ETV Bharat / state

కామెర్లతో దెబ్బతిన్న కాలేయం - వైద్యానికి రూ.30 లక్షలు - సాయం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు

‘అమ్మా నాకు ఏమైంది? అందరూ వచ్చి చూసి వెళ్తున్నారు' - ఆసుపత్రిపాలైన బాలిక భావోద్వేగ ప్రశ్న - ఏం చెప్పాలో తెలియక తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులు - ఆర్థిక సాయం కోసం వేడుకోలు

Girl Hospitalized Due To Liver Damage and Question To Her Parents
Girl Hospitalized Due To Liver Damage and Question To Her Parents (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 29, 2026 at 1:50 PM IST

2 Min Read
Choose ETV Bharat

Girl Hospitalized Due To Liver Damage and Question To Her Parents : ‘నాకు ఏమైంది అమ్మా. అందరూ వచ్చి చూసి, వెళ్తున్నారు ఎందుకు? నా ముక్కులోంచి ఎందుకు రక్తం వస్తోంది నాన్న’ అని ఆసుపత్రి బెడ్డుపై ఉన్న బిడ్డ శక్తినంతా కూడగట్టుకొని ఒక్కో మాట అడగడంతో ఏం చెప్పాలో తెలియక ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. కాయాకష్టం చేసి సంపాదించినా కన్నబిడ్డ ఆరోగ్యం బాగు చేయించుకోలేకపోతున్నామని కన్నీరుమున్నీరవుతున్నారు. ఆమె ఆరోగ్యం కుదుటపడాలంటే రూ.లక్షల్లో ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో సాయం కోసం దాతలను వేడుకుంటున్నారు.

పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం మతుకుమల్లికి చెందిన మల్నీడి వీరాంజనేయులు, వరలక్ష్మి దంపతులకు కుమార్తె సుస్మిత, కుమారుడు సాయి సంతానం. వీరాంజనేయులు బధిరుడు (చెవిటి, మూగ). భార్యతో కలిసి పొలం పనులు చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. సుస్మిత స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ నెల 13న తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో బాలికను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. శరీరంలో రక్తం పల్చబడటం లేదని అక్కడి వైద్యులు గుర్తించారు.

ఆర్థిక స్తోమత లేక : కుటుంబ సభ్యులు విజయవాడ సమీపంలోని మణిపాల్‌ వైద్యశాలలో చేర్పించారు. వైద్యులు అన్ని రకాల పరీక్షలు చేసి కామెర్ల వల్ల కాలేయం దెబ్బతిందని నిర్ధారించారు. కాలేయ మార్పిడి చేయాలని సూచించారు. ఇందుకు రూ.30 లక్షలు అవుతుందన్నారు. అంత వెచ్చించే ఆర్థిక స్థోమత ఆ కుటుంబానికి లేకపోవడంతో బాలికను గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు.

వైద్యశాలలో తనను పలకరించడానికి వస్తున్న బంధువులు, స్నేహితులను చూసిన సుస్మిత ‘నాకు ఏమైంది, అందరూ ఎందుకు వస్తున్నారు?’ అని అడుగుతుంటే సమాధానం చెప్పలేక ఆ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. దాతలు, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సాయం అందించే దాతలు 80080 01708 ఫోన్‌ నెంబర్‌లో సంప్రదించగలరు.

"ప్రాజెక్ట్ పునర్విక": ఇటీవల కర్నూలుకు చెందిన పునర్వికకు అరుదైన వ్యాధి వచ్చి అసలు కదలకుండా చేసేసింది. కాకపోతే అంత ఆపదలోనూ ఆమెను అదృష్టం వరించింది. మంత్రి నారా లోకేశ్ చొరవతో రూ. 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ దక్కింది. ఈ ఘటనే ఓ కొత్త ఆలోచనకు కారణమైంది. అరుదైన వ్యాధులతో ఇబ్బంది పడుతున్న చిన్నారులకు భరోసా కల్పించేందుకు "ప్రాజెక్ట్ పునర్విక" ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు మంత్రి లోకేశ్. అప్పుడే ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యాలు, అమలుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

నారా లోకేశ్ ప్రత్యేక చొరవ: కొంత మంది దాతలు ముందుకొచ్చి విరాళాలు అందించారు. ఓ పది కోట్ల రూపాయలు సమకూరాయి. మిగతా ఆరు కోట్లు ఎలా జమ చేయాలని మథన పడుతున్న సమయంలో వాళ్ల నిరీక్షణకు తెర పడింది. మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని మిగతా ఆరు కోట్ల రూపాయలు అందించి ఆ చిన్నారికి వైద్యం చేయించారు. జోల్​జెన్​ స్మా ఇంజెక్షన్‌తో ఆ పాపకు పునర్జన్మ వచ్చినట్టైంది.

ఎవరైనా దాతలు సాయం చేస్తే తమ కుమార్తె బతుకుతుందని తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

మంత్రి లోకేశ్‌ కీలక నిర్ణయం - అరుదైన జన్యువ్యాధులతో బాధపడే వారికోసం 'ప్రాజెక్ట్ పునర్విక'

ముద్దులొలికే చిన్నారికి అరుదైన వ్యాధి, నిత్యం నరకయాతన - ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు