35 TMCలు మాత్రమే నీళ్లు వచ్చాయి. మరోవైపు గోదావరిలో ఈ ఏడాది అత్యంత తక్కువ నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఖరీఫ్ ప్రారంభమైన 37 రోజుల తర్వాత తాజాగా 50 వేల క్యూసెక్కుల నీరు గోదావరికి వచ్చాయి. ధవళేశ్వరం బ్యారేజీ దాటి సముద్రంలోకి ఒక్క TMC కూడా బుధవారం వరకు వెళ్లలేదు. గతేడాది ఇదే సమయానికి సుమారు 100 TMCలు సముద్రం పాలయ్యాయి.
సంతోషం వ్యక్తం చేసిన రైతులు : పట్టిసీమ నుంచి గోదావరి నీటిని ఎత్తిపోయాలంటే ఇక్కడ +14 మీటర్ల నీటిమట్టం ఉండాలి. గోదావరి డెల్టాకు ఆయకట్టు పరిధిలో నీటి ప్రవాహాలు ఇప్పటి వరకు ప్రశ్నార్థకంగా మారాయి. నది ఎగువ ప్రాంతం నుంచి ప్రవాహాలు, అంచనాలను పరిగణనలోకి తీసుకుని ఎత్తిపోతల పంపులను బుధవారం ప్రారంభించారు. పట్టిసీమ నీరు పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి చేరడానికి సుమారు 175 కిలోమీటర్లు ప్రవహించాల్సి ఉంటుంది. దీనికి రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతుంది. పట్టిసీమ ద్వారా గోదావరి నీరు వస్తుండటంతో కృష్ణా డెల్టా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎల్‌నినో వేళ రైతులకు గుడ్‌న్యూస్ - పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీరు
సీఐ నాగరాజును కృష్ణలంక పీఎస్‌లో విచారించేందుకు అనుమతించిన హైకోర్టు

