ETV Bharat / state

అమరావతి 'క్వాంటమ్ హ్యాకథాన్‌'లో జీఎంఆర్‌ విద్యార్థుల ప్రతిభ - జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి

క్వాంటం హ్యాకథాన్‌లో జీఎంఆర్‌ కళాశాల విద్యార్థుల ప్రతిభ - క్వాంటమ్ స్టేట్ విజువలైజర్ పేరుతో ప్రాజెక్ట్ రూపకల్పన- కఠిన సమస్యలను సులువుగా అర్థం చేసుకునేలా ఆవిష్కరణ - జాతీయ స్థాయిలో ప్రాజెక్ట్​కు ప్రథమ బహుమతి

Yuva Story on Amaravati Quantum Hackathon
Yuva Story on Amaravati Quantum Hackathon (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 25, 2026 at 10:34 PM IST

|

Updated : February 25, 2026 at 10:39 PM IST

3 Min Read
Choose ETV Bharat

Yuva Story on Amaravati Quantum Hackathon: సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలంటే సాంకేతికతను జోడించాల్సిందే. అందుకు తగ్గట్టుగానే యువతటెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది. ఇందుకు నిదర్శనమే జీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల బృందం. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి జాతీయస్థాయిలో నిర్వహించిన అమరావతి 'క్వాంటమ్ హ్యాకథాన్‌'లో వీరు తీర్చిదిద్దిన ప్రాజెక్టుకు ప్రథమ స్థానం లభించింది. రూ.50,000 నగదు, స్వర్ణ పతకాలు, జ్ఞాపికలతో పాటు ఐబీఎం సంస్థ స్టైఫండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్‌కి వీరిని ఎంపిక చేసింది. వారు తయారు చేసిన ప్రాజెక్ట్‌ ఏంటి? ఆ విద్యార్థులు ఎవరు? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అమరావతి 'క్వాంటమ్ హ్యాకథాన్‌'లో జీఎంఆర్‌ విద్యార్థుల ప్రతిభ - జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి (ETV)

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతలో ఎంతో అత్యాధునికమైంది క్వాంటం కంప్యూటింగ్‌. అత్యంత క్లిష్టమైన సమస్యలను సెకన్లలో పరిష్కరించే ఈ సాంకేతికత ఏఐ సాయంతో ఫైనాన్స్, హెల్త్‌కేర్, డేటా సెక్యూరిటీ, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తోంది. అందుకే క్వాంటం అభివృద్ధికి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. జాతీయ స్థాయిలో అమరావతి 'క్వాంటమ్ హ్యాకథాన్' పేరుతో ఇటీవల ఓ సదస్సు నిర్వహించింది. దేశం నలుమూలల నుంచి సుమారు 800 మంది విద్యార్థులు ఇందులో పాల్గొనగా విజయనగరం జిల్లా రాజాంలోని జీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల బృందం ప్రథమ స్థానంలో నిలిచింది.

స్టేట్ విజువలైజర్ ప్రాజెక్ట్‌: రాజేశ్వరి, సాయి వివేక్, దినేశ్, శివశంకర్, వెంకటకృష్ణ, అబ్దుల్ యూనస్ వీరందరూ జీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. ఎవరికి వారు అందుబాటులో ఉన్న కోర్సులు నేర్చుకుంటూ క్వాంటమ్ స్టేట్ విజువలైజర్ ప్రాజెక్ట్‌ రూపొందించారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్‌లోని క్యూబిట్స్, సూపర్‌పొజిషన్, ఎంటాంగిల్‌మెంట్ వంటి అంశాలను సులభంగా, దృశ్యరూపంలో అర్థం చేసుకోవచ్చని వారు చెబుతున్నారు.

గతేడాది క్వాంటమ్ హ్యాకథాన్‌లో భాగంగా నిర్వహించిన సెమీఫైనల్‌ పోటీల్లో నెగ్గిన వారికి 4 వారాల పాటు క్వాంటమ్‌ టెక్నాలజీపై ట్రైనింగ్ ఇచ్చింది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి. ఆ శిక్షణ తీసుకున్నాక 5 నెలల్లో క్యూబిట్ ట్రేసర్ పేరుతో ఎడ్యుకేషనల్ ప్లాట్ ఫామ్‌గా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దారు జీఎంఆర్ ఐటీ విద్యార్ధులు. ఏఐ ఆధారిత క్వాంటమ్ అసిస్టెంట్, బ్లాక్ స్పియర్ విజువ లైజేషన్, గేమిఫైడ్ లెర్నింగ్, రియల్ హార్డ్‌వేర్ ఇంటిగ్రేషన్ వంటి ఆధునిక ఫీచర్లు జోడించారని ప్రాజెక్ట్ మెంటార్‌ వివరించారు.

విద్యార్థుల ఆవిష్కరణే నిదర్శనం: సీఎస్​ఈ విభాగం ప్రొఫెసర్ల ప్రోత్సాహంతో సాధన మొదలు పెట్టారు ఈ విద్యార్థులు. ఐబీఎం క్వాంటమ్ కంపోజర్, కిస్కిట్ లెర్నింగ్ మాడ్యూల్స్, మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ లెక్చర్స్, అంతర్జాతీయ పరిశోధన పత్రాలను అధ్యయనం చేస్తూ పట్టు సాధించారని కంప్యూటర్ సైన్స్ హెచ్​ఓడీ వెంకటరమణ తెలిపారు. ఐబీఎం సంస్థ స్టైఫండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్‌కి ఎంపిక చేయడమే కాకుండా విద్యార్థులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ప్రకటించడం ఆనందంగా ఉందని కళాశాల ప్రిన్సిపల్‌ ప్రసాద్ తెలిపారు. క్వాంటమ్ కంప్యూటింగ్‌ సాంకేతికతపై విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు అనడానికి ఈ ఆవిష్కరణే నిదర్శనం.

"ఐబీఎం సంస్థ స్టైఫండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్‌కి ఎంపిక చేయడమే కాకుండా విద్యార్థులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ప్రకటించడం ఆనందంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన యాజమాన్యానికి మా కళాశాల తరపున ధన్యవాదాలను తెలియజేస్తున్నాం."-ప్రసాద్, జీఎంఆర్‌ కళాశాల ప్రిన్సిపల్‌

"గతేడాది క్వాంటమ్ హ్యాకథాన్‌లో భాగంగా నిర్వహించిన సెమీఫైనల్‌ పోటీల్లో గెలుపొందాం. అనంతరం మాకు 4 వారాల పాటు క్వాంటమ్‌ టెక్నాలజీపై శిక్షణను అందించింది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి. ఆ శిక్షణ తీసుకున్నాక 5 నెలల్లో క్యూబిట్ ట్రేసర్ పేరుతో ఎడ్యుకేషనల్ ప్లాట్ ఫామ్‌గా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దాం. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు ప్రథమ బహుమతి రావడం అదే విధంగా మాకు స్టైఫండ్​తో పాటు ఇంటర్న్​షిప్​ను అందించి భవిష్యత్తులో ఉద్యోగాలను కల్పించడానికి హామీ ఇచ్చిన ఐబీఎం సంస్థకు మా ధన్యవాదాలు."- జీఎంఆర్ ఐటీ విద్యార్థులు

సివిల్స్‌ పరీక్షలో 3 సార్లు విఫలం - గ్రూప్-1, 2 కొలువులు సాధించిన అక్కాచెల్లెళ్లు

12 రాష్ట్రాల నుంచి 1900 మంది - ఆవిష్కరణలతో ఔరా అనిపిస్తున్న విద్యార్థులు

Last Updated : February 25, 2026 at 10:39 PM IST