ETV Bharat / state

నకిలీ మద్యం కేసు - గోవా వ్యాపారి బాలాజీకే అధిక చెల్లింపులు

ప్రధాన నిందితుల ఖాతాల్లో భారీగా లావాదేవీలు - సిట్, ఎక్సైజ్‌ అధికారుల పరిశీలనలో వెలుగులోకి లావాదేవీలు

Mulakalacheruvu Liquor Scam Updates Huge Money Goa Businessman
Mulakalacheruvu Liquor Scam Updates Huge Money Goa Businessman (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 10, 2025 at 10:44 AM IST

3 Min Read
Choose ETV Bharat

Mulakalacheruvu Liquor Scam Updates Huge Money Goa Businessman: నకిలీ మద్యం కేసు వ్యవహారంలో గోవా వ్యాపారి బాలాజీకే అధిక చెల్లింపులు జరిగినట్లు సిట్​, ఎక్సైజ్​దర్యాప్తులో తేలింది. నకిలీ మద్యం తయారీకి స్పిరిట్‌ సరఫరాదారు అతనేనని అధికారులు గుర్తించారు. ప్రధాన నిందితుల అకౌంట్లో భారీగా లావాదేవీలు జరిగినట్లు అధికారుల పరిశీలనలో వెలుగులోకి వచ్చింది.

ఇబ్రహీంపట్నం, ములకలచెరువులో నకిలీ మద్యం వ్యవహారంలో సహ నిందితుల మధ్య పెద్దఎత్తున నగదు లావాదేవీలు జరిగినట్లు తేలింది. ఒకరి నుంచి మరొకరికి బ్యాంకు అకౌంట్లు, యూపీఐ ఐడీల ద్వారా నగదు బదిలీ అయినట్లు సిట్, ఎక్సైజ్‌ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. నిందితులకు సంబంధించిన కొన్నేళ్ల బ్యాంకు స్టేట్‌మెంట్లను అధికారులు వడపోశారు. నకిలీ మద్యం తయారీకి ముడి సరకు, ఇతర వస్తువుల కోసం వీరు అధిక మొత్తం వెచ్చించినట్లు వెల్లడైంది. గోవాలో పరిచయమైన బాలాజీ ద్వారా రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ను ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్‌రావు కొనుగోలు చేసినట్లు సిట్​, ఎక్సైజ్​ దర్యాప్తులో తేలింది.

ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం, అన్నమయ్య జిల్లాలోని నకిలీ మద్యం తయారీ కేంద్రాలకు బాలాజీ స్వయంగా వచ్చి స్పిరిట్, నీటిని 1:1/4 నిష్పత్తిలో కలిపేవాడని అధికారులు గుర్తించారు. తొలుత 2023 మార్చిలో ఇబ్రహీంపట్నంలో 1,200 లీటర్ల మేర నకిలీ మద్యం తయారు చేసినట్లు నిర్థారించారు. సీసాల్లోకి నింపి కేరళ మాల్ట్‌ విస్కీ, మంజీరా విస్కీ, ఓల్డ్‌ అడ్మిరల్‌ బ్రాందీ, రాయల్‌ ల్యాన్సర్, ట్రాపికానా, ఆంధ్రా గోల్డ్, క్లాసిక్‌ బ్లూ విస్కీ వంటి బ్రాండ్ల పేర్లతో లేబుళ్లు అతికించి, విక్రయాలు సాగించాడు. లీటరుకు రూ.350 నుంచి రూ.450 చొప్పున బాలాజీ తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అడ్వాన్స్‌ కింద జనార్దన్‌రావు రూ.20 లక్షలు చెల్లించినట్లు బాలాజీతో పాటు అతని కుమారుడు సుదర్శన్‌కు దాదాపు రూ.2.50 కోట్ల వరకు ముట్టినట్లు తేలింది. ఈ మొత్తాన్ని పలుమార్లు ములకలచెరువులో అందజేసినట్లు అధికారులు గుర్తించారు.

అద్దేపల్లి సోదరులకు చెందిన ఏఎన్‌ఆర్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఖాతా నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. 2019 నుంచి 2025 అక్టోబరు వరకు ఏఎన్‌ఆర్‌ బార్‌కు చెందిన యూనియన్‌ బ్యాంకు ఖాతా నుంచి జనార్దన్‌రావుకు రూ.31 లక్షలు, జగన్మోహన్‌రావుకు రూ.80 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించారు. గత ఏడాది జనవరి నుంచి 2025 సెప్టెంబరు వరకు రవికి రూ.9.50 లక్షలు, 2024 అక్టోబరు నుంచి 2025 సెప్టెంబరు వరకు కల్యాణ్‌ (ఏ12)కు రూ.6.50 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ అయ్యాయి. కల్యాణ్‌ అకౌంట్​లో రూ.1.24 కోట్ల మేర లావాదేవీలను సిట్‌ అధికారులు గుర్తించారు.

లేబుళ్లు, మూతల సరఫరాకు: లేబుళ్ల డిజైన్, ముద్రణకు నకిరికంటి రవి (ఏ4) ద్వారా హైదరాబాద్‌లోని పలువురికి రూ.20 లక్షల వరకు అద్దేపల్లి సోదరులు చెల్లించినట్లు నిర్థరణ అయ్యింది. ఎక్కువగా యూపీఐ ద్వారా సొమ్ము బదిలీ చేసినట్లు తేలింది. కోయంబత్తూరుకు చెందిన వ్యాపారి ఓల్డ్‌ అడ్మిరల్‌ బ్రాందీ సీసాలు తయారు చేసి పంపినందుకు అతనికి ఒక్కో సీసాపై రూ.4.50 చొప్పున చెల్లించామని అన్నారు. కొన్ని సీసాలను సూరంపల్లిలో శ్రీనివాస్‌రెడ్డికి చెందిన పరిశ్రమలో తయారు చేసినట్లు వీటికి రెట్టింపు ధరను జగన్మోహన్‌రావు చెల్లించినట్లు తెలిసింది. మూతల సరఫరా విషయంలోనూ ఇదే విధంగా అధిక ధర ఇచ్చాడు. వీటిని సరఫరా చేసిన మనోజ్‌కుమార్‌ జైన్‌కు ఒక్కో మూతకు రూ.1.50 చొప్పున చెల్లించినట్లు దారబోయిన ప్రసాద్‌కు సాధారణ రేట్ల కంటే అధిక మొత్తమే చెల్లించినట్లు లావాదేవీల ఆధారంగా అధికారులు గుర్తించారు.

బెదిరింపు సందేశాలు ఎవరివి?: నకిలీ మద్యం కేసులో అద్దేపల్లి సోదరుల అరెస్టు తర్వాత, అక్టోబరు 15న ఇబ్రహీంపట్నంలోని వారి ఇంటిని ఎక్సైజ్‌ అధికారులు తనిఖీ చేశారు. వారికి కప్‌బోర్డులో దొరికిన ఓ కవర్‌లో 3 ప్రింటెడ్, ఓ చేతిరాత ఉన్న కాగితం కనిపించింది. కాగితంలో అద్దేపల్లి జనార్దన్‌రావు కుటుంబ సభ్యులను ఉద్దేశించి బెదిరింపు సందేశం కూడా ఉంది. జనార్దన్‌రావును రక్షించుకోవాలి అంటే క్రిప్టో కరెన్సీని జమ చేయాలని ఆ పేపర్​లో రాసి ఉంది. ఆ ప్రింటెడ్‌ షీట్‌లో బిట్‌కాయిన్‌ అడ్రస్‌ సైతం ఉంది. మరో కాగితంలో క్యూఆర్‌ కోడ్‌ ముద్రించి ఉంది. వీటి గురించి నిందితుడి కుటుంబ సభ్యులను విచారించగా, అంతకు 3 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి అందజేసి వెళ్లాడని వారు చెప్పారు. ఈ కవర్‌ ఎవరి నుంచి వచ్చింది? ఎందుకు పంపించారు? అన్నది తేలాల్సి ఉంది.

నకిలీ మద్యం కేసు - సాంకేతిక ఆధారాలతో చిక్కిన నిందితులు

నకిలీ మద్యం కేంద్రాలు పెట్టించింది జోగి రమేషే - అభియోగపత్రంలో సిట్‌